ETV Bharat / crime

Ganja Smuggling: గంజాయి దారులు మూసేలా .. పోలీసు, ఎక్సైజ్‌ శాఖల వ్యూహం!

author img

By

Published : Nov 1, 2021, 6:38 AM IST

Ganja Smuggling
గంజాయి

రాష్ట్రం మీదుగా గంజాయి రవాణా, వినియోగంపై ఉక్కుపాదం మోపాలన్న ప్రభుత్వ ఆదేశాల మేరకు పోలీసుశాఖ అందుబాటులో ఉన్న అవకాశాలన్నింటిపై దృష్టిసారించింది. ముందుగా రవాణా మార్గాలపై కన్నేసింది. పనిలోపనిగా పాత పద్ధతిలో ఇన్ఫార్మర్ల వ్యవస్థను బలోపేతం చేయడం ద్వారా అక్రమ రవాణాను అడ్డుకునేలా కార్యాచరణ రూపొందిస్తోంది.

గంజాయి అక్రమ రవాణా అంశంపై సీఎం కేసీఆర్‌ సమీక్ష అనంతరం ఆబ్కారీ, పోలీసుశాఖలు సోదాలు విస్తృతం చేశాయి. తనిఖీలలో రోజూ రాష్ట్రవ్యాప్తంగా భారీగా గంజాయి పట్టుబడుతోంది. ఈ నేపథ్యంలో నిల్వల మీద కాకుండా సరఫరా మీదనే దృష్టిపెడితే మరింత కట్టుదిట్టం చేయవచ్చని ఇటీవల జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో పోలీసుశాఖ నిర్ణయానికి వచ్చింది. నిజానికి ఒకప్పుడు తెలంగాణలోనూ గంజాయి భారీగానే సాగయ్యేది. ముఖ్యంగా నారాయణ్‌ఖేడ్‌ ఈ సాగు, రవాణాకు ప్రధాన కేంద్రంగా ఉండేది. పూర్వ వరంగల్‌, ప్రస్తుత భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లోని అటవీ ప్రాంతాల్లోనూ వేలాది ఎకరాల్లో సాగయ్యేది. పోలీసుల దాడులు పెరగడంతో సాగు బాగా తగ్గింది. అయినా వినియోగం మాత్రం గతం కన్నా పెరిగినట్టు పోలీస్‌, ఎక్సైజ్‌శాఖల అంతర్గత అధ్యయనంలో తేలింది. అత్యధికంగా ఈ పంట సాగవుతున్న ప్రాంతాల్లో ఒకటైన ఉత్తరాంధ్ర నుంచి ఇతర ప్రాంతాలకు సరఫరా చేసేందుకు హైదరాబాద్‌ ప్రధాన ద్వారంగా మారిందనీ రెండు శాఖలు అంచనాకు వచ్చాయి.

వాహనాలను ముందే గుర్తించేలా

సాధారణంగా గంజాయి కేసుల్లో ప్రమేయమున్న పాత నేరస్థుల కదలిలపై నిఘా ఉంచడంతోపాటు ఇన్ఫార్మర్లకు డబ్బులు ఇచ్చి అక్రమ రవాణా సమాచారాన్ని తెలుసుకుంటారు. తెలివిమీరిన నేరగాళ్లు అక్రమ రవాణా సమయంలో సెల్‌ఫోన్‌లు వాడటం మానేయడంతో వారి కదలికలపై పక్కా సమాచారం అందడం లేదు. ఈ క్రమంలో కేవలం సాంకేతిక సమాచారంపైనే ఆధారపడకుండా, ఇన్‌ఫార్మర్ల వ్యవస్థను పటిష్ఠం చేయడంపై యంత్రాంగం దృష్టి సారించింది. ఏవోబీలో ప్రారంభమయ్యే అక్రమ రవాణా వాహనాల సమాచారం తెలుసుకుని తెలంగాణ సరిహద్దుల్లోకి రాగానే పట్టుకోవాలనేది అధికారుల వ్యూహం.

తనిఖీలు పెంచే దిశగా

త్తరాంధ్ర నుంచి ప్రధానంగా ఏపీలోని రాజమహేంద్రవరం, ఖమ్మం, సూర్యాపేట మీదుగా హైదరాబాద్‌కు, అలాగే రాజమహేంద్రవరం, విజయవాడ మీదుగా హైదరాబాద్‌కు మార్గాలున్నాయి. ఇవిగాక విశాఖపట్నం నుంచి చింతూరు, భద్రాచలం వయా వరంగల్‌ మీదుగా హైదరాబాద్‌కు రావొచ్చు. ఇక్కణ్నుంచి జనగామ, నారాయణ్‌ఖేడ్‌ మీదుగా మహారాష్ట్రకు గంజాయి రవాణా అవుతోంది. ఈ రహదారులపై నిఘాపెట్టి తనిఖీలు నిర్వహించగలిగితే రవాణాను కట్టడి చేయవచ్చని అధికారులు నిర్ణయానికొచ్చారు. ‘‘చిన్నచిన్న ట్రక్కుల్లో కూరగాయలు, ఇతర సామగ్రి మాటున సరకు రవాణా అవుతోంది. కొద్ది మొత్తంలో అయితే కార్లనూ వినియోగిస్తున్నారు. అందుకే ఉత్తరాంధ్ర నుంచి వస్తున్న వాహనాలపై నిఘా పెంచాలనుకుంటున్నాం. గతంలో గంజాయి వ్యాపారం చేసిన వారిపైనా నిఘా పెడుతున్నాం. పట్టుబడ్డ వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, పీడీ చట్టం ప్రయోగించాలని భావిస్తున్నాం’ అని ఓ అధికారి తెలిపారు.

మరాఠా ముఠాలను నియంత్రిస్తేనే

వాస్తవానికి ఏవోబీ రవాణా అయ్యే గంజాయి తెలంగాణ కంటే మహారాష్ట్రకు ఎక్కువగా తరలుతోంది. ముంబయి, పుణెలలో గంజాయి వినియోగం ఎక్కువగా ఉంటోంది. ‘‘మరాఠా ముఠాలు అధికంగా ఏవోబీ నుంచి గంజాయిని అక్రమంగా తరలిస్తుంటాయి. ఇందుకు సాధారణంగా హైదరాబాద్‌ మార్గాన్నే ఎంచుకుంటున్నాయి. మార్గమధ్యలో హైదరాబాద్‌లోనూ కొంత సరకు విక్రయిస్తుంటాయి. మరాఠా ముఠాలను దెబ్బకొట్టగలిగితే తెలంగాణ మీదుగా అక్రమ రవాణాను నియంత్రించవచ్చని’ ఓ ఉన్నతాధికారి వ్యాఖ్యానించారు. ఆ ముఠాల కదలికలు తెలుసుకోవడంలో నిమగ్నమైనట్టు తెలిపారు.

ఇదీ చూడండి: CP Mahesh Bhagwat: 'మరో లోకం'తో మత్తును చిత్తు చేస్తాం: సీపీ మహేశ్‌ భగవత్‌

Ganja seized: ఏపీ నుంచి గంజాయి తెచ్చి విక్రయం.. 5 కిలోలు స్వాధీనం

Ganja Smuggling: చెరువుకట్టపై గంజాయి పట్టివేత... ఆంధ్రప్రదేశ్ వ్యక్తి అరెస్ట్‌

Ganjai at shadnagar: గంజాయిపై పోలీసుల ఉక్కుపాదం​.. పలు చోట్ల అరెస్టులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.