ETV Bharat / entertainment

అంతరిక్షమే హద్దు.. రాబోయే సైన్స్​ ఫిక్షన్ సినిమాలు ఇవే!

author img

By

Published : Apr 9, 2022, 6:48 AM IST

Upcoming Science Fiction movies 2022
సైన్స్​ ఫిక్షన్ సినిమాలు

Upcoming Science Fiction movies 2022: భారతీయ సినిమా పరిధి పెరిగింది. భిన్నమైన కథలు తెరకెక్కడం వల్ల వాటిని చూసేందుకు ప్రపంచవ్యాప్తంగా సినీప్రియులు ఆసక్తి కనబరుస్తున్నారు. వీటిలో సైన్స్ ఫిక్షన్ సినిమాలు కూడా ఉన్నాయి. వాటికి మంచి ఆదరణ లభిస్తోంది. దీంతో త్వరలోనే మరికొన్ని ఇలాంటి చిత్రాలు అలరించేందుకు సిద్ధమవుతున్నాయి. అవేంటో తెలుసుకుందాం...

Upcoming Science Fiction movies 2022: ప్రేమ అంటూ తిరిగే కథానాయకుడు ఏలియన్స్‌ వెనక పడతాడు. కాలేజీకి వెళ్లే కథానాయిక అంతరిక్ష ప్రయాణానికి సిద్ధపడుతుంది. భూదందాలు చేసే ప్రతినాయకుడు చంద్రమండలాన్ని కబ్జా చేయడానికి ప్రయత్నిస్తాడు. క్లైమాక్స్‌లో వీరి పోరాటం వీధుల్లో కాదు... వినీలాకాశంలోనో..? సాగర గర్భాలలోనో? కావచ్చు. ప్రేక్షకుల ముందుకు వరసగా రానున్న సైన్స్‌ ఫిక్షన్‌ సినిమాలు చేసే మాయే ఇది. ఇక్కడ మారింది హీరోహీరోయిన్ల నటన కాదు... భారతీయ సినిమా పరిధి.

తెలుగు ప్రేక్షకులకు సైన్స్‌ ఫిక్షన్‌ అంటే ముందుగా గుర్తొచ్చే సినిమా ‘ఆదిత్య 369’. కథానాయకుడు బాలకృష్ణ, అగ్ర దర్శకుడు సింగీతం శ్రీనివాసరావుల కలయికలో వచ్చిన ఈ చిత్రం ఆ జోనర్‌ సినిమాల రుచిని మొదటి సారి ప్రేక్షకులకు చూపించింది. కథని మరీ సంక్లిష్టంగా చెప్పకుండా చారిత్రక కోణాన్నీ చూపడంతో ఈ ప్రయోగం విజయవంతమయ్యింది. బాలీవుడ్‌లో గ్రహాంతరవాసి నేపథ్యంలో 2003లో వచ్చిన ‘కోయీ మిల్‌ గయీ’ ఒక క్లాసిక్‌. దీనికి కొనసాగింపుగా...క్రిష్‌, క్రిష్‌2 చిత్రాలు విడుదలై ప్రేక్షకులను అలరించాయి. వీటి తర్వాత ఆయా పరిశ్రమల్లో ఈ తరహా సినిమాలు ఎక్కువగా రాలేదు. ప్రస్తుతం వివిధ భాషల్లో ఇలా సైన్స్‌ ఫిక్షన్‌ కథలు తెరకెక్కుతున్నాయి. ప్రేక్షకుల్లో ఆసక్తి పెంచుతున్నాయి.

సైన్స్‌ ఫిక్షన్‌ సినిమాలకు బడ్జెట్టే తొలి అడ్డంకి. ఎక్కువ గ్రాఫిక్స్‌, భారీ సెట్లు, లొకేషన్లు, తారాలు... ఇలా బోలేడు ఖర్చు వచ్చేది. ఇంత పెట్టుబడి పెట్టడం ఒక్కరికి భారంగా మారేది. ఒకవేళ ఇంత పెట్టినా... తిరిగి రాబట్టుకోగలమనే నమ్మకం తక్కువగా ఉండేది. ఒక సినిమాకు ఐదారుగురు నిర్మాతలుగా వ్యవహరించడం హాలీవుడ్‌ సంస్కృతి. దీనికి భిన్నంగా భారతీయ సినిమాలకు ఒకరే నిర్మాతగా ఉండేవారు. ఈ ధోరణి మారింది. ఇక్కడి సినిమాలకు ఒకరి కన్నా ఎక్కువ మంది నిర్మాతలుగా ఉండటం అంతర్జాతీయ సంస్థలూ భాగస్వాములు అవుతుండటంతో ఈ జోనర్‌లో సినిమాలు రావడానికి ఆస్కారం ఏర్పడింది. ప్రతి ఒక్కరి అరచేతిలోకి సెల్‌ఫోన్‌ రావడంతో ప్రేక్షకుడి ఆవగాహనా పరిధీ పెరిగింది. టైమ్‌ ట్రావెల్‌, కృష్ణ బిలాలు, సాపేక్ష సిద్ధాంతం లాంటి సంక్లిష్టమైన విషయాలను అర్థం చేసుకుంటున్నారు. దీంతో వీటిని ఆధారం చేసుకుని కథలు రాసుకోవచ్చని దర్శకులు ధైర్యం చేశారు. శంకర్‌ దర్శకత్వంలో 2010లో వచ్చిన ‘రోబో’ ఇలాంటి సినిమాలు రావడానికి దారి చూపిందనేది సినీపండితుల అభిప్రాయం. ఆ తర్వాత బాలీవుడ్‌లో వచ్చిన సైన్స్‌ ఫిక్షన్‌ రొమాంటిక్‌ డ్రామా ‘పీకే’ ప్రేక్షకులను విపరీతంగా అలరించింది. అక్కడ నుంచి అడపా దడపా ఇలాంటి సినిమాలు వస్తూనే ఉన్నాయి. వచ్చే రెండేళ్లలో ఈ తరహా చిత్రాలు మరికొన్ని ప్రేక్షకులను అలరించనున్నాయి.

John Abraham Attack 2.. ఇటీవలే విడుదలై ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన ‘అటాక్‌’ చిత్రానికి కొనసాగింపుగా మరో సినిమా ఉంటుందని చిత్ర వర్గాలు ఇప్పటికే ప్రకటించాయి. ఇందులో జాన్‌ అబ్రహం, జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌, రకుల్‌ప్రీత్‌ సింగ్‌ ప్రధాన పాత్రల్లో నటించగా లక్ష్య రాజ్‌ ఆనంద్‌ దర్శకత్వం వహించారు. ఇలా సైన్స్‌ ఫిక్షన్‌ నేపథ్యంతో మరిన్ని సినిమాలు చర్చల దశలో ఉన్నాయి. దర్శకులు కొత్త కథలతో ముందుకు వస్తే హాలీవుడ్‌ తరహాలో పూర్తి స్థాయి సైన్స్‌ ఫిక్షన్‌ చిత్రాలు తెరమీదకు వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుత కాలంలో ఇలాంటి చిత్రాలకు అంతరిక్షమే హదు

Sivakarthikeyan new movie.. 'డాక్టర్‌' చిత్రంతో ఇటీవలే అలరించిన శివకార్తికేయన్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్న తమిళ చిత్రం ‘అయలాన్‌’(ఏలియన్‌). ఇది ఈ సంవత్సరమే ప్రేక్షకుల ముందుకు రానుంది. సైన్స్‌ ఫిక్షన్‌కు కామెడీని జోడించి చెప్పనున్నారని తెలుస్తోంది. ఈ సినిమాకు ఆర్‌ రవి కుమార్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం అనుదీప్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రంలో శివకార్తికేయన్‌ కథానాయకుడిగా నటిస్తున్నారు. ఇది తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానుంది.‘

Prabhas Project K movie.. ప్రభాస్‌, దీపికా పదుకొణె జంటగా నటిస్తున్న ఈ చిత్రం.. ఓ సైన్స్‌ ఫిక్షన్‌ డ్రామా. ‘ప్రాజెక్ట్‌-కె’ అనేది వర్కింగ్‌ టైటిల్‌. ‘మహానటి’తో జాతీయ స్థాయిలో గుర్తింపు సంపాదించిన దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ దీన్ని తెరకెక్కిస్తున్నాడు. వైజయంతీ మూవీస్‌ పతాకంపై అశ్వనీదత్‌ నిర్మిస్తున్నారు. బిగ్‌బీ అమితాబ్‌ ప్రధాన పాత్రలో కనిపిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఇప్పటికే దీనికి సంబంధించిన కొన్ని సన్నివేశాలు రామోజీ ఫిల్మ్‌ సిటీలో చిత్రీకరించారు.

Sarvanand Oke oka jeevitha.. శర్వానంద్‌, అమల, రీతూ వర్మ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న మరో సైన్స్‌ ఫిక్షన్‌ సినిమా ‘ఒకే ఒక జీవితం’. టైం ట్రావెల్‌ నేపథ్యంతో, భావోద్వేగ కుటుంబ కథతో ఈ చిత్రం ఉంటుందని ట్రైలర్‌ని బట్టి అర్థమవుతోంది. యువ దర్శకుడు శ్రీ కార్తీక్‌ ఈ చిత్రానికి దర్శకుడు. డ్రీమ్‌ వారియర్స్‌ పిక్చర్స్‌ పతాకంపై ఎస్‌ఆర్‌ ప్రభు, ఎస్‌ ఆర్‌ ప్రకాష్‌ బాబు నిర్మిస్తున్నారు.

ఇదీ చూడండి: శుభశ్రీకి తాళి కట్టి.. మామకు షాకిచ్చిన ఆలీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.