జంట హత్యల కేసులో నిందితుడు అల్లుడే.. మందలించారన్న కోపంతో..

author img

By

Published : May 13, 2022, 6:21 PM IST

Police arrest accused in challapally twin murder case

పెద్దపల్లి జిల్లా మంథని మండలం చల్లపల్లిలో రెండు రోజుల క్రితం జరిగిన జంట హత్య కేసులో నిందితున్ని పోలీసులు పట్టుకున్నారు. నిందితుడు మృతిచెందిన వారి చిన్నకుమార్తె భర్తేనని గుర్తించిన పోలీసులు.. ఈరోజు ఉదయం అతడిని అరెస్ట్​ చేశారు. అయితే.. నిందితుడు అత్తమామలను ఎందుకు హత్య చేశాడంటే..?

కాళ్లు కడిగి కన్యాదానం చేసిన అత్తమామలనే కడతేర్చాడు ఓ అల్లుడు. కుటుంబం పట్ల బాధ్యతగా ఉండాలని మందలించినందుకు.. క్షణికావేశంలో భార్య తల్లిదండ్రులను మట్టుబెట్టాడు. పెద్దపల్లి జిల్లా మంథని మండలం పుట్టపాక గ్రామ పరిధిలోని చల్లపల్లిలో రెండు రోజుల క్రితం జరిగిన జంట హత్య కేసును పోలీసులు ఛేదించారు. అల్లుడే నిందితుడని గుర్తించి అరెస్ట్​ చేశారు.

కొత్త సాంబయ్య, లక్ష్మి దంపతులకు ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు సంతానం. ఇద్దరు కూతుళ్లకు వివాహం కాగా.. కుమారుడు తల్లిదండ్రులతో పాటే ఉంటున్నాడు. చిన్న కూతురు వసంతను.. వెంకటాపూర్​కు చెందిన పెంట శ్రీనివాస్​కిచ్చి వివాహం చేశారు. పెళ్లి జరిగి పదేళ్లు అవుతుండగా.. వసంత, శ్రీనివాస్​ దంపతులకు ఇద్దరు కుమార్తెలు సంతానం. కుటుంబంతో పాటు హైదరాబాద్​లోనే ఉంటోన్న శ్రీనివాస్​.. ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తూండేవాడు. అంతాబాగానే నడుస్తుండగా.. కొంతకాలం నుంచి శ్రీనివాస్​ మద్యానికి బానిసయ్యాడు. అప్పటి నుంచి ఉద్యోగానికి వెళ్లకపోవటం.. కుటుంబాన్ని నిర్లక్ష్యం చేయటం ప్రారంభమైంది. ఈ క్రమంలో భార్యాభర్తల మధ్య గొడవలు మొదలయ్యాయి.

పలుమార్లు పంచాయితీలు కూడా పెట్టి శ్రీనివాస్​ను పెద్దలు మందలించారు. అయినా.. శ్రీనివాస్​ ప్రవర్తనలో మార్పు రాలేదు. ఈ క్రమంలోనే ఈనెల 10న.. మళ్లీ భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. అదే విషయమై.. వసంత తమ్ముడు వచ్చి శ్రీనివాస్​ను నిలదీయటంతో కోపంగా ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయాడు. ఇదే విషయమై వసంత తమ్ముడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పంచాయితీలు పెట్టి తన పరువు తీసినందుకు అత్తామామలపై ఎప్పటినుంచో కోపం పెంచుకున్న శ్రీనివాస్​.. అందరూ తనను మందలించడానికి కారణం వాళ్లేనని భావించాడు. అదే రోజు రాత్రి హైదరాబాద్ నుంచి బయలుదేరిన శ్రీనివాస్​.. నేరుగా చల్లపల్లికి చేరుకున్నాడు. అత్తమామలపై రోకలిబండతో విచక్షణారహితంగా దాడి చేసి హత్య చేశాడు. అనంతరం ఆ ఇంట్లోని 20 వేల నగదు తీసుకున్నాడు. హత్యకు వాడిన రోకలిబండను పక్కనే ఉన్న బావిలో పడవేసి.. తన స్వగ్రామమైన వెంకటాపూర్​కు చేరుకున్నాడు.

ఈ జంట హత్యలు సంచలనం సృష్టించడంతో.. పోలీసులు కేసును సవాలుగా తీసుకున్నారు. మూడు బృందాలుగా ఏర్పడి విచారణ వేగవంతం చేశారు. హత్య జరిగినప్పటి నుంచి శ్రీనివాస్ కనిపించకపోవటంతో అనుమానం వచ్చిన పోలీసులు.. సెల్​ఫోన్​ సిగ్నల్స్​ ద్వారా అతడి ఆచూకీ కనుక్కున్నారు. ఈరోజు ఉదయం శ్రీనివాస్​ను అదుపులోకి తీసుకుని.. వాళ్ల స్టైల్లో విచారించగా హత్య నేరాన్ని ఒప్పుకున్నట్టు పోలీసులు తెలిపారు.

ఇవీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.