ETV Bharat / crime

DRUG MAFIA: బెజవాడలో ఒక్క మెసేజ్ చేస్తే ఇంటికే గంజాయి!

author img

By

Published : Aug 7, 2021, 3:03 PM IST

special-story-on-ganja-selling-in-vijayawada
special-story-on-ganja-selling-in-vijayawada

విజయవాడలో మత్తు వ్యాపారం జోరుగా సాగుతోంది. వాట్సప్‌లో ఆర్డర్ పెడితే చాలు గంజాయిని నేరుగా ఇంటికే పంపుతున్నారు. కొత్త తరహా దందాపై దృష్టి సారించిన ఏపీ పోలీసులు 10 రోజుల్లోనే 30 మంది మత్తు విక్రేతలను అరెస్టు చేశారు. మత్తు సేవించే వారిపైనా కేసులు నమోదు చేస్తున్నారు.

విజయవాడలో మత్తు దందా

విజయవాడలో గుట్టు చప్పుడు కాకుండా మత్తు దందా జోరుగా సాగుతోంది. కొవిడ్‌తో వ్యాపారాలు దెబ్బతినడంతో.. కొందరు టీ స్టాల్స్‌, ఐస్ క్రీమ్ పార్లర్లు, రెస్టారెంట్ల యజమానులు అడ్డదారులు తొక్కుతున్నారు. అధిక డబ్బు సంపాదించాలని గంజాయి వ్యాపారం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖ, నర్సీపట్నం, రంపచోడవరం ఏజెన్సీ ప్రాంతాలకు వెళ్లి గంజాయిని తెచ్చి నగరంలో విక్రయాలు చేస్తున్నారు. చిన్న చిన్న పొట్లాలు చేసి ఒక్కోటి రూ.100 నుంచి 500 రూపాయలకు అమ్ముతున్నారు.

గంజాయి సేవించే వారి వివరాలను సేకరించి ఇంటి వద్దకే తీసుకెళ్లి ఇస్తున్నారు. కొత్త వారిని లక్ష్యంగా చేసుకుంటున్న మత్తు విక్రేతలు.. గంజాయి తాగితే ఊహాలోకంలో విహరించొచ్చని.. ఎక్కడా లేని ధైర్యం వస్తుందని నమ్మబలుకుతున్నారు. మొదట కొంత గంజాయిని ఉచితంగా ఇచ్చి.. మత్తుకు బానిసలుగా మారుస్తున్నారు. ఆ తర్వాత వారి నుంచి భారీగా డబ్బులు గుంజుతున్నట్లు ఏపీ పోలీసులు గుర్తించారు.

ఇకపై కేసులు..

గంజాయి దందాపై ఐదు ప్రత్యేక బృందాలతో నిఘా పెట్టిన ఏపీ పోలీసులు.. 50 మంది మత్తు పదార్థాలు విక్రయిస్తున్నట్లు గుర్తించారు. వివిధ ప్రాంతాల్లో దాడులు చేసి 10 రోజుల్లోనే 30 మందిని అరెస్ట్ చేశారు. గతంలో గంజాయి సేవించే వారిని అదుపులోకి తీసుకుని తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సిలింగ్ ఇచ్చి పంపించేవారు. కానీ.. ఇప్పుడు వారిపైనా కేసులు నమోదు చేస్తున్నారు. యువకులు నూతన పద్ధతుల్లో మత్తు సేవనానికి అలవాటు పడినట్లు గుర్తించామని పోలీసులు చెబుతున్నారు. పిల్లలపై తల్లిదండ్రులు పర్యవేక్షణ పెట్టాలని కోరుతున్నారు. కేసులు నమోదు చేస్తే వారి జీవితాలు నాశమవుతాయని హెచ్చరిస్తున్నారు.

ఇదీ చదవండి: Honey Trap: మసాజ్​ పేరుతో వలపు వల.. ఆ తర్వాత వీడియోలతో బెదిరిస్తూ...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.