ETV Bharat / sports

పీరియడ్స్​ను మహిళా అథ్లెట్స్​ ఎలా మేనేజ్‌ చేస్తారో తెలుసా?

author img

By

Published : Jun 4, 2022, 9:42 AM IST

Athelts periods tips: నెలసరి సమయంలో మహిళలు శారీరకంగా, మానసికంగా చాలా ఇబ్బంది పడుతుంటారు. ఇలాంటి సమయంలో ఇంటి పట్టున ఉండే ఆడవారు కాస్త విశ్రాంతి తీసుకుని తమ పనిని చేసుకునే వెసులుబాటు ఉండొచ్చు. మరి క్రీడాకారిణుల పరిస్థితేంటి? అసలు నెలసరిని వాళ్లెలా మేనేజ్‌ చేస్తారు? వంటి విషయాల సమాహారమే ఈ కథనం..

Female Athlet periods tips
నెలసరిని మహిళా అథ్లెట్స్​ ఎలా మేనేజ్‌ చేస్తారో తెలుసా?

Athelts periods tips: కొందరికి నెలసరి సమయంలో అడుగు తీసి అడుగు వేయడానికి శరీరం సహకరించదు. దీనికి తోడు శారీరక నొప్పులు వేధిస్తుంటాయి. ఇవన్నీ తట్టుకొని కెరీర్‌ని కొనసాగించడం మహిళలకు సవాలే! మరి, ఇలా పిరియడ్స్‌ సమయంలో మనకైతే షెడ్యూల్‌ను వాయిదా వేసుకునే వెసులుబాటు ఉండచ్చు.. అదే అంతర్జాతీయ క్రీడాకారిణుల పరిస్థితేంటి? సరిగ్గా కీలక మ్యాచులున్న సమయంలోనే నెలసరి వస్తే.. ఆ నొప్పిని భరిస్తూనైనా మ్యాచ్‌ను కొనసాగించాల్సిందే! ఒకవేళ ఓడిపోతే..? 'నేను అబ్బాయినైనా బాగుండు.. ఇలాంటి అవాంతరాల్లేకుండా కెరీర్‌ని కొనసాగించేదాన్ని!' అనుకోవడం సహజం. చైనా టెన్నిస్‌ ప్లేయర్‌ క్విన్‌వెన్‌ ఝెంగ్‌ కూడా అచ్చం ఇలాగే అనుకుంది. నెలసరి నొప్పితో తాజా మ్యాచ్‌ చేజార్చుకున్న ఆమె.. తీవ్ర భావోద్వేగానికి లోనైంది. ఆ తర్వాత తేరుకొని తాను నెలసరిలో ఉన్నానంటూ ధైర్యంగా బయటపెట్టింది. మొత్తానికి మ్యాచ్‌ ఓడినా.. తన నిజాయతీతో, ధైర్యంతో ఎంతోమంది మనసులు గెలుచుకుందామె.

'నేను నెలసరిలో ఉన్నాను!' ఈ విషయం ఇంట్లో అమ్మకు, పెళ్లైన మహిళలైతే భర్తకు.. ఇలా దగ్గరి వారికి మాత్రమే నిర్మొహమాటంగా చెప్పగలుగుతారు. ఇక మూడో వ్యక్తికి ఈ విషయం తెలియకుండా జాగ్రత్తపడతారు. కానీ కొంతమంది మహిళలు మాత్రం తమ పిరియడ్‌ గురించి, ఈ సమయంలో తలెత్తే అసౌకర్యం గురించి నిర్మొహమాటంగా అందరితో పంచుకుంటుంటారు. చైనా టెన్నిస్‌ ప్లేయర్‌ క్విన్‌వెన్‌ ఝెంగ్‌ కూడా అలాంటి అమ్మాయే!

నేను అబ్బాయినైనా బాగుండు.. ఫ్రెంచ్‌ ఓపెన్‌లో భాగంగా క్విన్‌వెన్‌ ప్రపంచ నంబర్‌ వన్‌ క్రీడాకారిణి ఇగా స్వియాటెక్‌తో తలపడుతోంది. తన అద్భుతమైన ఆటతీరుతో తొలి సెట్‌లో పైచేయి సాధించిన క్విన్‌వెన్‌.. తర్వాత సెట్లను ప్రత్యర్థికి సమర్పించుకుంది. దాంతో మ్యాచ్‌ ఓడిపోయింది. అప్పటిదాకా అద్భుత ఆటతీరు ప్రదర్శించిన ఆమె.. మ్యాచ్‌ చేజార్చుకోవడమేంటి? అని అందరూ ఆశ్చర్యపోయారు. అయితే తన ఓటమికి అసలు కారణం.. నెలసరి నొప్పే అని వెల్లడించిందీ చైనీస్‌ ప్లేయర్.

"ఈరోజే నాకు నెలసరి మొదలైంది. ప్రతినెలా పిరియడ్స్‌ తొలి రోజున విపరీతమైన కడుపునొప్పి వేధిస్తుంటుంది. అయినా మ్యాచ్‌ను కొనసాగించాల్సిందే! శరీర ధర్మానికి వ్యతిరేకంగా వెళ్లడం ఎవరి తరమూ కాదు. నేను అబ్బాయిగా పుట్టినా నాకీ బాధ తప్పేది. నా కాలి గాయం కంటే కడుపునొప్పి తీవ్రతే ఎక్కువగా ఉంది. ఏదేమైనా కోర్టులో నా శక్తి మేర కష్టపడ్డా. ఫలితం మరోలా రాసిపెట్టి ఉంది.." అంటూ భావోద్వేగానికి గురైంది క్విన్‌వెన్‌. ఇలా ప్రతికూలతల్ని అధిగమించి చక్కటి ఆటతీరును కనబర్చినందుకు గాను ఈ చైనా క్రీడాకారిణిని నెటిజన్లు ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు.

ఆమే తెర తీసింది.. క్విన్‌వెన్‌ మాత్రమే కాదు.. ఇటీవలే జరిగిన Palos Verdes Championshipలో భాగంగా న్యూజిలాండ్‌ గోల్ఫర్‌ లైడియా కో కూడా పిరియడ్స్‌ గురించి నిర్మొహమాటంగా మాట్లాడింది. ఆ సమయంలో నెలసరిలో ఉన్న ఆమె.. ఆఖరి రౌండ్‌ కోసం ఫిజియోథెరపీ తీసుకుంది. "నాకిది నెలసరి సమయం. ఈ సమయంలో తీవ్రమైన నడుంనొప్పితో బాధపడుతుంటా. నడుమంతా పట్టేసినట్లుగా అనిపిస్తుంటుంది. అందుకే ఫిజియోథెరపీ సహాయం తీసుకున్నా. ఆ తర్వాత కాస్త ఉపశమనం కలిగింది.." అంటూ చెప్పుకొచ్చింది కో. అయితే ఈ అసౌకర్యంతోనే రెండు స్ట్రోక్స్‌ తేడాతో మ్యాచ్‌ను చేజార్చుకుందామె.

ఇలా వీళ్లిద్దరే కాదు.. క్రీడారంగంలో నెలసరి గురించి తొలిసారి నిర్భయంగా, నిర్మొహమాటంగా పెదవి విప్పిన ఘనత చైనా స్విమ్మర్‌ ఫు యువాన్హుయీకే దక్కుతుంది. 2016లో రియో ఒలింపిక్స్‌లో టీమ్‌ ఈవెంట్‌లో పాల్గొన్న ఆమె.. నాలుగో స్థానంతో సరిపెట్టుకుంది. అయితే ఇదంతా తన నెలసరి వల్లే అని, ఈ సమయంలో విపరీతమైన నీరసం, అలసట వల్లే వెనకబడిపోయానంటూ చెప్పుకొచ్చింది. అలా నెలసరి గురించి ధైర్యంగా మాట్లాడిన ఫును అప్పట్లో ప్రపంచమంతా కొనియాడింది.

Female Athlet periods tips
నెలసరిని మహిళా అథ్లెట్స్​ ఎలా మేనేజ్‌ చేస్తారో తెలుసా?

అసలెలా మేనేజ్‌ చేస్తారు?.. అయితే తాజా క్విన్‌వెన్‌ సంఘటనతో 'అసలు క్రీడాకారిణులు నెలసరి నొప్పుల్ని ఎలా మేనేజ్‌ చేస్తుంటారు?' అనే ప్రశ్న మరోసారి తెరమీదకొచ్చిందని చెప్పచ్చు. సాధారణంగానే ఈ సమయంలో ఏ పనీ చేయలేం. అలాంటిది ఎప్పుడూ వర్కవుట్లు, సాధన చేస్తూ ఉండే క్రీడాకారిణులు ఈ నెలసరి సమస్యల్ని ఎలా అధిగమిస్తారు? ఆయా క్రీడల్లో ఎలా రాణిస్తారు? అంటూ పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

అయితే వాళ్లకున్న కొన్ని ప్రత్యామ్నాయాలు, వాళ్లు తీసుకునే జాగ్రత్తలు ఈ సమయంలో కలిగే అసౌకర్యాన్ని, అలాగే PMS (ముందస్తు నెలసరి లక్షణాలు)ను మేనేజ్‌ చేసుకునే శక్తిని వాళ్లకు అందిస్తున్నాయని చెబుతున్నారు నిపుణులు. అవేంటంటే..!

రాబోయే పిరియడ్‌ను ముందుగానే అంచనా వేసేందుకు ప్రస్తుతం వివిధ రకాల పిరియడ్‌ ట్రాకింగ్‌ యాప్స్‌ అందుబాటులో ఉన్నాయి. దాంతో ఆ సమయాన్ని బట్టి వారిలో శక్తి స్థాయులు పెరిగేలా వారు తీసుకునే ఆహారంలో, చేసే వ్యాయామాల్లో పలు రకాల మార్పులు చేర్పులు చేస్తుంటారు. తద్వారా నెలసరి సమయంలోనూ చురుగ్గా, ఉత్సాహంగా ఉండచ్చు.

మహిళా అథ్లెట్లకు శిక్షణ అందించే సంస్థలు కూడా వాళ్ల నెలసరి సమయాల్ని ఎప్పటికప్పుడు ట్రాక్‌ చేస్తూ.. వారి జీవనశైలిలో చేయాల్సిన మార్పులు చేస్తుంటాయి. తద్వారా వారి పెర్ఫార్మెన్స్‌ తగ్గకుండా జాగ్రత్తపడతాయి.

మ్యాచ్ల షెడ్యూల్‌తో నెలసరికి సంబంధం ఉండదు. అలాగని నెలసరి సమస్యలు రాకుండా ఉండవు. కాబట్టి ఈ సమయంలో నొప్పి, ఇతర అసౌకర్యాల్ని మేనేజ్‌ చేసుకునేందుకు వీలుగా ఆయా బృందాలకు, వ్యక్తిగతంగా.. ప్రత్యేకంగా నిపుణుల్ని కేటాయిస్తుంటారు. అంతేకాదు.. వేడి నీళ్ల బాటిల్‌, హాట్‌ ప్యాక్‌, పెయిన్‌ కిల్లర్స్‌, కాంట్రాసెప్టివ్స్‌.. వంటి ప్రత్యామ్నాయాలను అందిస్తుంటారు.

మన జాతీయ మహిళా హాకీ జట్టుకు.. వ్యక్తిగతంగా పిరియడ్‌ స్టేటస్‌ను అప్‌డేట్ చేయాలన్న నియమం ఉంది. అంతేకాదు.. ఎవరిది వారు తమ తమ మొబైల్స్‌లోనూ అప్‌డేట్‌ చేసుకోవాల్సి ఉంటుంది. ఇదే పద్ధతిని మన దేశంలో ఇతర క్రీడలకూ అమలు చేస్తున్నారు.

మరికొంతమంది క్రీడాకారిణులు పిరియడ్స్‌ని వాయిదా వేసుకోవడానికి నిపుణుల సలహా మేరకు గర్భ నిరోధక మాత్రలు వేసుకుంటుంటారు. ఇది కూడా ఈవెంట్‌కు ముందు వద్దని చెబుతున్నారు నిపుణులు. ఎందుకంటే వీటి వల్ల పెర్ఫార్మెన్స్‌ స్థాయులు తగ్గుతాయట!

నెలసరి సమయంలో శారీరక నొప్పులే కాదు.. మూడ్‌ స్వింగ్స్‌, ఒత్తిడి.. వంటి మానసిక సమస్యలూ వేధిస్తుంటాయి. ఇలాంటప్పుడు వారి మానసిక ఆందోళనల్ని దూరం చేయడానికి యోగా, ధ్యానం, శ్వాస సంబంధిత వ్యాయామాలు.. వంటివి క్రీడాకారిణులకు సూచిస్తుంటారు మానసిక నిపుణులు.

ఏదేమైనా నెలసరి నొప్పుల్ని, ఇతర అసౌకర్యాల్ని మేనేజ్‌ చేస్తూ/అధిగమిస్తూ తమ కెరీర్‌ను కొనసాగిస్తోన్న క్రీడాకారిణుల పట్టుదలకు హ్యాట్సాఫ్‌ చెప్పాల్సిందే! మరోవైపు తమ నెలసరి సమస్యల్ని బహిరంగంగా చెబుతూ ఎంతోమందిలో స్ఫూర్తి నింపుతున్నారు క్విన్‌వెన్‌ లాంటి వారు.

ఇదీ చూడండి: 'అబ్బాయినైతే బాగుండు.. ఆ 'నొప్పి' ఉండేదే కాదు'.. క్రీడాకారిణి భావోద్వేగం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.