ETV Bharat / crime

Jubileehills gang rape: అధికారిక వాహనంలోనే అత్యాచారం..!

author img

By

Published : Jun 4, 2022, 6:25 PM IST

Updated : Jun 5, 2022, 6:38 AM IST

స్నేహంగా ఉన్నారని నమ్మితే మానవ మృగాళ్లుగా మారారు. ప్రభుత్వ అధికారిక వాహనంలోనే అఘాయిత్యానికి ఒడిగట్టారు. ఒక ఎమ్మెల్యే కుమారునికి ఎలాంటి సంబంధం లేదని పోలీసులు ప్రకటించినప్పటికీ.. సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరుగుతున్న దృశ్యాలతో అతని పాత్రపై అనుమానాలు బలపడ్డాయి. దీంతో అతన్ని A-6గా చేర్చే యోచనలో పోలీసులు ఉన్నట్లు తెలుస్తోంది. ముందస్తు పథకం ప్రకారమే నిందితులు పోలీసుల్ని పక్కదారి పట్టించే ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది.

Jubleehills gang rape: జూబ్లీహిల్స్‌ గ్యాంగ్‌ రేప్‌... ఎట్టకేలకు ఇన్నోవా కారు స్వాధీనం!
Jubleehills gang rape: జూబ్లీహిల్స్‌ గ్యాంగ్‌ రేప్‌... ఎట్టకేలకు ఇన్నోవా కారు స్వాధీనం!

రాజధానిలో జరిగిన సామూహిక అత్యాచార ఉదంతంలో సంచలన అంశాలు వెలుగు చూస్తున్నాయి. ఒక ప్రభుత్వ సంస్థ ఛైర్మన్‌ (ఏదైనా కేసులో నిందితులు మైనర్లు అయితే వారి పేర్లే కాకుండా తల్లిదండ్రుల పేర్లు సహా నిందితులను గుర్తించే వివరాలను ప్రచురించరాదన్న సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో తండ్రి పేరు, సంస్థ పేరు రాయడం లేదు) అధికారికంగా వినియోగించే ఇన్నోవా వాహనంలోనే బాలికపై అత్యాచారం జరిగిందని సమాచారం. తాత్కాలిక రిజిస్ట్రేషన్‌ నంబరుతో ఉన్న ఈ వాహనానికి ‘ప్రభుత్వ వాహనం’ అనే స్టిక్కర్‌ ఉందని సీసీ ఫుటేజీల ద్వారా పోలీసులు గుర్తించినట్లు తెలుస్తోంది. మెయినాబాద్‌ పరిసరాల్లో ఈ కారును స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. పుప్పాలగూడకు చెందిన సాదుద్దీన్‌, ఒక ఎమ్మెల్యే సోదరుడి కుమారుడు అమేర్‌ఖాన్‌, ప్రభుత్వ సంస్థ ఛైర్మన్‌ కుమారుడు, బల్దియా కార్పొరేటర్‌ కుమారుడు, సంగారెడ్డి జిల్లా తెరాస పార్టీ నాయకుడి కుమారుడు బాలికపై అత్యాచారం చేశారని పోలీసులు సాక్ష్యాధారాలు సేకరించారు. శుక్రవారం రాత్రి సాదుద్దీన్‌ను అరెస్టు చేయగా శనివారం చంచల్‌గూడ జైలుకు తరలించారు. ప్రభుత్వ సంస్థ ఛైర్మన్‌ కుమారుడిని, బల్దియా కార్పొరేటర్‌ కుమారుడిని జువైనల్‌ హోంకు తరలించారు. ఒక ఎమ్మెల్యే కుమారుడు బాలికతో చనువుగా ప్రవర్తించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో రావడంతో పోలీసులు అతడిని కూడా నిందితుడిగా చేర్చే యోచనలో ఉన్నట్లు సమాచారం.

.

బెంజి కారు నుంచి ఇన్నోవాకు మార్చి..

జూబ్లీహిల్స్‌లోని అమ్నీషియా పబ్‌కు మే 28న వచ్చిన బాలికను ఇంటివద్ద దిగబెడతామంటూ ప్రభుత్వ సంస్థ ఛైర్మన్‌ కుమారుడు, ఎమ్మెల్యే కుమారుడు బెంజి కారులో ఎక్కించుకున్నారు. అందులో పబ్‌ నుంచి బంజారాహిల్స్‌కు వెళ్తున్నప్పుడే బాలికపై అత్యాచారయత్నం చేసినట్టు పోలీసులు ప్రాథమిక ఆధారాలు సేకరించారు. బంజారాహిల్స్‌ రోడ్‌ నం.14లోని కాన్సు బేకరీ వద్ద కొద్దిసేపు ఆగారు. అక్కడికి ఇన్నోవా కారును డ్రైవర్‌ తీసుకురాగా.. ప్రభుత్వ సంస్థ ఛైర్మన్‌ కుమారుడు ఇప్పుడే వస్తామంటూ వేచి ఉండాలని డ్రైవర్‌కు చెప్పి అతడిని వదిలి వెళ్లినట్లు సీసీ ఫుటేజీల్లో కన్పించింది. సాదుద్దీన్‌ మాలిక్‌ (18), అమేర్‌ ఖాన్‌ (18)లతో పాటు ప్రభుత్వ సంస్థ ఛైర్మన్‌ కుమారుడు (16), సంగారెడ్డి జిల్లాకు చెందిన అధికార పార్టీ నేత కుమారుడు (16), బల్దియా కార్పొరేటర్‌ కుమారుడు (16) కలిసి బాలికను బెదిరించి ఆమెను బెంజి కారు నుంచి ఇన్నోవా వాహనంలో ఎక్కించి తీసుకెళ్లారు. ఆ సమయంలో ఇన్నోవాలో ఎమ్మెల్యే కుమారుడు (17) సైతం ఉన్నాడు. అతడు కొద్ది నిమిషాల్లోనే కారు దిగి బేకరీ వైపు వెళ్లాడని తొలుత పోలీసులు తెలిపారు. సామాజిక మాధ్యమాల్లో తాజాగా హల్‌చల్‌ అయిన వీడియో నేపథ్యంలో మరోసారి బాధితురాలి వాంగ్మూలం తీసుకున్న పోలీసులు అతడిని ఏ6 నిందితుడిగా చేర్చే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు.

.

పోలీసు దర్యాప్తుపై అనుమానాలు

పోలీసులు చేస్తున్న ప్రకటనలకు, వాస్తవాలకు తేడా ఉండడంతో పరిశోధన, దర్యాప్తుపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బాలికను తీసుకెళ్తున్న బెంజికారు జూబ్లీహిల్స్‌ రోడ్‌ నం.36 నుంచి చెక్‌పోస్టు కూడలి మీదుగా కేబీఆర్‌ కూడలి నుంచి రోడ్‌ నం.14 వైపు వెళ్లినట్లు గుర్తించారు. సామాజిక మాధ్యమాల్లో వచ్చిన వీడియోల్లో బాధితురాలిని ఓ బాలుడు అతి దగ్గరగా తీసుకుని ముద్దాడడం, స్నేహితులు వీడియోలు తీయడం కనిపించింది. బాలికను ముద్దాడింది ఎమ్మెల్యే కుమారుడేనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అతని పక్కనే ప్రభుత్వ సంస్థ ఛైర్మన్‌ తనయుడు ఉన్నారు. అత్యాచారం చేశాక.. బాలికను పబ్‌ వద్ద దించేసిన నిందితులు.. బేకరీ వద్ద గ్రూప్‌ ఫొటో దిగారు. కొన్ని ఫొటోలు, వీడియోలు బయటకు ఎలా వచ్చాయో తెలుసుకోవడానికి ఇంటెలిజెన్స్‌ వర్గాలు రంగంలోకి దిగాయి.

* ఈ ఘటన గత నెల 28న జరిగితే పోలీసులకు బాధితురాలి తండ్రి 31వ తేదీన ఫిర్యాదు చేశారు. అదే రోజు పోక్సో కేసు నమోదు చేశారు. మరుసటి రోజు బెంజి కారును స్వాధీనం చేసుకున్నారు. ఇన్నోవా కారు గురించి రెండు మూడు రోజులు పట్టించుకోలేదు.

* ఇన్నోవా కారులోని ఆనవాళ్లు, ఆధారాలు చెరిపివేసే క్రమంలోనే నిందితులు దాన్ని చిక్కకుండా చేశారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నాలుగు రోజులైనా ఇద్దరు నిందితులను పోలీసులు పట్టుకోలేకపోయారు.

* ఓ రాజకీయ నాయకుడి సూచనతో కేసు తీవ్రరూపం దాల్చకముందే ఎమ్మెల్యే కుమారుడిని దుబాయ్‌కి పంపేశారని సమాచారం.

ముగ్గురు నిందితులు ప్రజాప్రతినిధుల తనయులే..

నిందితుల్లో ముగ్గురు.. ప్రజాప్రతినిధుల తనయులే. ఒకరి తండ్రి బల్దియా కార్పొరేటర్‌గా పనిచేసి ప్రభుత్వ సంస్థ ఛైర్మన్‌ కాగా.. మరొకరి తండ్రి ప్రస్తుతం కార్పొరేటర్‌గా ఉన్నారు. మరొక నిందితుడి తండ్రి సంగారెడ్డి జిల్లాలో అధికార పార్టీ ప్రజాప్రతినిధి. మిగిలిన ఇద్దరు నిందితుల్లో అమేర్‌ఖాన్‌ (18) ఎమ్మెల్యే సోదరుడి కుమారుడు. ఆ ఎమ్మెల్యే కుమారుడి పాత్ర ఉన్నట్లు ఆరోపణలొస్తున్నాయి. మరో నిందితుడు సాదుద్దీన్‌ తండ్రికి ఒక పార్టీ ప్రజాప్రతినిధితో సంబంధం ఉంది.

ఫోన్లు గోవాకు.. నిందితులు కర్ణాటకకు..

నిందితులు పోలీసులను పక్కదారి పట్టించేందుకు ముందుగానే పథకం సిద్ధం చేసుకున్నారు. గత నెల 29వ తేదీనే తామంతా గోవాకు వెళ్తున్నామంటూ స్నేహితులకు చెప్పారు. వీరు గోవాకు వెళ్లకుండా ఇద్దరు వ్యక్తులకు తమ సెల్‌ఫోన్లు ఇచ్చి అక్కడికి పంపించారు. వీరు మరో సిమ్‌కార్డు తీసుకుని కర్ణాటకు వెళ్లారు.

అది మద్యం రహిత పార్టీయే!

అమ్నీషియా పబ్‌లో జరిగిన పార్టీలో మద్యం సరఫరా కాలేదని ఎక్సైజ్‌శాఖ అధికారులు తెలుసుకున్నారు. ఓ ఇంటర్నేషనల్‌ స్కూల్‌ విద్యార్థుల తరఫున ఓ విద్యార్థి వీడ్కోలు పార్టీకి బాధితురాలు సహా 153 మంది హాజరయ్యారని వారు వివరాలు సేకరించారు.

ఇవీ చూడండి:

Last Updated :Jun 5, 2022, 6:38 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.