ETV Bharat / crime

Gandhi Hospital Rape: గాంధీలో దారుణం.. అక్కాచెల్లెళ్లపై సామూహిక అత్యాచారం..!

author img

By

Published : Aug 17, 2021, 4:32 AM IST

రాజధానిలో దారుణం జరిగింది. గాంధీ ఆసుపత్రిలో చికిత్స కోసం ఓ రోగికి.. సహాయకులుగా వచ్చిన అక్కాచెల్లెళ్లు.. అత్యాచారానికి గురయ్యారు. అదే ఆసుపత్రిలో పనిచేస్తున్న రేడియోగ్రాఫర్‌, అతడి స్నేహితులు... గదిలో నిర్బంధించి మత్తు మందిచ్చి.. వారం రోజుల పాటు సామూహిక అత్యాచారం చేశారు. నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. ఆచూకీ లభించని మరో మహిళ కోసం ప్రశ్నిస్తున్నారు.

two women kidnaped and raped by gandhi hospital staff for one week
two women kidnaped and raped by gandhi hospital staff for one week

పేదల ఆరోగ్యానికి నిలయంగా ఉన్న గాంధీ ఆస్పత్రి.. ఓ దారుణానికి వేదికయ్యింది. దూరపు బంధువు ఉన్నాడనే నమ్మకంతో.. చికిత్స కోసం భర్తను, తనకు సాయంగా ఉంటుందని చెల్లెల్ని తీసుకువచ్చిన మహిళ మోసపోయింది. చివరికి ఆమె కుమారుడి అనుమానంతో.. బంధువును ప్రశ్నించగా అసలు విషయం బయటకు వచ్చింది. తన తల్లి, పిన్ని కనిపించడం లేదంటూ.. బాధితురాలి కుమారుడు రేడియోగ్రాఫర్‌ ఉమామహేశ్వర్‌ను నిలదీయగా.. ఎక్కడున్నారో చూద్దామంటూ ఆదివారం సాయంత్రం ఆస్పత్రి అంతా కలియతిప్పాడు. ఓ చోట శరీరంపై అరకొర దుస్తులతో అపస్మారక స్థితిలో ఉన్న పిన్ని కనిపించింది. సపర్యలు చేసి ఆమెను మహబూబ్‌నగర్‌ తీసుకువెళ్లారు. జరిగిన దారుణాన్ని అక్కడ ఆమె వివరించింది. దాంతో... సోమవారం స్థానిక పోలీసులకు తెలిపారు. హైదరాబాద్‌లోనే ఫిర్యాదు చేయాలని చెప్పడంతో.. చిలకలగూడ ఠాణాలో ఫిర్యాదు చేశారు.

కూమారుని అనుమానంతో వెలుగులోకి...

మహబూబ్‌నగర్‌ జిల్లాకు చెందిన ఓ వ్యక్తి మూత్రపిండాల వ్యాధితో ఈ నెల 5న గాంధీ ఆసుపత్రిలో చేరారు. భార్య, మరదలు ఆయనకు సహాయకులుగా వచ్చారు. కుమారుడు రోజూ ఆసుపత్రికి వచ్చి వెళ్లేవాడు. ఆసుపత్రిలోని రేడియోగ్రాఫర్‌ ఉమామహేశ్వర్‌ ఆ మహిళలకు దూరపు బంధువుకావడంతో.. వారు అతడితో మాట్లాడేవారు. ఈ నెల 8 నుంచి అక్కాచెల్లెళ్లిద్దరూ కనిపించలేదు. రోగి కుమారుడు వెళ్లి ఉమామహేశ్వర్‌ను అడగ్గా.. విషయం వెలుగులోకి వచ్చింది.

కల్లులో మత్తుమందు కలిపి...

ఉమామహేశ్వర్‌ ఈ నెల 8న ఆ మహిళలను ఒక గదికి తీసుకెళ్లి కల్లులో మత్తుమందు కలిపి తాగించాడని తెలుస్తోంది. వారు అపస్మారక స్థితిలోకి వెళ్లిన తర్వాత.. ఉమామహేశ్వర్‌తో పాటు మరికొందరు వారిపై సామూహికంగా అత్యాచారం చేశారు. ఎవరికైనా చెబితే చంపేస్తామంటూ బెదిరించారు. మర్నాడు వారిద్దరినీ సెల్లార్‌లోని చీకటి గదిలోకి తీసుకెళ్లి మరోమారు అఘాయిత్యానికి పాల్పడ్డారు. అనంతరం నగరంలోని పలు ప్రాంతాలకు తీసుకెళ్లారు. మహిళ ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న అనంతరం పోలీసులు ఉమామహేశ్వర్‌ తో పాటు.. ఆరుగురుని అదుపులోకి తీసుకున్నారు.

మరో మహిళ ఆచూకీ కోసం..

అత్యాచార బాధితుల్లో మరో మహిళ ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు. నిందితుడు ఉమామహేశ్వర్‌ను విచారిస్తున్నట్లు తెలుస్తోంది. మరికొందరిని ప్రశ్నించారు. ఈ ఘటనపై ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రాజారావు విచారణకు ఆదేశించారు.

ఇదీ చూడండి:

గాంధీ ఆస్పత్రిలో దారుణం.. మత్తు మందు ఇచ్చి అత్యాచారం!

'గాంధీ ఆస్పత్రి'లో అత్యాచారం కేసులో విచారణ వేగవంతం: ఏసీపీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.