ETV Bharat / entertainment

మరోమారు 'మల్టీస్టారర్‌' జోరు.. 2023లో భారీ అంచనాల మధ్య రిలీజ్.. హిట్​ కొడతాయా?

author img

By

Published : Jan 4, 2023, 6:44 AM IST

తెరపై ఒక కథానాయకుడు కనిపిస్తేనే.. థియేటర్లలో ప్రేక్షకుల హంగామా ఓ స్థాయిలో ఉంటుంది. అదే ఒకే టికెట్టుపై ఒకేసారి తెరపై ఇద్దరు హీరోల్ని చూసుకునే అవకాశం దొరికితే.. ఆ ఊపు, ఉత్సాహం మరో స్థాయిలో ఉంటాయి. సినీప్రియుల తాకిడికి థియేటర్ల ముందు హౌస్‌ఫుల్‌ బోర్డులు వేలాడాల్సిందే. భారీ వసూళ్లతో బాక్సాఫీస్‌ ముందు రికార్డుల మోత మోగాల్సిందే. మల్టీస్టారర్‌ చిత్రాలు చేసే మ్యాజిక్‌ ఇది. గతేడాది తెలుగులో అరడజనుకు పైగా బహునాయకా చిత్రాలు విడుదలయ్యాయి. వాటిలో చాలా వరకు బాక్సాఫీస్‌ ముందు హిట్టు మాట వినిపించుకున్నాయి. ఇక ఈ ఏడాది కూడా ఈ తరహా చిత్రాల సందడి గట్టిగానే కనిపించనుంది. వాటిలో చాలా వరకు అగ్రతారల సినిమాలే ఉన్నాయి. మరి ఆ చిత్రాలేవి? వాటి విశేషాలేంటి? తెలుసుకుందాం పదండి..

multistarrer movies to be released in 2023
multistarrer movies to be released in 2023

గతేడాది తెలుగులో మల్టీస్టారర్‌ చిత్రాల సందడి బాగా కనిపించింది. 'ఆర్‌ఆర్‌ఆర్‌', 'ఎఫ్‌3', 'బంగార్రాజు', 'గాడ్‌ఫాదర్‌' లాంటి చిత్రాలన్నీ హిట్టు మాట వినిపించి సత్తా చాటాయి. భారీ వసూళ్లు దక్కించుకొని బాక్సాఫీస్‌కు కొత్త కళ తీసుకొచ్చాయి. దీంతో ఈ ఏడాది రానున్న బహునాయకా చిత్రాలపైనా అంచనాలు పెరిగాయి. సంక్రాంతి బరిలో 'వాల్తేరు వీరయ్య'తో వినోదాలు పంచనున్నారు చిరంజీవి, రవితేజ.

ఈ ఇద్దరూ కలిసి నటించిన ఈ మల్టీస్టారర్‌ చిత్రాన్ని బాబీ (కె.ఎస్‌.రవీంద్ర) తెరకెక్కించిన సంగతి తెలిసిందే. మాస్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా ముస్తాబైన ఈ చిత్రంలో చిరు - రవితేజ సవతి సోదరులుగా కనిపించనున్నట్లు సమాచారం. సినిమాలో వీళ్లిద్దరూ కలిసి చేసే సందడి ప్రేక్షకులకు పూనకాలు తెప్పించడం ఖాయమని చెబుతోంది చిత్ర బృందం. అందుకే జనవరి 13న విడుదల కానున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

బాలీవుడ్​లోకి వెంకీ మామ..
తెలుగులో మల్టీస్టారర్‌ చిత్రాలకు చిరునామాగా నిలుస్తుంటారు కథానాయకుడు వెంకటేష్‌. గతేడాది వరుణ్‌తేజ్‌తో కలిసి 'ఎఫ్‌3' రూపంలో వినోదాలు పంచిన ఆయన.. ఈసారి సల్మాన్‌ ఖాన్‌తో కలిసి అలరించనున్నారు. ఇప్పుడీ అగ్రతారలిద్దరూ కలిసి నటిస్తున్న బాలీవుడ్‌ చిత్రం 'కిసీ కా భాయ్‌ కిసీ కా జాన్‌'. ఫర్హాద్‌ సామ్జీ తెరకెక్కిస్తున్నారు. పూజా హెగ్డే కథానాయిక. ఓ సరికొత్త యాక్షన్‌ కామెడీ కథతో రూపొందుతోన్న ఈ చిత్రంలో వెంకీ, పూజాకు సోదరుడిగా కనిపించనున్నట్లు తెలిసింది. అంతేకాదు ఈ సినిమాలో ఓ ప్రత్యేక గీతంలో సల్మాన్‌, వెంకీలతో కలిసి రామ్‌చరణ్‌ కూడా సందడి చేసినట్లు సమాచారం. మరి వీళ్లందరి హంగామా తెరపై ఎలా కనువిందు చేయనుందో తెలియాలంటే ఏప్రిల్‌ 21వరకు వేచి చూడక తప్పదు.

'సలార్'​ను ఢీ కొట్టనున్న ఆ నాయకుడు..
ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో తీరిక లేకుండా గడుపుతున్నారు కథానాయకుడు ప్రభాస్‌. ఈ ఏడాది ఆయన 'సలార్‌' రూపంలో ఓ సరికొత్త బహునాయకా చిత్రాన్ని ప్రేక్షకులకు చూపించనున్నారు. ప్రశాంత్‌ నీల్‌ తెరకెక్కిస్తున్న ఈ పాన్‌ ఇండియా సినిమాని హోంబలే ఫిల్మ్స్‌ సంస్థ నిర్మిస్తోంది. ఇందులో ప్రభాస్‌ను ఢీ కొట్టే ప్రతినాయకుడు వరదరాజ్‌ మన్నార్‌ పాత్రలో మలయాళ స్టార్‌ హీరో పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ నటిస్తున్నారు. మరి ఈ ఇద్దరి స్టార్ల మధ్య సాగే పోరు ప్రేక్షకులకు ఎలాంటి అనుభూతి పంచనుందో తెలియాలంటే సెప్టెంబరు 28వరకు ఎదురుచూడాల్సిందే. వినూత్నమైన యాక్షన్‌ థ్రిల్లర్‌ కథతో రూపొందుతోన్న ఈ చిత్రం ప్రస్తుతం ముగింపు దశ చిత్రీకరణలో ఉంది.

ముస్తాబవుతున్నాయి..
గతేడాది సంక్రాంతికి తన పెద్ద కుమారుడు నాగచైతన్యతో కలిసి 'బంగార్రాజు'తో సందడి చేశారు కథానాయకుడు నాగార్జున. ఇప్పుడాయన తన చిన్న తనయుడు అఖిల్‌తో కలిసి ఓ సినిమా చేయనున్నట్లు సమాచారం. ఇందుకోసం దర్శకుడు మోహన్‌రాజా ఓ చక్కటి కథను సిద్ధం చేసినట్లు తెలిసింది. దీన్ని అన్నపూర్ణ స్టూడియోస్‌ సంస్థలోనే ఎంతో ప్రతిష్ఠాత్మకంగా పట్టాలెక్కించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.

తమిళంలో విజయవంతమైన 'వినోదాయ సిద్ధం'ను తెలుగులో రీమేక్‌ చేయనున్నట్లు ఏడాది కాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులో పవన్‌ కల్యాణ్‌, సాయిధరమ్‌ తేజ్‌ కలిసి నటించనున్నట్లు సమాచారం. సముద్రఖని దర్శకత్వంలో రూపొందనున్న ఈ సినిమా త్వరలో సెట్స్‌పైకి వెళ్లనున్నట్లు తెలుస్తోంది. గతేడాది 'శేఖర్‌'గా ప్రేక్షకుల్ని పలకరించారు కథానాయకుడు రాజశేఖర్‌. ఇప్పుడాయన 'మాన్‌స్టర్‌'గా థ్రిల్‌ పంచేందుకు సిద్ధమవుతున్నారు.

పవన్‌ సాధినేని తెరకెక్కిస్తున్న చిత్రమిది. గ్యాంగ్‌స్టర్స్‌కు పోలీసులకు మధ్య సాగే ఓ ఆసక్తికర కథతో రూపొందుతోంది. ఇందులో రాజశేఖర్‌తో కలిసి అలరించనున్నారు యువ కథానాయకుడు రాజ్‌తరుణ్‌. సెట్స్‌పై శరవేగంగా ముస్తాబవుతున్న ఈ చిత్రం.. ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు తెలిసింది. సంక్రాంతికి చిరంజీవితో కలిసి 'వాల్తేరు వీరయ్య'తో సందడి చేయనున్న రవితేజ త్వరలో మరో మల్టీస్టారర్‌ కథతో మురిపించనున్నట్లు తెలుస్తోంది. 'మానాడు' తెలుగు రీమేక్‌లో ఆయన ఓ హీరోగా కనిపించనున్నట్లు సమాచారం. మరో హీరో పాత్ర కోసం యువ కథానాయకుడు సిద్ధు జొన్నలగడ్డను రంగంలోకి దించనున్నట్లు ప్రచారం వినిపిస్తోంది. ఈ సినిమా కోసం దశరథ్‌తో పాటు పలువురు దర్శకుల పేర్లు వినిపిస్తున్నాయి. ఈ చిత్రం త్వరలో లాంఛనంగా మొదలయ్యే అవకాశాలున్నాయి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.