Ganja Smuggling: చెరువుకట్టపై గంజాయి పట్టివేత... ఆంధ్రప్రదేశ్ వ్యక్తి అరెస్ట్‌

author img

By

Published : Oct 31, 2021, 1:45 PM IST

Ganja Smuggling
Ganja Smuggling ()

గంజాయి విక్రయిస్తున్న(Ganja Smuggling) వ్యక్తిని సంగారెడ్డి జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. సుల్తాన్‌పూర్‌ చెరువుకట్టపై గంజాయి అమ్ముతున్నట్లు సమాచారం రావడంతో అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి 1.56 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు.

రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాల మేరకు గంజాయిపై పోలీసులు ఉక్కు పాదం మోపుతున్నారు. సంగారెడ్డి జిల్లా సుల్తాన్‌పూర్‌లో గంజాయి విక్రయిస్తున్న(Ganja Smuggling) వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడు కృష్ణా జిల్లాకు చెందిన వ్యక్తిగా గుర్తించారు. చెరువుకట్టపై గంజాయి అమ్ముతున్నట్లు సమాచారం రావడంతో అక్కడికి వెళ్లి అతన్ని అదుపులోకి తీసుకున్నామని పోలీసులకు పేర్కొన్నారు. నిందితుడి వద్ద నుంచి 1.56 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. బాచుపల్లిలోని ఓ గదిలో తనిఖీ చేయగా మరో 3.5 కిలోల గంజాయి లభ్యమైందని పేర్కొన్నారు.

డ్రగ్స్​ రవాణాపై పోలీసుల ఉక్కుపాదం..

ప్రజల ఆరోగ్యం, ముఖ్యంగా యువత భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని మత్తుపదార్థాల నియంత్రణే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రత్యేక దృష్టి సారించింది. ఈ మేరకు ముఖ్యమంత్రి విస్పష్ట ఆదేశాలతో రంగంలోకి దిగిన పోలీసులు, ఎక్సైజ్ శాఖల అధికారులు మత్తు దందాపై ప్రత్యేక నిఘా పెట్టారు. డ్రగ్స్‌, గంజాయి విక్రేతలు, సరఫరాదారుల సమాచారం సేకరించి వారిపై నిఘా ఉంచారు. గంజాయి విక్రయిస్తే ఎన్డీపీఎస్ చట్టం కింద కేసులు నమోదు చేయనున్నట్లు హెచ్చరిస్తున్నారు.

యువత భవిష్యత్‌ కోసం అవగాహన కార్యక్రమాలు...

మరోవైపు మాదకద్రవ్యాల వాడకంపై పోలీసులు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. డ్రగ్స్‌, గంజాయి కొనుగోలు చేస్తూ పట్టుబటిన వారిని అదుపులోకి తీసుకుని తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సెలింగ్‌ ఇస్తున్నారు. యువత మత్తు ఉచ్చులో చిక్కుకుని భవిష్యత్‌ నాశనం చేసుకోవద్దని సూచిస్తున్నారు. తల్లిదండ్రులు సైతం ఇంట్లో పిల్లలపై చెడుదారుల్లో వెళ్లకుండా పర్యవేక్షించాలని అవగాహన కల్పిస్తున్నారు. డ్రగ్స్‌, గంజాయి, గుట్కాలాంటి మత్తుపదార్థాలపై ప్రజల్లో విస్తృతంగా అవగాహన కల్పిస్తున్న పోలీసులు మాదకద్రవ్యాల రహిత రాష్ట్ర నిర్మాణంలో భాగస్వామ్యం కావాలని సూచిస్తున్నారు. మత్తు విక్రయాల గురించి తెలిస్తే 949061711కు సమాచారం ఇవ్వాలని కోరుతున్నారు. తమకు సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచటంతో పాటు పోలీసుశాఖ తరఫున నజరానాలు సైతం అందించనున్నట్లు ప్రకటించారు.

ఇదీ చదవండి: Road accident: డ్రైవర్ నిద్రమత్తుతో ఆ ఇద్దరూ నరకం అనుభవించారు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.