ETV Bharat / crime

చోరీచేస్తాడు.. జైలుకెళ్తాడు.. బెయిల్‌తో బయటకొస్తాడు.. చివరికి!

author img

By

Published : Jul 1, 2022, 10:39 AM IST

Thief Arrested: సినిమాలంటే అతడికి పిచ్చి. చిత్రపరిశ్రమలో గుర్తింపు తెచ్చుకుందామని... హైదరాబాద్‌ వచ్చాడు. సినిమాల్లో ఎదగడం కష్టమని తెలుసుకుని... సహచరుడి సలహాతో దొంగతనాన్ని ఎంచుకున్నాడు. ఇళ్లల్లో చోరీచేస్తాడు.. జైలుకెళ్తాడు... బెయిల్‌తో బయటకొస్తాడు. ఇదే అలవాటుగా మారిన ఆ దొంగ... జైళ్లలో పరిచయమైనవారిని బయటకితెచ్చి... చోరీలకు పాల్పడ్డాడు. ముగ్గురు యువతులను పెళ్లాడి... మరెందరినో మోసం చేశాడు. 37 కేసులు మూటకట్టుకుని పోలీసుల కళ్లు కప్పి తిరుగుతున్న ముదురుదొంగ... ఎట్టకేలకు హైదరాబాద్‌ పోలీసులకు చిక్కాడు.

Thief
Thief

Thief Arrested: ఆంధ్రప్రదేశ్ కడప జిల్లాకు చెందిన గణేశ్‌... ఇంటర్‌లోనే చెడువ్యసనాలకు బానిసై సినిమాపై పిచ్చితో... హైదరాబాద్‌కు వచ్చాడు. కృష్ణాన‌గ‌ర్‌కి చేరిన గణేశ్‌కు... ఓ డ్యాన్స్ మాస్టర్‌ పరిచయమయ్యాడు. సినీపరిశ్రమలో ఎదగాలంటే కష్టమని చెప్పిన డ్యాన్స్ మాస్టర్‌... డబ్బు సంపాదించాలంటే... దొంగ‌త‌నాలు చేయ‌మ‌ని స‌ల‌హా ఇచ్చాడు. దీంతో 2012లో తిరిగి క‌డ‌ప‌ వెళ్లిన గణేశ్‌... తాళం వేసిన ఇళ్లల్లో దొంగతనాలకు పాల్పడుతూ పోలీసులకు చిక్కడంతో జైలుకి పంపించారు. జైలులో ఇద్దర్ని పరిచయం చేసుకున్న గణేశ్‌... వారికి బెయిల్‌ ఇచ్చి బయటకి తీసుకొచ్చాడు. వారితో కలిసి దొంగతనాలు చేశాడు. చోరీ చేయాల్సిన ప్రదేశం, ప‌థ‌కం, ముంద‌స్తు రెక్కీ అన్నీ గ‌ణేష్ చూసుకునేవాడు. దొంగతనం చేసిన వారికి 40శాతం వాటా ఇచ్చి మిగిలింది గణేశ్‌ తీసుకునేవాడు.

2013 లో ఓ దొంగతనం కేసులో మరోసారి అరెస్టయి రాజ‌మండ్రి జైలుకి వెళ్లిన గణేశ్‌... అక్కడ మ‌రో నేర‌స్తునితో స్నేహం చేశాడు. వ్యభిచారం చేస్తే మంచి లాభాలు వ‌స్తాయ‌నే అతని సలహాతో... బయటకి వచ్చి 2014 నుంచి 2019 వ‌ర‌కూ తిరుప‌తిలో వ్యభిచార గృహాలు న‌డిపించాడు. ఇదే వ్యవ‌హారంలో అలిపిరి పోలీసుల‌కు చిక్కడంతో... అత‌ణ్ని తిరుప‌తి జైలుకు పంపారు. అక్కడ మ‌రో ముగ్గురు నేర‌స్తుల్ని ప‌రిచ‌యం చేసుకున్న గణేశ్‌... వారికి బెయిల్ ఇప్పించి ఇద్దరిని హైద‌రాబాద్ తీసుకొచ్చాడు. నగరంలోని మేడిప‌ల్లి, భువ‌న‌గిరి, ఘ‌ట్‌కేసర్‌ పరిధిలోని ఇళ్లల్లో దొంగతనాలు చేయించాడు. చోరీ కేసులో 2019లో మేడిప‌ల్లి పోలీసులు గ‌ణేశ్‌ను అరెస్ట్ చేసి చ‌ర్లప‌ల్లి జైలుకు పంపించారు. 2020లో విడుద‌లై తిరిగి క‌డ‌ప‌కు చేరుకున్న గణేశ్‌... 2021లో మ‌ళ్లీ ఇళ్లలో దొంగ‌తనాల‌కు పాల్పడి క‌డ‌ప జైలుకు వెళ్లాడు.

చోరీల్లో ఆరితేరిన దొంగ కర్ణాటక జైలులో ఉన్నాడని కడప జైలులో తెలుసుకున్న గణేశ్‌... బయటకి వచ్చి... అతనికి బెయిల్ ఇప్పించాడు. హైదరాబాద్‌ తీసుకొచ్చి... నగరంలో దొంగతనాలు చేయించాడు. ఇత‌నితోపాటు గ‌తంలో చోరీలు చేసిన నిందితుల‌ు ఎల్బీ నగర్ పోలీసులకు చిక్కగా... గ‌ణేష్ మాత్రం ప‌రారీలో ఉన్నాడు. అప్పటి నుంచి గాలిస్తున్న పోలీసుల‌కు గురువారం ఖైరతాబాద్‌లోని ఓ ఇంట్లో పట్టుబడ్డాడు. ఇతనిపై ఏపీలో 17, తెలంగాణ‌లో 19, క‌ర్ణాట‌క‌లో ఒకటి... ఇలా మొత్తం 37 కేసులున్నట్లు పోలీసులు గుర్తించారు. ఇత‌ని వ‌ద్ద నుంచి 3తులాల బంగారు ఆభ‌ర‌ణాలు, 22 తులాల వెండి, ల‌క్ష రూపాయ‌ల న‌గ‌దుతోపాటు... రెండు బైక్‌లు, 8 సెల్‌ఫోన్‌లు స్వాధీనం చేసుకుని... రిమాండ్‌కి త‌ర‌లించారు.

దొంగ‌త‌నాల‌కు జైలులో ఉన్న నిందితుల‌్నే ఎంచుకునే గ‌ణేశ్‌... వారిని బయటకి తెచ్చి... నివాసం, భోజనం, ఇతర సౌకర్యాలు కల్పిస్తాడు. మరోవైపు గణేశ్‌ ఇంటర్మీడియట్‌ తోటివిద్యార్థినిని ప్రేమవివాహం చేసుకున్నాడు. ఆమెకు ఇద్దరు కుమార్తెలున్నారు. తిరుప‌తిలో వ్యభిచార గృహాలు న‌డిపేట‌ప్పుడు అక్కడ మ‌రో యువ‌తిని పెళ్లి చేసుకోగా... ఆమెకు ఓ కుమారుడున్నాడు. హైద‌రాబాద్‌లో 2019లో చోరీలు చేసేప్పుడు ఇక్కడ మరో యువ‌తితో స‌హ‌జీవ‌నం చేశాడు. 2021లో క‌డ‌ప‌లో మ‌రో మ‌హిళను వివాహం చేసుకున్నాడు. తాజాగా ఖైర‌తాబాద్‌లో మరో యువతిని పెళ్లి చేసుకునేందుకు సిద్ధమయ్యాడు. ఆమెతో కలిసి ఓ ఇంట్లో ఉన్నాడనే విషయం తెలుసుకున్న పోలీసులు... అతణ్ని అరెస్టు చేశారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.