ETV Bharat / crime

Jubilee Hills Accident Case : కారు నడిపిందెవరు? కాజల్ ఎక్కడికి వెళ్లింది?

author img

By

Published : Mar 19, 2022, 8:47 AM IST

Jubilee Hills Accident Case : హైదరాబాద్ జూబ్లీహిల్స్ రోడ్‌ నంబర్‌ 45లో ఈనెల 17న జరిగిన రోడ్డు ప్రమాదం కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఆ మార్గంలోని సీసీ ఫుటేజీ పరిశీలించగా.. ప్రమాదం జరిగిన సమయంలో కారులో ఇద్దరు వ్యక్తులున్నట్లు తేలింది. మరోవైపు ఈ ఘటనలో బిడ్డను కోల్పోయి.. గాయపడి చికిత్స పొందుతున్న మహారాష్ట్ర వాసి కాజల్ చౌహాన్ ఆస్పత్రి నుంచి అదృశ్యమవ్వడం పలు అనుమానాలకు తావిస్తోంది.

Jubilee Hills Accident Case
Jubilee Hills Accident Case

Jubilee Hills Accident Case : జూబ్లీహిల్స్‌ రోడ్‌ నంబరు 45లో గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో నిర్లక్ష్యంగా కారు నడిపి రెండున్నర నెలల పసికందు మృతికి కారకుడైన నిందితుడి జాడ కోసం ఆ మార్గంలోని సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. శుక్రవారం రాత్రి ఇద్దరు అనుమానితుల్ని అదుపులోకి తీసుకున్నారని తెలిసింది. ప్రమాదంలో గాయపడిన మహారాష్ట్ర వాసి కాజల్‌ చౌహాన్‌ను పోలీసులు నిమ్స్‌లో చేర్పించగా.. ఆమె శుక్రవారం మధ్యాహ్నం అదృశ్యమయ్యింది. కారుపై బోధన్‌ ఎమ్మెల్యే స్టిక్కర్‌ ఉండటంతో ఎమ్మెల్యే షకీల్‌ ఒక వీడియోను విడుదల చేశారు. కారు ప్రమాదం తన బంధువు కుమారుడు చేశాడని, బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పానని అన్నారు. తాను ఈ కారును అప్పడప్పుడూ వినియోగిస్తానని వివరించారు.

ఎమ్మెల్యే కుమారుడున్నాడా..

Jubilee Hills Accident Case News : ప్రమాదం జరిగినప్పుడు కారులో ఇద్దరున్నారని బాధితులు తెలిపారు. ఇందులో ఒకరు ఎమ్మెల్యే షకీల్‌ కుమారుడున్నాడన్న ఆరోపణలున్నాయి. బాధితులను ఢీకొనగానే.. అక్కడున్న వారు దాడిచేసే ప్రమాదం ఉందని..ఆ ఇద్దరూ కారు తాళాలు తీసుకుని పారిపోయారు. ఇప్పటికే సీసీ ఫుటేజీలు పరిశీలించి జూబ్లీహిల్స్‌ పోలీసులు కారులో ఉన్నది ఇద్దరని స్పష్టం చేసినా, వారు ఎవరన్నది ఇంకా చెప్పలేమని తెలిపారు. కారు అర్బన్‌ ఇన్‌ఫ్రా పేరుతో ఉందని, నిజామాబాద్‌లోని షోరూంలో కొనుగోలు చేశారని పోలీసులు తెలుసుకున్నారు.

ప్రాణానికి ఖరీదు కట్టారా..

Jubilee Hills Accident Case Updates : నిమ్స్‌లో చికిత్స పొందుతున్న కాజల్‌ చౌహాన్‌ అక్కడి నుంచి అదృశ్యమైంది. ఆసుపత్రికి వచ్చిన ఇద్దరు కాజల్‌తో మాట్లాడారని, చనిపోయిన శిశువు తిరిగి రాడని ఆమెకు నచ్చజెప్పినట్టు తెలిసింది. ప్రస్తుతానికి రూ 2లక్షలు తీసుకుంటే శిశువు అంత్యక్రియలు నిర్వహించడంతో పాటు సొంతూరుకు వెళ్లేందుకు ఏర్పాట్లు చేస్తామని వివరించినట్టు సమాచారం. దీంతో ఆమె సొంతూరుకు వెళ్లినట్టు తెలిసింది. ఓ పోలీసు అధికారి సహకారంతో ఈ రాజీ కుదుర్చుకొని వెళ్లింది.

పొట్టకూటి కోసం వచ్చి.. మహారాష్ట్రలో హైమోద గ్రామానికి చెందిన కాజల్‌ చౌహాన్‌ పొట్టకూటి కోసం రెండు నెలల పిల్లాడితో హైదరాబాద్‌కు వచ్చింది. ఇక్కడ తోడికోడలు సారిక చౌహాన్‌, ఆడబిడ్డ సుశ్మతో కలిసి ఉంటోంది. వీరు జూబ్లీహిల్స్‌లోని పలు కూడళ్లలో స్ట్రాబెర్రీ, బుడగలు విక్రయిస్తున్నారు. ఇలాగే గురువారం రాత్రి 8.30గంటల ప్రాంతంలో విక్రయించి రహదారి మధ్య విభాగినిపై వీరంతా కూర్చొన్నారు. మాదాపూర్‌ కేబుల్‌ బ్రిడ్జి వైపు నుంచి వేగంగా వచ్చిన మహీంద్ర థార్‌ వాహనం ఢీకొంది. కాజల్‌ చౌహాన్‌ చేతిలోని రెండున్నర నెలల పసికందు ఎగిరి రహదారిపై పడింది. కాజల్‌, సారిక, ఆమె చేతిలోని ఏడాది వయసున్న అశ్వతోష్‌, సుశ్మలు గాయపడ్డారు. పసికందు ప్రాణాలు కోల్పోయాడు. కాజల్‌ మినహా మిగిలిన వారందరికీ స్వల్ప గాయాలు కావడంతో ఆసుపత్రి నుంచి డిశ్చార్జి చేశారు.

కార్లు.. హైఎండ్‌ వాహనాలే లక్ష్యంగా తనిఖీలు

హదారులపై జరుగుతున్న ప్రమాదాల్లో అధికంగా కార్లు, బస్సులు, హై ఎండ్‌ వాహనాలుంటున్న నేపథ్యంలో ఆయా వాహనాలే లక్ష్యంగా తనిఖీలు నిర్వహించనున్నామని సంయుక్త కమిషనర్‌(ట్రాఫిక్‌) ఏవీ రంగనాథ్‌ శుక్రవారం అన్నారు. జూబ్లీహిల్స్‌ రోడ్‌ నంబర్‌ 45లో జరిగిన ప్రమాదానికి కారణమైన కారుకు ఇంకా రిజిస్ట్రేషన్‌ నంబర్‌ రాలేదని, ఇలాంటివాటిని తనిఖీల్లో గుర్తించి చర్యలు తీసుకుంటామని తెలిపారు. నలుపు తెరలు, హెడ్‌లైట్‌లు, సైలెన్సర్లు మార్చడం, నంబర్‌ ప్లేట్‌ లేకుండా తిరుగుతున్న వాహనాలను స్వాధీనం చేసుకుంటామని హెచ్చరించారు. వాహనాలపై ఇష్టానుసారంగా ఎమ్మెల్యే/పోలీస్‌/ప్రెస్‌ అన్న స్టిక్కర్లను అతికించుకుంటే కేసులు నమోదు చేస్తామన్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.