ETV Bharat / entertainment

Agent movie review : అఖిల్​ 'ఏజెంట్' ఎలా ఉందంటే ?

author img

By

Published : Apr 28, 2023, 1:37 PM IST

అఖిల్‌ హీరోగా సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన స్పై యాక్షన్‌ థ్రిల్లర్‌ 'ఏజెంట్‌'. ఏప్రిల్ 28న ఈ సినిమా థియేటర్లలో విడుదలయ్యింది. ఇంతకీ ఈ సినిమా ఎలా ఉందంటే?

akkineni akhil agent movie review
akkineni akhil agent movie review

అక్కినేని హీరోలంటే లవ్​ స్టోరీలకు పెట్టింది పేరు. దీనికి త‌గ్గ‌ట్లుగానే ఇప్ప‌టివ‌ర‌కు అదే త‌ర‌హా క‌థ‌ల‌తోనే ప్ర‌యాణిస్తూ వ‌చ్చారు అక్కినేని నట వారసుడు అఖిల్. 'హ‌లో', 'మిస్ట‌ర్ మ‌జ్ను', 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్' సినిమాలతో ప్రేక్షకుల మ‌దిలో ల‌వ‌ర్​ బాయ్ ఇమేజ్​ను సంపాదించుకున్నారు. అయితే ఇప్పుడు ఆ ఇమేజ్‌కు భిన్నంగా మాస్ యాక్ష‌న్ హీరోగా అల‌రించేందుకు 'ఏజెంట్‌'తో ముందుకొచ్చారు. స్టార్​ డైరెక్టర్​ సురేంద‌ర్ రెడ్డి తెర‌కెక్కించిన స్టైలిష్ స్పై యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ ఈ సినిమా. ఇందులో మలయాళ మెగాస్టార్​ మ‌మ్ముట్టి ఓ ముఖ్య పాత్ర పోషించారు. కాగా ఇప్పటివరకు చిత్రీక‌ర‌ణ ఆల‌స్య‌మ‌వ్వడం వల్ల ప‌లుమార్లు వాయిదా ప‌డుతూ వ‌చ్చిన‌ ఈ సినిమా ఎట్ట‌కేల‌కు థియేట‌ర్ల‌లోకి అడుగుపెట్టింది. అసలు ఈ 'ఏజెంట్' క‌థేంటి? ఈ సినిమా కోసం అఖిల్ ప‌డిన రెండేళ్ల క‌ష్టం ఎలాంటి ఫ‌లితాన్నిచ్చింది? ఆ విశేషాలు మీ కోసం..

స్టోరీ ఏంటంటే.. రిక్కీ అలియాస్‌ రామకృష్ణ (అఖిల్‌) ఓ మిడిల్​ క్లాస్​ కుర్రాడు. స్పై అవ్వడమే లక్ష్యంగా జీవిస్తుంటాడు. ఇందుకోసమే 'రా'లో జాయిన్​ అయ్యేందుకు మూడుసార్లు పరీక్ష రాస్తాడు. కానీ, ఇంటర్వ్యూలో మాత్రం రిజెక్ట్‌ అవుతుంటాడు. దీంతో ఇలా ప్రయత్నిస్తే లాభం లేదనుకొని తన ఎథికల్‌ హ్యాకింగ్‌ స్కిల్స్​తో ఏకంగా 'రా' చీఫ్‌ డెవిల్‌.. అలియాస్‌ మహదేవ్‌ (మమ్ముట్టి) సిస్టమ్‌ను హ్యాక్‌ చేసి.. అతని దృష్టిలో పడే ప్రయత్నాలు చేస్తాడు. కానీ, రిక్కీ కోతి చేష్టలు చూసిన ఆయన.. ఈ సారి కూడా తనను రిజెక్ట్‌ చేసి వెళ్లిపోతాడు.

ఇదిలా ఉండగా.. మరోవైపు భారత దేశాన్ని నాశనం చేసేందుకు గాడ్‌ అలియాస్‌ ధర్మ (డినో మోరియా) చైనాతో కలిసి 'మిషన్‌ రాబిట్‌' అనే పేరుతో ఓ భారీ కుట్రకు ప్రణాళికలు సిద్ధం చేస్తాడు. అయితే వీళ్ల కుట్రను చేధించి, 'మిషన్‌ రాబిట్‌'ను అడ్డుకునేందుకు తన ఏజెంట్‌ సాయంతో ఓసారి ప్రయత్నించిన మహదేవ్‌.. లక్ష్య ఛేదనలో విఫలమవుతాడు. దీంతో ఆయన రెండోసారి ఆ మిషన్‌ కోసం రిక్కీని రంగంలోకి దించుతాడు.

మరి 'రా'కు పనికి రాడని పక్కకు పెట్టేసిన రిక్కీని అంత పెద్ద మిషన్‌ కోసం మహదేవ్‌ ఎందుకు రంగంలోకి దింపాడు? ఆయన ఆదేశాల్ని పక్కకు పెట్టిన రిక్కీ కొని తెచ్చుకున్న ప్రమాదాలేంటి? అసలు స్పై అవ్వాలన్న తన లక్ష్యం వెనకున్న బలమైన కారణం ఏంటి? అతను మిషన్‌ రాబిట్‌ను ఎలా అడ్డుకున్నాడు? వైద్య (సాక్షి వైద్య)తో అతని ప్రేమాయణం ఏమైంది? ఈ కథలో కేంద్రమంత్రి జయకిషన్‌ (సంపత్‌ రాజ్‌) పాత్ర ఏంటి? ఇలాంటి ప్రశ్నలన్నింటికీ సమాధానమే మిగాత కథ.

akkineni akhil agent movie review
అఖిల్​, సాక్షి వైద్య

సినిమా ఎలా ఉందంటే: దేశభక్తి నేపథ్యంగా సాగే ఈ స్పై యాక్షన్‌ థ్రిల్లర్​లో.. ముగ్గురు 'రా' ఏజెంట్ల మధ్య సాగే పోరాటంలా సాగుతుంది ఈ సినిమా. అందులో ఒకరు దేశాన్ని నాశనం చేయడమే లక్ష్యంగా ఉంటే.. మరో ఇద్దరు ఆ కుట్రను అడ్డుకునేందుకు ఎలా పోరాడారన్నది ఆసక్తికరం. ఇటీవల వచ్చిన 'పఠాన్‌' కూడా ఇంచుమించు ఈ తరహా కథాంశమే. అయితే ఆ సినిమాలో ఉన్నంత యాక్షన్‌ హంగామా, థ్రిల్లింగ్‌ ఎలిమెంట్స్‌ ఈ సినిమాలో మిస్‌ అయ్యాయని టాక్​. నిజానికి ఇలాంటి ఈ తరహా స్పై యాక్షన్‌ థ్రిల్లర్స్‌లో కథ ఓ చిన్న లైన్‌గానే ఉంటుంది. యాక్షన్, థ్రిల్లింగ్‌ మూమెంట్స్‌కే ఎక్కువ ప్రాధాన్యం సంతరించుకుంటుంది. వాటిని ఎంత ఆసక్తికరంగా తీర్చిదిద్దారన్న విషయంపైనే మూవీ సక్సెస్​ ఆధారపడి ఉంటుంది. ఈ విషయంలో 'ఏజెంట్‌' ఆశించిన స్థాయిలో మెప్పించదు.

మహదేవ్‌ను రిక్కీ కాల్చి చంపడం.. ఆ వెంటనే అతన్ని చంపేయమని 'రా' సంస్థ ఆదేశాలు ఇవ్వడంతో సినిమా ఆసక్తికరంగా ప్రారంభమవుతుంది. అక్కడి నుంచి రిక్కీ వాయిస్‌ ఓవర్‌తో కథ ముందుకెళ్తుంది. కలలో ఏజెంట్‌గా అఖిల్‌ ఎంట్రీ ఫైట్‌ ఆకట్టుకుంటుంది. స్పై అవ్వడం కోసం రిక్కీ చేసే ప్రయత్నాలతో తొలి పదిహేను నిమిషాలు.. ఆ తర్వాత వైద్యతో సాగించే ప్రేమాయణంతో మరో ఇరవై నిమిషాలు సినిమా సాదాసీదాగా సాగిపోతుంది.

వైద్యను వేధించినందుకు కేంద్రమంత్రి జయకిషన్‌ ఇంటికి వెళ్లి రిక్కీ వార్నింగ్‌ ఇచ్చే సీన్‌తో కథకు మళ్లీ ఊపొస్తుంది. భారత్‌ను నాశనం చేసేందుకు గాడ్‌ మిషన్‌ రాబిట్‌ను మొదలు పెట్టడం.. దాన్ని అడ్డుకునేందుకు మహదేవ్, రిక్కీని రంగంలోకి దింపడంతో సినిమా కాస్త వేగం పుంజుకుంటుంది. ఇంటర్వెల్​కు ముందు బీస్ట్‌ లుక్‌తో అఖిల్‌ చేసే యాక్షన్‌ హంగామా, మహదేవ్‌ ఆదేశాల్ని పక్కకు పెట్టి జయకిషన్‌ గ్యాంగ్‌ను ఏరివేసే తీరు అలరిస్తుంది. దీంతో సెకండాఫ్‌ ఏం జరగనుందా అన్న ఆసక్తి ప్రేక్షకుల్లో మొదలవుతుంది. అయితే ఆ తర్వాత నుంచే కథ పూర్తిగా గాడి తప్పినట్లు అనిపిస్తుంది.

నిజానికి 'రా' చేపట్టే ఆపరేషన్‌లు.. వాళ్లు శత్రువుల కుట్రల్ని ఛేదించే తీరు చాలా ఆసక్తిరేకెత్తిస్తూ, ఊహలకు అందని రీతిలో సాగుతుంటాయి. ఆ వ్యవస్థ పనితీరు అంతా ఓ మైండ్‌ గేమ్‌లా ఉంటుంది. అయితే దాన్ని ఈ సినిమాలో సమర్థంగా చూపించలేకపోయారు. కొన్ని ఎపిసోడ్లు చూస్తే అసలు 'రా' పనితీరుపై ఏమాత్రం పరిశోధన చేయకుండా సినిమా తీసినట్లు అనిపిస్తుంది. 'రా' టీమ్​ వేసే ఎత్తును ప్రతినాయకుడు తన ఆఫీస్‌లో కూర్చొని వీడియోలో గమనించేస్తుండటం మరీ సిల్లీగా అనిపిస్తుంది.

ఫస్ట్​ హాఫ్​తో పోల్చితే సెకెండ్​ ఆఫ్​లోనే యాక్షన్‌ డోస్‌ ఎక్కువగా కనిపిస్తుంది. ప్రతి పది నిమిషాలకు ఓ ఫైట్‌ లేదా ఛేజింగ్‌ ఎపిసోడ్‌ వస్తుంది. అందులో కొన్ని ఆకట్టుకుంటే మరికొన్ని లాగ్​లా అనిపిస్తాయి. పతాక సన్నివేశాల్లో వచ్చే యాక్షన్‌ ఎపిసోడ్‌ కూడా సాదాగానే ఉంటుంది. అందరూ ఊహించినట్లుగానే రిక్కీ, ధర్మను అంతం చేసి మిషన్‌ రాబిట్‌ను అడ్డుకోవడంతో ఈ కథకు ముగుస్తుంది.

akkineni akhil agent movie review
అఖిల్​

ఎవరెలా చేశారంటే: ఈ పాత్ర కోసం అఖిల్‌ పడిన కష్టమంతా తెరపై ప్రతి ఫ్రేమ్‌లో కనిపిస్తుంది. దర్శకుడు ఆయన్ను స్టైలిష్‌ లుక్‌లో ఆకట్టుకునేలా చూపించారు. పోరాట ఘట్టాల కోసం అఖిల్‌ రిస్క్​ చేసి పని చేసినట్లు అర్థమవుతుంది. యాక్టింగ్​ పరంగానూ ఈ సినిమాలో అఖిల్​ కొత్తగా కనిపించారు. ఇక​ 'రా' చీఫ్‌గా డెవిల్‌ పాత్రలో మమ్ముట్టి నటన సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. ఆయన ఇమేజ్, అనుభవం ఆ పాత్రకు మరింత నిండుదనాన్ని తెచ్చాయి. ప్రతినాయకుడిగా డినో మోరియా పాత్రను తీర్చిదిద్దిన తీరు రొటీన్‌గా ఉన్నప్పటికీ కథలో బాగానే సెట్‌ అయ్యింది.

సాక్షి వైద్య కొన్ని రొమాంటిక్‌ సన్నివేశాలు, రెండు, మూడు పాటలకే పరిమితమైంది. నిజానికి అఖిల్‌కు ఆమెకు మధ్య వచ్చే లవ్‌ ట్రాక్‌ కథకు స్పీడ్‌ బ్రేకర్‌లా అడ్డు తగులుతున్నట్లు అనిపిస్తుంది. అసలు ఆ లవ్‌ ట్రాక్‌ లేకున్నా కథకు వచ్చే నష్టం ఏముండదు. వరలక్ష్మీ శరత్‌ కుమార్, సంపత్‌ రాజ్, మురళీ శర్మ లాంటి స్టార్స్​ కూడా బాగా యాక్ట్ చేశారు. సురేందర్‌ రెడ్డి తెరకెక్కించిన స్టైలిష్‌ యాక్షన్‌ చిత్రాల్లో ఈ సినిమాకు ఓ ప్రత్యేక స్థానం ఉంటుంది. అయితే కథను ఆసక్తికరంగా తీర్చిదిద్దకపోవడం, ప్రేక్షకులు ఆశించే మలుపులు, థ్రిల్లింగ్‌ మూమెంట్స్‌ లేకపోవడం వల్ల ఈ చిత్ర ఫలితాన్ని దెబ్బ తీసింది. రసూల్‌ అందించిన నేపథ్య సంగీతం సినిమాకు అదనపు ఆకర్షణగా నిలిచింది. కానీ, పాటలు ఏమాత్రం ఆకట్టుకోవు. రసూల్‌ ఎల్లోర్‌ ఛాయాగ్రహణం చక్కగా కుదిరింది. నిర్మాణ విలువలు చాలా ఉన్నతంగా ఉన్నాయి.

బలాలు: + అఖిల్, మమ్ముట్టి నటన; + పోరాట ఘట్టాలు; + ఇంటర్వెల్‌ ఎపిసోడ్‌

బలహీనతలు: -కొత్తదనం లేని కథ; - నాయకానాయికల లవ్‌ ట్రాక్‌

చివరిగా: రెగ్యులర్‌ టెంప్లేట్‌తో సాగే రొటీన్‌ స్పై థ్రిల్లర్‌ 'ఏజెంట్‌'

గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.