ETV Bharat / crime

వాగు దాటుతుండగా ఆలస్యం.. గుండెపోటుతో వ్యక్తి మృతి

author img

By

Published : Jul 24, 2021, 3:52 PM IST

గుండెపోటు వచ్చిన వ్యక్తిని ఆస్పత్రికి తరలిస్తుండగా వాగు దాటాల్సి రావడంతో వ్యక్తి మృతిచెందాడు. ఏళ్లు గడిచినా బ్రిడ్జి నిర్మాణం జరగకపోవడంతోనే ఒక ప్రాణం పోయిందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. పిల్లలు, పెద్దలను ఆస్పత్రికి తీసుకెళ్లడానికి నానా అవస్థలు పడాల్సి వస్తోందని వాపోయారు.

man dead, person dead with heart attack
వ్యక్తి మృతి, గుండెపోటుతో వ్యక్తి మృతి

వికారాబాద్ జిల్లాలో పొంగుతున్న వాగు కారణంగా ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడని స్థానికులు వాపోయారు. శుక్రవారం రాత్రి ధారూరు మండలం దోర్నాల గ్రామానికి చెందిన మహమ్మద్ జిలానికి గుండె పోటు వచ్చింది. రాత్రివేళ ఆటోలో ఆస్పత్రికి తరలిస్తుండగా కాగ్నా నదిపై వేసిన మట్టి రోడ్డు వరదలకు కొట్టుకుపోయి... వాగు దాటలేకపోయారు. తాండూరు తీసుకెళ్తుండగా రాస్నం వరకు వెళ్లగానే జిలాని మృతి చెందాడు. సమయానికి ఆస్పత్రికి తీసుకెళ్తే జిలాని ప్రాణాలతో బయటపడేవాడని స్థానికులు అంటున్నారు.

గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో వాగులు పొంగిపొర్లుతున్నాయి. కాగా ధారూరు మండలం దోర్నాల గ్రామ సమీపంలో కాగ్నా నదిపైన ఉన్న వంతెన 2016లో కురిసిన భారీ వర్షాలకు కొట్టుకుపోయింది. అప్పుడు తాత్కాలికంగా మట్టి రోడ్డు వేశారు. ఏళ్లు గడిచినా నేటికీ బ్రిడ్జి నిర్మాణం పూర్తి కాలేదు. బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేయకపోవడంతోనే ఈ దుర్ఘటన జరిగిందని స్థానికులు వాపోయారు. అధికారులు ఎంతగా వేడుకున్నా పట్టించుకోవడం లేదని ఆరోపించారు.

మూడేళ్ల కిందట పాత బ్రిడ్జి బాగానే ఉండేది. రాకపోకలకు ఇబ్బంది లేకుండా ఉండేది. కొత్త బ్రిడ్జి వచ్చిందని చెప్పి పాత బ్రిడ్జిని తీసేశారు. ఇప్పటివరకు సగం నిర్మాణాన్ని పూర్తి చేయలేదు. చాలాసార్లు అధికారులను అడిగాం. ఎమ్మెల్యేని కూడా సంప్రదించాం. అయినా ఫలితం లేదు. గ్రామానికి చెందిన ఒకరికి రాత్రి గుండెపోటు వచ్చింది. అతడిని తీసుకొని ఆస్పత్రికి వెళ్లలేకపోయారు. రోడ్డు సరిగా ఉంటే సరైన సమయంలో ఆస్పత్రికి తీసుకుపోయేవారు. అతడు బతకేవాడు. పిల్లలు, పెద్దలకు ఎలాంటి పరిస్థితి వస్తుందో అని భయంగా ఉంది. నేనే స్వయంగా మట్టి తీసుకొచ్చి తాత్కాలికంగా రాకపోకలకు ఏర్పాటు చేశాను. అధికారులు దీనిపై స్పందించాలని కోరుతున్నాం.

-వెంకట్ రాంరెడ్డి, సర్పంచ్ భర్త

పాత బ్రిడ్డి ఉన్నప్పుడు రాకపోకలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండేది. కొత్త బ్రిడ్జి నిర్మాణం చేపట్టాక చాలా ఇబ్బందులు పడుతున్నాం. ఏదైనా పని కోసం వెళ్తే మధ్యలోనే వెనుదిరగాల్సి వస్తుంది. వర్షాలు వచ్చినప్పుడు రాకపోకలకు చాలా ఇబ్బందిగా ఉంటోంది. రాత్రి ఒక వ్యక్తి మృతి చెందారు. అధికారులు దీనిపై స్పందించి... బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేయాలని కోరుతున్నాం.

-గ్రామస్థుడు

ఇదీ చదవండి: MURDER: దారుణం: నవవధువు గొంతు కోసి హతమార్చారు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.