ETV Bharat / crime

తెలియని వాట్సాప్‌ గ్రూపులో నీ నంబర్‌ చేరిందా? జర పైలం!

author img

By

Published : Apr 22, 2022, 1:35 AM IST

Cryptocurrency News: ఆశలు అమెరికన్ డాలర్లను తాకితే... ఖాతాలు ఖాళీ అయిపోతాయ్‌ జాగ్రత్త అంటున్నారు సైబర్‌ పోలీసులు.! వాట్సాప్‌ గ్రూపుల్లో వల విసిరి... అధికలాభాల ఆశజూపి క్రిప్టోలో పెట్టుబడుల పేరిట నట్టేట ముంచుతున్న నయామోసాలపై అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. హైదరాబాద్‌లో 2 నెలల్లోనే 20కోట్లకు పైగా అక్రమార్కులు కొల్లగొట్టారు.

Cryptocurrency
Cryptocurrency

Cryptocurrency News: మనకు తెలియకుండానే వాట్సాప్‌ గ్రూపులో మన నంబర్‌ చేరుస్తారు. అందులో అరసెకనుకో మెసేజ్‌ వస్తుంది. ఒకడు నా లాభం లక్ష అంటాడు. మరొకడు నా ఖాతాలో 5లక్షలు చేరిందంటాడు. మరొకడు 10 లక్షలు వచ్చాయి కారు కొంటున్నా అంటాడు. ఆశపడి అరసెకను ఆలోచించావా! అంతే!! నాకూ లాభాలు కావాలని ఆశపడ్డావా ఇక నీ ఖాతాలో కాసులకు మంగళం పాడినట్లే! వేలల్లో పెట్టుబడులు లక్షల్లో లాభాలు, రోజూ డాలర్లలో సంపాదించవచ్చంటూ... ఈ మధ్య సైబర్‌ నేరగాళ్లు పన్నుతున్న ఉచ్చుకు అనేకమంది బలవుతున్నారు.

క్రిప్టోలో పెట్టుబడులు, మీ తరఫున మేం లావాదేవీలు మేం నిర్వహిస్తాం. అమెరికన్‌ డాలర్లలో మదుపు చేసిన డబ్బును మీరు ఎప్పటికప్పుడు విత్‌డ్రా చేసుకోవచ్చంటూ... సైబర్‌ నేరస్థులు కొత్త పంథాలో మోసాలకు పాల్పడుతున్నారు. మెట్రోనగరాలు, పట్టణాల్లో ఉద్యోగులు, యువతను లక్ష్యంగా చేసుకొని టోకరా వేస్తున్నారు. తొలుత ఫోన్‌ నంబర్లు సేకరించి వారిని వాట్సాప్‌ బృందాల్లోకి చేరుస్తారు. లక్షల్లో లాభాలొస్తాయని నమ్మించి పెట్టుబడి పెట్టేలా ప్రోత్సహిస్తారు. ఇలా హైదరాబాద్‌లోని మూడు కమిషనరేట్ల పరిధిలో రెండు నెలల్లో ఏకంగా 20కోట్ల 50లక్షలు కొల్లగొట్టారు. కొద్దిరోజుల క్రితం ఇద్దరు పోలీస్‌ ఉన్నతాధికారుల అధికారిక ఫోన్‌ నంబర్లనూ... వాట్సాప్‌ బృందాల్లో చేర్చడంతో అధికారులు మరింత అప్రమత్తమయ్యారు.

'వాట్సాప్‌ గ్రూప్‌ ద్వారా బాధితులు యాప్‌లు డౌన్‌లోడ్‌ చేసుకున్నాక... ప్రతి ఒక్కరి పేరిట ఒక డిజిటల్‌ ఖాతాను సైబర్‌ నేరస్థులు ప్రారంభిస్తున్నారు. ఆ డిజిటల్‌ ఖాతా నియంత్రణ అంతా కేటుగాళ్ల చేతుల్లోనే ఉంటుంది. తొలుత 50వేలతో బిట్‌కాయిన్‌ కొనిపిస్తారు. బాధితుడి డిజిటల్‌ ఖాతాలో... 50వేలు కనిపిస్తుంది. మరుసటిరోజు బిట్‌కాయిన్‌ మైనింగ్‌ చేశాం మీకు 3వేలు లాభం వచ్చిదంటూ చెబుతారు. అందులో 53 వేలు కనిపిస్తుంది. మూడోరోజు ఫోన్‌ చేసి 53వేలకు 9వేలు లాభంవచ్చిందంటూ విత్‌డ్రా చేసుకోమంటారు. ఆ తర్వాత లక్షల్లో మదుపు చేయమని ఫోన్లు చేస్తారు. ఒక్కో లక్షకు రోజుకు 10వేల లాభం చూపిస్తూ.... నెలలోనే డిజిటల్‌ ఖాతాలో 90లక్షలు చూపెడతారు. ఇంకా ఎక్కువ పెట్టిన వారికి కోట్లలో నిల్వలు కనిపిస్తాయి. ఇక చాలు విత్‌ డ్రా చేసుకుంటా అన్న మరుక్షణం డిజిటల్‌ ఖాతా మాయమైపోతుంది.'-కేవీఎం ప్రసాద్‌, సైబర్‌ క్రైం ఏసీపీ

మనకు తెలియని వాట్సాప్‌ గ్రూపుల్లో చేరిస్తే... వెంటనే అందులోంచి ఎగ్జిట్‌ అవ్వాలని పోలీసులు సూచిస్తున్నారు. అత్యాశకు పోతే నిరాశ తప్పదని హెచ్చరిస్తున్నారు.

ఇదీ చదవండి:మనీ ట్రాన్స్​ఫర్​ చేసి.. క్యాష్​ తీసుకున్నారా..? అయితే ఇది మీకూ జరిగుంటుంది..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.