ETV Bharat / crime

MURDER CASE: అడిగింది ఇవ్వకపోతే హత్య కేసులో ఇరికిస్తా!

author img

By

Published : Aug 5, 2021, 8:40 AM IST

Updated : Aug 5, 2021, 9:02 AM IST

inspector warned rowdy sheeter
సినీఫక్కీలో ఇన్​స్పెక్టర్​ చేతివాటం

హత్య కేసులో నిందితులను పట్టుకొని శిక్ష పడేలా చేయాల్సిన పోలీసు ఉద్యోగి.. ఆ కేసునే అడ్డం పెట్టుకొని బెదిరింపులకు పాల్పడ్డాడు. డబ్బులివ్వకపోతే కేసులో ఇరికిస్తానని బెదిరించాడు. రౌడీషీటర్​ హత్య కేసును బూచిగా చూపి మరో రౌడీషీటర్​ వద్ద రూ. కోటికి బేరసారాలు మొదలెట్టాడు. సినీ ఫక్కీలో జరిగిన ఈ ఘటనలో ఓ పోలీసు కమిషనరేట్​ ఐదుగురిపై వేటు వేసింది.

హైదరాబాద్‌లో జరిగిన ఓ హత్య కేసులో ప్రధాన నిందితుని కోసం పోలీసులు ఏడు నెలలుగా వెతుకుతుండగా అతను ఉత్తర్‌ప్రదేశ్‌లో హత్యకు గురైనట్లు బయటపడింది. ఆ కేసును అడ్డుపెట్టుకొని మరో రౌడీషీటర్‌ను బెదిరించి ఓ ఇన్‌స్పెక్టర్‌ లబ్ధికి యత్నించడం కొత్త మలుపు. తెలంగాణలోని ఓ పోలీస్‌ కమిషనరేట్‌కు చెందిన కీలక విభాగాన్ని కుదిపేసిన ఉదంతం వివరాలివి.

బోరబండ ప్రాంతంలో గత జనవరి 26న రాత్రి రౌడీషీటర్‌ కాలా ఫిరోజ్‌(42) హత్య జరిగింది. ఆ కేసులో జహీరాబాద్‌ మండలం షేకాపూర్‌ ప్రాంతానికి చెందిన లాయిక్‌అలీ అలియాస్‌ లైక్‌ ప్రధాన నిందితుడని తేలింది. ఇదే కేసులో మరో 8 మందిని అరెస్టు చేయగా లైక్‌ పరారీలో ఉన్నాడు. అనేక కేసుల్లో లైక్‌ నిందితుడు. ఫిరోజ్‌ హత్య అనంతరం పరారైన లైక్‌ ఉత్తర్‌ప్రదేశ్‌ రాయ్‌బరేలీలో తలదాచుకున్నాడు. స్నేహితుడైన అమలాపురానికి చెందిన తాళ్లరవి యూపీలోనే ఉంటుండటంతో లైక్‌ అతడిని ఆశ్రయించాడు. సదాశివపేటకు చెందిన సమీర్‌ అనే నేరస్థుడూ జత కలిశాడు.

శత్రుశేషం లేకుండా చేసుకోవాలని..

ఈ క్రమంలో కాలా ఫిరోజ్‌కు సమీప బంధువైన మల్లేపల్లికి చెందిన మరో రౌడీషీటర్‌నూ చంపి శత్రుశేషం లేకుండా చేసుకోవాలని లైక్‌ అనుకున్నాడు. అప్పటికే లైక్‌ కోసం వెతుకుతున్న ఓ కమిషనరేట్‌లోని కీలక విభాగానికి చెందిన బృందం అతడి స్థావరాన్ని గుర్తించి యూపీకి వెళ్లింది. లైక్‌ గత మార్చిలోనే అక్కడ హత్యకు గురయ్యాడనే విషయం వారికి తెలిసింది. కేసు మరుగున పడిపోయినట్లు వెల్లడైంది. తాళ్ల రవితోపాటు సమీర్‌పై ఇప్పటికే వారంట్లు పెండింగ్‌లో ఉండటంతో వారిద్దరిని కొద్దిరోజుల క్రితం తెలంగాణకు తీసుకొచ్చారు. విచారణలో మరిన్ని విస్తుపోయే విషయాలు బహిర్గతమయ్యాయి. తరచూ హేళన చేస్తుండటంతో సమీర్‌తో కలిసి తాళ్ల రవే లైక్‌ను హత్య చేసిన విషయం వెల్లడైంది.

ఆర్మూర్‌లో బెదిరింపులు.. బేరాలు

లైక్‌ హత్య నేపథ్యంలో మల్లేపల్లికి చెందిన రౌడీషీటర్‌ను బెదిరించి సొమ్ము చేసుకోవాలని ఓ ఇన్‌స్పెక్టర్‌ ప్రయత్నించాడనే అంశం చర్చనీయాంశమైంది. రవి, సమీర్‌లను తెలంగాణకు తీసుకొస్తున్న క్రమంలోనే సదరు ఇన్‌స్పెక్టర్‌ రౌడీషీటర్‌ను బెదిరించినట్లు విశ్వసనీయ సమాచారం. ముంబయి మీదుగా ఆర్మూర్‌ వరకు వచ్చాక రౌడీషీటర్‌ను అక్కడికి పిలిపించుకున్నట్లు తెలిసింది. తనకు డబ్బు ఇవ్వకుంటే లైక్‌ హత్య కేసులో ఇరికిస్తానని బెదిరించడంతో గోపన్‌పల్లి ప్రాంతంలో ఒక్కోటి రూ.50లక్షల విలువైన రెండు ప్లాట్లను ఇచ్చేలా మాట్లాడుకున్నట్లు తెలిసింది. దీనిపై ఉన్నతాధికారికి ఉప్పందడంతో రవి, సమీర్‌తోపాటు మల్లేపల్లి రౌడీషీటర్‌ను విచారించే బాధ్యతను మరో బృందానికి అప్పగించారు. రాయ్‌బరేలీకి వెళ్లిన బృందంలోని ఇన్‌స్పెక్టర్‌ సహా అయిదుగురిని వారం రోజుల క్రితం ఆ విభాగం నుంచి తప్పించారు.

ఇదీ చదవండి: THIRD WAVE: 'ఆగస్టు నుంచి రోజుకు గరిష్ఠంగా 1.40 లక్షల కేసులు రావచ్చు'

Last Updated :Aug 5, 2021, 9:02 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.