Fb Cheating: అమ్మాయి పేరుతో చాటింగ్... కోటి కొల్లగొట్టిన కిలాడి దంపతులు

author img

By

Published : Nov 24, 2021, 5:19 AM IST

facebook

చదివింది ఇంజినీరింగ్‌...! ప్రముఖ బహుళజాతి కంపెనీలో ఉద్యోగం సైతం సంపాదించాడు. అయినా అప్పనంగా వచ్చే సొమ్ముపై ఆశపట్టాడు. జూదానికి అలవాటుపడి ఉన్న ఉద్యోగం ఊడగొట్టుకున్నాడు. ఆ తర్వాత తేలిగ్గా డబ్బులు సంపాదించాలనే ప్రయత్నంలో సామాజిక మాధ్యమాల వేదికగా కోటి రూపాయలకు పైగా మోసం చేశాడు. ఇతడికి అతని భార్య సైతం సహకరించింది. చివరకు బెట్టింగ్‌లో సొమ్ము పొగొట్టుకొని కేసులపాలయ్యాడు.

అమ్మాయి పేరుతో చాటింగ్... కోటి కొల్లగొట్టిన కిలాడి దంపతులు

సామాజిక మాధ్యమం ఫేస్‌బుక్‌ ద్వారా సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ (Software Engineer) విజయ్‌ని గుంటూరు జిల్లాకు చెందిన కిలాడి దంపతులు పెళ్లి పేరుతో మోసం చేశారు. కల్యాణిశ్రీ పేరుతో ఫేస్‌బుక్‌ ద్వారా (Fb Cheating) పరిచయం చేసుకుని ఏడాదిన్నరపాటు ప్రేమాయణం పరిణయం అంటూ మాయమాటలతో బోల్తా కొట్టించారు. చేబదులు, ఖర్చులంటూ దశలవారీగా కోటి కాజేశారు. మోసపోయానని గ్రహించిన సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ ఫిర్యాదుతో సైబర్‌ క్రైమ్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు.

ఫేస్​బుక్​లో...

బహుళజాతి సంస్థలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పనిచేస్తున్న సికింద్రాబాద్‌కు చెందిన విజయ్‌కి నలభైఏళ్లు వస్తున్నా పెళ్లికాలేదు. మూడేళ్ల నుంచి ఫేస్‌బుక్‌లో (Fb Cheating) ఫ్రెండ్‌షిప్‌ రిక్వెస్ట్‌లు పంపుతున్నాడు. బాధితుడి ప్రొఫైల్‌ను ఏడాదిన్నర క్రితం చూసిన యర్రగుడ్ల దాసు... కల్యాణి శ్రీ పేరుతో పరిచయం చేసుకున్నాడు. విజయవాడలో తానుంటున్నానని... సంప్రదాయ కుటుంబమని మభ్యపెట్టాడు. ప్రేమిస్తున్నానని చెప్పి... ఫోన్‌ చేయడం, విజయవాడకు రావొద్దని షరతు విధించాడు. కేవలం ఛాటింగ్‌ ద్వారానే మాట్లాడుకుందామని వివరించాడు.

కోటి కాజేసి...

దాసును నిజంగానే కల్యాణి శ్రీ అనుకున్న సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ తాను కూడా ప్రేమిస్తున్నానని, ఇష్టమైతే పెళ్లి చేసుకుందామని తెలిపాడు. తనకు 50కోట్ల ఆస్తి ఉందని చెప్పి... కొన్ని వివాదాలున్నాయంటూ అప్పుడప్పుడు లక్షల్లో డబ్బు పంపించాలని దాసు కోరాడు. ఖర్చులు, ఇతర అవసరాల పేరుతో ఏడాదిలో కోటి కాజేశాడు. బాధితుడికి అనుమానం రాకుండా భార్య జ్యోతి బ్యాంక్‌ ఖాతాల్లో నగదు వేయించాడు.

కొల్లగొట్టిన సొమ్ము కోల్పోయి...

పెళ్లిపేరుతో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ను మోసంచేసిన దాసు నూజివీడు ట్రిపుల్‌ఐటీ విద్యార్థి. ఏడేళ్ల క్రితం బీటెక్‌ పూర్తిచేసి హైదరాబాద్‌ టీసీఎస్​లో ఆర్నెళ్లు పనిచేశాడు. అక్కడ ఆన్‌లైన్‌ రమ్మీకి బానిసై ఉద్యోగం పోగొట్టుకున్నాడు. ఆన్‌లైన్‌ రమ్మీతో పాటు క్రికెట్‌ బెట్టింగ్‌ ఆడి అప్పులపాలయ్యాడు. జీవనోపాధి కోసం పండ్లబండిని పెట్టుకున్నాడు. మోసం చేసి డబ్బు సంపాదించేందుకు కల్యాణి శ్రీ పేరుతో ఫేస్‌బుక్‌ ప్రొఫైల్‌ సృష్టించి అమాయకులను వంచించాడు. సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ విజయ్‌ నుంచి కొల్లగొట్టిన కోటి రూపాయలను దంపతులిద్దరూ బెట్టింగ్‌లోనే పోగొట్టుకున్నారు. సర్వం పోగొట్టుకుని సత్తెనపల్లిలోని ఓ చిన్నగదిలో నివాసముంటున్నారు.

ఇదీ చదవండి: Congress Counter Attack: కాంగ్రెస్​ కౌంటర్​ రాజకీయం.. తెరాస, భాజపాలపై విమర్శల అటాక్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.