ETV Bharat / entertainment

జక్కన్నపై లాస్‌ ఏంజిల్స్‌ టైమ్స్‌ కథనం... మధ్యలో పవన్‌ మూవీ గురించి ట్వీట్​!

author img

By

Published : Nov 26, 2022, 8:13 PM IST

harish-shankar-reply-to-netizen-about-pawan-kalyan-movie
జక్కన్నపై లాస్‌ ఏంజిల్స్‌ టైమ్స్‌ కథనం... మధ్యలో పవన్‌ మూవీ!

ఆర్​ఆర్​ఆర్​ సినిమాను ప్రశంసిస్తూ దర్శకుడు రాజమౌళి గురించి లాస్‌ ఏంజిల్స్‌ టైమ్స్‌ ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. అయితే ఈ టాపిక్​ మధ్యలో పవన్​కల్యాణ్​ సినిమా గురించి వచ్చింది. ఆ సంగతులు..

దర్శకధీరుడు రాజమౌళి టేకింగ్‌కు హాలీవుడ్‌ ప్రేక్షకులు, సినిమా ప్రముఖులు ఫిదా అవుతున్నారు. ఇదే విషయాన్ని ప్రముఖంగా ప్రచురిస్తూ విదేశీ మీడియా సైతం ఆయన దర్శకత్వాన్ని మెచ్చుకుంటోంది. జక్కన్న దర్శకత్వంలో తెరకెక్కిన బ్లాక్‌ బస్టర్‌ చిత్రం 'ఆర్‌ఆర్‌ఆర్‌'. ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌లు కీలక పాత్రలు పోషించిన ఈ మూవీ బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయాన్ని అందుకోవడమే కాదు, రూ.1200 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా రాజమౌళి ప్రస్తుతం విదేశాల్లో పర్యటిస్తున్నారు. సినిమాకు సంబంధించిన అంతర్జాతీయ వేదికలపై ప్రసంగిస్తున్నారు. విదేశీ మీడియాకు ప్రత్యేకంగా ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఈ క్రమంలో రాజమౌళి గురించి లాస్‌ ఏంజిల్స్‌ టైమ్స్‌ ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. దీంతో జక్కన అభిమానులు ఆనందంలో మునిగి తేలుతున్నారు.

ట్విటర్‌ వేదికగా ఆ పత్రిక ఇమేజ్‌ను పోస్ట్‌ చేస్తూ శుభాభినందనలు చెబుతున్నారు. అభిమానులే కాదు, సినిమా పరిశ్రమకు చెందిన వారు సైతం అభినందనలు చెబుతున్నారు. ఈ క్రమంలో తెలుగు దర్శకుడికి దక్కిన గౌరవానికి గర్వపడుతూ సదరు పోస్ట్‌ను షేర్‌ చేస్తూ దర్శకుడు హరీశ్‌ శంకర్‌ నమస్కారం ఎమోజీలను ఉంచారు. హరీశ్‌ ట్వీట్‌కు మరో నెటిజన్‌ స్పందిస్తూ 'సర్‌.. పవన్‌కల్యాణ్‌తో మరోసారి సినిమా చేసే అవకాశం మీకు లభించింది. గబ్బర్‌ సింగ్‌లాంటి రొటీన్‌ మసాలా మూవీని మళ్లీ చేయొద్దు. అంతర్జాతీయ స్థాయిలో అందరూ తమ సినిమా అనుకునేలా మూవీ తీయండి. మంచి సినిమాటోగ్రఫీ, బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌ ఉండాలి. హీరో కొడితే ఎగిరిపడే ఫైట్‌ సీన్స్‌ కూడా వద్దు. ప్రతి ఫైట్‌ సహజంగా ఉండాలి' అని కోరాడు.

దీనికి హరీశ్‌ శంకర్‌ సమాధానం ఇచ్చారు. 'మిమ్మల్ని నిరాశపరుస్తున్నందుకు క్షమించండి. మీతో నేను అంగీకరించను' అని అన్నారు. ప్రస్తుతం ఈ ట్వీట్లు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి. పవన్‌కల్యాణ్‌ కథానాయకుడిగా హరీశ్‌ శంకర్‌ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కాల్సి ఉంది. 'భవదీయుడు భగత్‌ సింగ్‌' అంటూ టైటిల్‌ను కూడా ప్రకటించారు. ప్రస్తుతం పవన్‌ అటు రాజకీయాలు ఇటు ముందుగా ఒప్పుకొన్న సినిమాలు చేయాల్సి రావడంతో పవన్‌-హరీశ్‌ శంకర్‌ మూవీ ఆలస్యమవుతోంది.

ఇదీ చూడండి: సైబర్‌ క్రైమ్‌ పోలీసులను ఆశ్రయించిన నరేశ్‌-పవిత్రా లోకేశ్‌.. ఆ ఛానళ్లపై ఫిర్యాదు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.