ETV Bharat / crime

interstate thief: కార్ల దొంగతనంలో.. సింగిల్‌ హ్యాండ్‌ గణేష్‌

author img

By

Published : Apr 25, 2022, 9:29 AM IST

interstate thief: కార్ల దొంగతనంలో అతడి స్టైలే వేరు..! సింగిల్‌ హ్యాండ్‌ గణేష్‌ తరహాలో ఒక్కడే 500కు పైగా కార్లు ఎత్తుకెళ్లాడు. జైల్లో పరిచయమైన వాళ్లలో వాహన దొంగలుంటే వారికి కార్లు ఎలా కొట్టేయాలో చిట్కాలు కూడా నేర్పాడు. అచ్చొచ్చిన స్కోడా కారులో ప్రయాణిస్తూనే దొంగతనం చేయాల్సిన కారును ఎంపిక చేసుకుంటాడు. సొంతకారును వదిలేసి కాజేసిన కారుతో చెక్కేస్తాడు. పోలీసులకు చిక్కిన కార్ల గజదొంగ ఘనకార్యాలు విని పోలీసులే విస్మయానికి గురయ్యారు.

సత్యేంద్రసింగ్‌ షెకావత్‌
సత్యేంద్రసింగ్‌ షెకావత్‌

కార్ల దొంగతనంలో ఇతడి స్టైలే వేరు

interstate thief: రాజస్థాన్‌ రాష్ట్రానికి చెందిన అంతరాష్ట్ర దొంగ సత్యేంద్రసింగ్‌ షెకావత్‌ మామూలోడు కాదంటున్నారు పోలీసులు. దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో వందలాది కార్లను కొట్టేశాడు. గతేడాది హైదరాబాద్‌ పరిధిలోనూ 5 కార్లు చోరీ చేసినట్టు కేసులు నమోదయ్యాయి. అప్పటి నుంచి తప్పించుకు తిరుగుతున్న అతడిని బంజారాహిల్స్‌ పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. విచారణలో షెకావత్‌ గురించి పలు కొత్త విషయాలు వెలుగుచూసినట్టు సమాచారం.

కార్లను దొంగతనం చేసేందుకు అతడు వేసే ఎత్తులు. విక్రయించేందుకు ఎంచుకునే మార్గాలు గురించి వివరిస్తుంటే ఖాకీలే ఆశ్చర్యానికి గురైనట్టు తెలుస్తోంది. జైపూర్‌లో పుట్టి పెరిగిన షెకావత్‌ ఎంబీఏ పూర్తి చేశాడు. అతనికి ఉద్యోగం చేయడం నామోషీ. విలాసవంతమైన జీవితం గడిపేందుకు ఖరీదైన దొంగతనాలను ఎంచుకున్నాడు. 2003 నుంచి ఇప్పటి వరకూ దేశవ్యాప్తంగా పలు నగరాలు, పట్టణాల్లో 500లకు పైగా కేసులు నమోదయ్యాయి.

ఇప్పటి వరకూ 30 పెండింగ్‌ కేసులున్నాయి. ఎవరిని నమ్మని షెకావత్‌ దొంగతనాల్లోనూ ఎవరి సహాయం తీసుకోడు. తన గురించి ఎక్కడా వివరాలు బయటపడకుండా జాగ్రత్తపడతాడు. జైపూర్, అహ్మదాబాద్, బెంగళూరు, ముంబయి, పుణె, దిల్లీ తదితర ప్రధాన నగరాల్లో ఖరీదైన కార్లను మాత్రమే కొట్టేశాడు. కొట్టేసిన కార్లను అమ్మగా వచ్చిన సొమ్ముతో సొంతగా స్కోడా రాపిడ్‌ కొన్నాడు.

లక్కీకారులో..చోరీలు

ఎక్కడ చోరీ చేయాలన్నా అదే లక్కీకారులో ఒక్కడే వెళ్తాడు. స్టార్‌ హోటళ్లు, బార్‌ అండ్‌ రెస్టారెంట్లు, పబ్‌లు సంపన్నవర్గాలు వెళ్లే ప్రాంతాలను ఎంచుకొని అక్కడ నిలిపిన ఖరీదైన కార్లలో ఒకదాన్ని ఎంపిక చేసుకుంటాడు. చైనా నుంచి కొనుగోలు చేసిన పరికరం సహాయంతో తాళాన్ని హ్యాకింగ్‌ చేస్తాడు. 30-40 నిమిషాల్లో నకిలీ తాళం తయారు చేయించి దర్జాగా కారును కొట్టేస్తాడు.

సొంతకారును అక్కడే పార్కింగ్‌లో వదిలేసి చోరీ చేసిన వాహనంతో హర్యానా సరిహద్దుకు చేరతాడు. అక్కడే ఖరీదైన కారును 4-5లక్షల మధ్య విక్రయిస్తాడు. తిరిగి సొంత కారు వదిలిన నగరానికి విమానంలో వచ్చి దాన్ని తీసుకెళతాడు. గతేడాది బంజారాహిల్స్‌ రోడ్‌ నెంబరు-పార్క్‌ హయత్‌ హోటల్‌లో చోరీ చేసిన కారును హర్యానాలో 5లక్షలకు విక్రయించినట్టు పోలీసుల కస్టడీలో చెప్పినట్టు సమాచారం.

కార్లు ఎలా కొట్టేయాలో చిట్కాలు

జైలుకెళ్లినపుడు అక్కడ శిక్ష అనుభవిస్తున్న ఖైదీలతో స్నేహం చేస్తాడు. వాహనాలు దొంగతనం చేసేందుకు అవసరమైన చిట్కాలు వారికి సూచించేవాడవని సమాచారం. మహారాష్ట్ర, రాజస్తాన్, కర్ణాటక రాష్ట్రాల్లో పదుల సంఖ్యలో ఇతడికి శిష్యులున్నట్టు తెలుస్తోంది. కార్లు చోరీ చేసేందుకు బెంగళూరును ఎక్కువగా ఎంపిక చేసుకునేవాడు.

అక్కడ నుంచి తేలికగా వాహనాలను సరిహద్దు దాటించవచ్చనేది షెకావత్‌ ఆలోచన. దొంగిలించిన వాహనాలను కొనుగోలు చేసిన నేరస్తులు వాటినెంబరు ప్లేట్లు, రంగులు మార్చి మానవ అక్రమరవాణా, మత్తుపదార్థాల చేరవేతకు ఉపయోగిస్తున్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు.

ఇదీ చదవండి: పండ్ల రసం ఇప్పిస్తానని తీసుకెళ్లి బాలికపై అత్యాచారం

అఫ్గాన్​ నుంచి 100 కేజీల హెరాయిన్​.. ధర రూ.700 కోట్లకుపైనే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.