ETV Bharat / entertainment

'రవితేజ అలా కనిపిస్తారు.. అందుకే 'రామారావు' టైటిల్‌ పెట్టా'

author img

By

Published : Jul 26, 2022, 9:03 PM IST

Raviteja Ramarao on Duty: రవితేజ నటించిన తాజా చిత్రానికి 'రామారావు' అనే టైటిల్‌ పెట్టడానికి గల కారణాన్ని చెప్పారు దర్శకుడు శరత్‌ మండవ. ఇంకా చిత్ర సంగతులను తెలిపారు. ఆ సంగతులివీ...

Ramarao on Duty Raviteja
రామారావు ఆన్​ డ్యూటీ

Raviteja Ramarao on Duty: రవితేజ హీరోగా రూపొందిన సినిమా 'రామారావు ఆన్‌ డ్యూటీ'. శరత్‌ మండవ దర్శకుడు. వాస్తవ సంఘటలనల ఆధారంగా యాక్షన్‌ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా జులై 29న విడుదల కానుంది. ఈ సందర్భంగా శరత్‌ మీడియాతో పలు విశేషాలు పంచుకున్నారు. ఆ వివరాలివీ..

మీ తొలి చిత్రం 'కేవో 2' తర్వాత విరామం తీసుకోవడానికి కారణం?
శరత్‌: కావాలని తీసుకున్న విరామం కాదిది. పెద్ద హీరోలతో చేయాలనుకున్నప్పుడు కాస్త సమయం పడుతుంది. ఎందుకంటే వారి చేతిలో వరుస సినిమాలుంటాయి. ‘కేవో 2’ తర్వాత విశాల్‌తో ఓ ప్రాజెక్టు విషయమై చర్చలు జరిపా. తర్వాత, కొవిడ్‌ వచ్చింది. అలా ఆలస్యమైంది. ఈ కథని రవితేజకు ఎప్పుడో వినిపించా.
'రామారావు ఆన్ డ్యూటీ'.. ఈ టైటిల్ గురించి చెప్తారా.. ?
శరత్‌: రామారావు అనేది చాలా పవర్‌ఫుల్‌ పేరు. ఆ పేరుకి పరిచయం అవసరం లేదు. ఓ సర్వేలో ‘నంబరు వన్‌ తెలుగు పర్సనాలిటీ’గా నందమూరి తారక రామారావు నిలిచారు. ఇప్పుడు జూనియర్‌ ఎన్టీఆర్‌ పేరు మోగుమోగుతోంది. ఇదే పేరున్న కేటీఆర్‌ గొప్ప నాయకుడు. ఇలా ‘రామారావు’ అనే పేరు స్ఫూర్తి నింపుతుంటుంది. అందుకే ఇందులోని కథానాయకుడి పాత్రకు రామారావు అనే పేరు పెట్టా. అదే టైటిల్‌ అయింది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఈ సినిమాలో రవితేజ ఏం డ్యూటీ చేస్తారు?
శరత్‌: సాధారణంగా మిస్సింగ్‌ కేసులను పోలీసులు, క్రైమ్‌ డిపార్ట్‌మెంట్‌ వారు ఛేదిస్తారు. ఇందులో ప్రభుత్వాధికారి అయిన రవితేజ మిస్సింగ్‌ కేసును డీల్‌ చేస్తారు. అది ఎందుకనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. మాస్‌ హీరోగా పేరొందిన రవితేజ నటించిన ‘లార్జన్‌ దేన్‌ లైఫ్‌’ ఇన్వెస్టిగేటివ్‌ థ్రిల్లర్‌ ‘రామారావు ఆన్‌ డ్యూటీ’.
ఈ కథలో ఇసుక మాఫియా అంశం కీలకమా?
శరత్‌: ప్రత్యేకంగా ఇసుక మాఫియా అని కాదు. కలెక్టరేట్‌తో ముడిపడిన విభాగాలన్నిటికీ పలు వ్యవస్థలపై ప్రత్యేక అధికారాలుంటాయి. ఏదైనా సమస్యను పరిష్కరించేందుకు కొన్ని సందర్భాల్లో ఆదేశాలు ఇచ్చే హక్కు కలెక్టరేట్‌కు ఉంటుంది. ఈ విషయాన్ని కొన్ని సన్నివేశాల్లో ప్రస్తావించాం. ఇది నాలుగేళ్ల క్రితం నేను రాసుకున్న కథ. రవితేజ హీరోగా ఎంపికయ్యాక ఆయన ఇమేజ్‌కు తగ్గట్టు కొన్ని మార్పులు చేశా. ఆయన గతంలో పోషించిన పాత్రల ఛాయలు ఈ సినిమాలో లేకుండా చాలా కొత్తగా, విభిన్నంగా ఉండేలా శ్రద్ధ తీసుకున్నా.
ట్రైలర్‌ చూస్తే ఈ సినిమాలో యాక్షన్‌ ఎక్కువగా ఉన్నట్టుంది. రవితేజ నుంచి వినోదాన్ని ఆశించొచ్చా?
శరత్‌: ఎంటర్‌టైన్‌మెంట్‌ అంటే కామెడీ మాత్రమే అని నేను అనుకోను. ప్రేక్షకుడు లీనమయ్యే ఏ అంశాన్నైనా నేను వినోదంగానే భావిస్తా. యాక్షన్‌తోపాటు ఇందులో ఫన్‌ ఉంటుంది. కొన్ని వాస్తవ సంఘటనలు ఆధారంగా తెరకెక్కించిన చిత్రమిది. స్వయంగా నేను చవిచూసిన ఓ ఘటనను ఇందులో చూపించే ప్రయత్నం చేశా.

వేణు తొట్టెంపూడి పాత్ర ఎలా ఉండబోతుంది?
శరత్‌: ఈ కథలో ఎంతో కీలకమైన సీఐ పాత్ర కోసం వేణు తొట్టెంపూడి అయితేనే బాగుంటుందని భావించా. ఇదే విషయాన్ని చెప్పేందుకు ఆయన్ను కలిశా. పాత్ర నచ్చడంతో నటించేందుకు ఒప్పుకున్నారు. భావోద్వేగాలను ఆయనెంత బాగా పండిస్తారో అందరికీ తెలిసిన విషయమే.
సోషల్ మీడియాలో వచ్చే రివ్యూలపై ఘాటు వ్యాఖ్యలు చేయడానికి కారణం?
శరత్‌: సినిమా అనేది వందలాది మంది సమష్టి కృషి. సినిమాని పూర్తిగా చూసి అర్థం చేసుకుని దాని గురించి రాయడంలో ఎలాంటి ఆభ్యంతరం లేదు. రివ్యూలు ఉండాలి. అవి చదివి నేను చాలా నేర్చుకున్నా. తెలుగులో మంచి రివ్యూలు రాసే వారు చాలామంది ఉన్నారు. ఆ విషయం పక్కన పెడితే సినిమా ప్రదర్శితమవుతుండగానే ఫోన్‌లో బంధించి, ‘ఇది తొలి పాట’, ‘ఇది ఫస్ట్‌ ఫైట్‌’, ‘ఇలా ఉంది.. అలా ఉంది’ అంటూ కొందరు సోషల్‌ మీడియాలో రాసేస్తున్నారు. ఈ విధానం సరైంది కాదు. ఓ ప్రొడక్ట్‌ వినియోగదారుడికి చేరకముందే ఇంత నెగిటివిటీ ఎందుకు? అనేది నా అభిప్రాయం.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఏ నేపథ్యంపై మీకు పట్టుందని భావిస్తున్నారు?
శరత్‌: నా బలం ఏంటో నాకు తెలియదుగానీ బలహీనత తెలుసు. దర్శకుడు శేఖర్ కమ్ముల మార్క్‌ సినిమాలను నేను చేయలేను. యాక్షన్, థ్రిల్లర్‌ నేపథ్య కథలను డీల్‌ చేయగలను. ఒక్క ఫైట్ కూడా లేకుండా యాక్షన్ సినిమా చేయొచ్చని బాలీవుడ్‌ దర్శకుడు రాజ్‌కుమార్‌ హిరానీ నిరూపించారు. ఆ తరహాలో ఒక కథ రాసుకున్నా.
కొత్త ప్రాజెక్టుల వివరాలేంటి?
శరత్‌: కథలున్నాయిగానీ ఇప్పటి వరకూ ఏదీ ఫిక్స్‌ అవ్వలేదు. ప్రస్తుతానికి నా దృష్టంతా ‘రామారావు’పైనే. ఈ సినిమా సీక్వెల్ ఆలోచన లేదు. సామాజిక అంశంతో కూడిన సబ్జెక్ట్‌ కాబట్టి ‘కొనసాగిద్దాం’ అని ఎవరైనా ముందుకొస్తే నా ఆలోచనలు పంచుకుంటా.

మరికొన్ని విశేషాలు.. నిర్మాతలు సుధాకర్ చెరుకూరి, శ్రీకాంత్ మంచి సినిమాలు చేయాలని పరితపిస్తుంటారు. ఏ విషయంలోనూ రాజీ పడకుండా ఈ ‘రామారావు’ని నిర్మించారు. రజిషా విజయన్‌.. మాళవిక పాత్రకు పూర్తి న్యాయం చేసింది. ‘విక్రమ్‌ వేద’, ‘ఖైదీ’ సినిమాలకు సంగీతం సమకూర్చిన సామ్‌ సి.ఎస్‌ ‘రామారావు’కి అద్భుతమైన ఔట్‌పుట్‌ ఇచ్చారు. ఈ చిత్రానికి ఎంపికైన తొలి సాంకేతిక నిపుణుడు ఆయనే. నేను కథను బాగా నమ్ముతా అందుకే సినిమా నిడివి ఎంతనే విషయాన్ని పట్టించుకోను. ఈ విషయంలో దర్శకుడు, దివంగత దాసరి నారాయణరావు నాకు స్ఫూర్తి. ‘రాసే క్రమంలో కథే తనకు కావాల్సివన్నీ సమకూర్చుకుంటుంది. హిట్‌, ఫ్లాప్‌ అనేవి మన చేతుల్లో లేవు’’ అని ఆయన చెప్పిన మాటని నేను పాటిస్తా.

ఇదీ చూడండి: ఈ టీవీ స్టార్​ సిల్వర్​స్క్రీన్​ పీస్​.. ఈమె ట్రెండీ లుక్స్​ చూస్తే..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.