ETV Bharat / crime

కొత్తపంథాలో సైబర్​ మోసాలు.. 'జోకర్'​లను చేస్తున్న నేరగాళ్లు

author img

By

Published : Jun 17, 2021, 4:13 AM IST

Joker Malware Cheating in hyderabad
Joker Malware Cheating in hyderabad

సైబర్ నేరగాళ్లు కొత్త పంథాలో మోసాలకు పాల్పడుతున్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని దుర్వినియోగం చేస్తూ నూతన తరహాలో కొల్లగొడుతున్నారు. వినియోగదారుడికి తెలియకుండానే చరవాణి, కంప్యూటర్లలోకి చొరబడే మాల్‌వేర్లను రూపొందించి సమాచారాన్ని తస్కరిస్తున్నారు. ఈ కోవలోకి చెందిందే జోకర్ మాల్‌వేర్. ఆండ్రాయిడ్ వినియోగదారులే లక్ష్యంగా రూపొందించిన "జోకర్ మాల్‌వేర్".... ఖాతాదారుడి ప్రమేయం లేకుండానే వివరాలన్నింటినీ సేకరిస్తుంది.

అంతర్జాలం అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రపంచమే అరచేతిలో ఇమిడిపోయింది. ప్రతీ దానికి ఓ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని ఉపయోగిస్తున్నాం. వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా ప్లే స్టోర్‌లలో కుప్పలుతెప్పలుగా యాప్‌లు పుట్టుకొచ్చాయి. ఇక్కడే సైబర్ నేరగాళ్లు తమ కుట్రకు తెరలేపుతున్నారు. వినియోగదారుడి రహస్య సమాచారాన్నంతా తెలుసుకోవడానికి మాల్‌వేర్లు ప్రవేశపెడుతున్నారు. ఇప్పటివరకు లింకుల ద్వారా మాల్‌వేర్‌లను చొప్పించిన కేటుగాళ్లు... ప్రస్తుతం మన ప్రమేయం లేకుండానే చొరబడేలా చేస్తున్నారు. అప్లికేషన్ డౌన్‌లోడ్ చేసుకోగానే... వాటితో పాటు మాల్‌వేర్ కూడా చేరుతుంది. జోకర్ మాల్‌వేర్ వల్ల మెసేజ్‌లు, ఫోన్‌నంబర్లు, ఫోటోలతో పాటు చరవాణి సమాచారం అంతా వారి చేతుల్లోకి చేరుతుంది.

గతేడాది సెప్టెంబర్‌లోనే జోకర్ మాల‌్‌వేర్‌ను కాలిఫోర్నియాకు చెందిన జడ్ స్కేలర్ ఐటీ సంస్థ గుర్తించింది. గూగుల్ ప్లేస్టోర్‌లోని 17 అప్లికేషన్లలో ఈ జోకర్ మాల్‌వేర్ ఉందని జడ్ స్కేలర్ తేల్చడంతో వాటిని తొలగించారు. అప్పటికే లక్షా 20వేల మంది ఆ అప్లికేషన్లను డౌన్ లోడ్ చేసుకున్నట్లు జడ్ స్కేలర్ సంస్థ తెలిపింది. ఆ యాప్‌లమ కంప్యూటర్లు, చరవాణిల నుంచి డిలీట్ చేయకపోతే సమాచారం సైబర్‌ నేరగాళ్లకు చేరుతూనే ఉంటుంది. ఈ జోకర్ మాల్‌వేర్‌ను బ్లాక్ చేసినా... సైబర్ నేరగాళ్లు మాత్రం పలు రూపాల్లో ప్రవేశపెట్టేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఆన్‌లైన్ తరగతులు, కొనుగోళ్లు, విక్రయాలు... ఇలా ప్రతి దానికీ అంతర్జాలం, సామాజిక మాధ్యమాలను ఆశ్రయిస్తున్నారు. అప్లికేషన్ల ద్వారా ఆకర్షించే ప్రకటనలు రూపొందించి వినియోగదారులను ఆకట్టుకుంటున్నారు. అప్లికేషన్లు, లింకులు, ప్రకటనలను నొక్కితే... జోకర్ మాల్‌వేర్ వలలో చిక్కుకున్నట్లేనని పోలీసులు చెబుతున్నారు. ముంబయిలో ఇప్పటికే వందల సంఖ్యలో యువత జోకర్ మాల్‌వేర్ బారిన పడినట్లు హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు గుర్తించారు. గత నాలుగేళ్లుగా సైబర్ నేరగాళ్లు జోకర్ మాల్‌వేర్ల ద్వారా సమాచారం తస్కరిస్తున్నట్లు నిపుణుల అధ్యయనంలో తేలింది.

అప్లికేషన్లను డౌన్ లోడ్ చేసుకునే ముందు వాటిలో ఉండే నిబంధనలు, అనుమతి అడిగే తీరును గమనించాలని సైబర్ నిపుణులు సూచిస్తున్నారు. అప్లికేషన్ల కింద ఉండే అభిప్రాయాలు, రివ్యూలను చదివిన తర్వాతే వాటిని డౌన్ లోడ్ చేసుకోవాలని సూచిస్తున్నారు.

ఇదీ చూడండి: KTR: రైతును రాజును చేయడమే ప్రభుత్వ లక్ష్యం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.