ETV Bharat / crime

డ్రగ్స్ దందాలో సూత్రధారులకు చెక్ పెట్టేదెలా..?

author img

By

Published : Sep 7, 2022, 5:54 PM IST

Drugs
Drugs

Drugs gang arrest: హైదరాబాద్‌ను అడ్డాగా చేసుకొని కొందరు కీలక సూత్రధారులు మత్తు పదార్థాలు సరఫరా చేస్తున్నారు. పోలీసులు అరెస్టు చేసినా... బయటకు రాగానే మళ్లీ పాత మార్గంలోనే నడుస్తున్నారు. నగర సీపీగా సీవీ ఆనంద్‌ బాధ్యతలు చేపట్టాక మత్తుదందాపై ఉక్కు పాదం మోపుతున్నారు. సమర్థులైన పోలీస్‌ అధికారులు, సిబ్బందితో.. హైదరాబాద్‌ నార్కొటిక్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ వింగ్‌ ఏర్పాటు చేశారు. ఇటీవల వరుస తనిఖీలు.. అరెస్టులతో పలు కీలక విషయాలు బయటకు వస్తున్నాయి.

Drugs gang arrest: ఇప్పటివరకూ హైదరాబాద్‌లో మత్తుకు బానిసలైన బాధితులు ఉన్నారని.. పోలీసులు భావించేవారు. కానీ తాజాగా పట్టుబడుతున్న స్మగ్లర్లు, కీలకసూత్రధారులనుంచి సేకరించిన సమాచారంతో మాదకద్రవ్యాల సరఫరాకు హైదరాబాద్‌ కేంద్రంగా మారిందనే ఆందోళన వ్యక్తమవుతోంది. నగర శివారున ఉన్న ఖాయిలా పడిన పరిశ్రమలను కొందరు అద్దెకు తీసుకొని... మాదకద్రవ్యాల తయారీకి వాడే ముడిసరుకు తయారు చేస్తున్నారు. గోవా, ముంబయి, దిల్లీ తదితర చోట్ల నుంచి సింథటిక్‌డ్రగ్స్‌ నగరానికి రవాణ అవుతున్నాయి.

దేశ, విదేశాలకు చెందిన లక్షలాది మంది యువతీ, యువకులు.. ఉపాధి, ఉద్యోగ అవకాశాలకు హైదరాబాద్‌ చేరుతున్నారు. పని ఒత్తిడి నుంచి ఉపశమనం కోసం విందు, వినోదాలకు ప్రాధాన్యతనిస్తున్నారు. అవన్నీ మత్తుమాఫియా దందాకు కారణమయ్యాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. చదువు, పర్యాటక వీసాలపై భాగ్యనగరంలో మకాంవేస్తున్న కొందరు నైజీరియన్లు.. దిల్లీ, ముంబయి, గోవా తదితర నగరాల్లోని వారి ద్వారా మత్తుపదార్థాలు సేకరిస్తున్నారు. కొన్ని పబ్‌లు, ఫిట్‌నెస్‌ కేంద్రాలతో... ఒప్పందం కుదుర్చుకొని కమీషన్‌ ఇస్తామంటూ యువతీ, యువకులకు తేలికగా డ్రగ్స్‌ను దగ్గర చేస్తున్నారు.

ఇటీవల అరెస్టయిన ప్రీతీష్‌ నారాయణ, ఓసిగ్వేచు కెంకజేమ్స్, నరేంద్ర ఆర్య తదితరుల వద్ద స్వాధీనం చేసుకొన్న మొబైల్‌ఫోన్లలో వందలాది మంది ఫోన్‌నెంబర్లను పోలీసులు గుర్తించారు. వారంతా గోవాలో మత్తుపదార్థాలు కొనుగోలు చేస్తున్నారని తేల్చారు. ఎవరికి వారే సొంత నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసుకొని... మాదకద్రవ్యాలు రవాణా చేస్తున్నారు. మత్తుకు అలవాటు పడిన వారిలో నమ్మకమైన వారిని ఏజెంట్లుగా మలచుకొని... ఏపీ, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలకు యథేచ్ఛగా సరుకు చేరవేస్తున్నారు. ఇందుకు వాట్సాప్ గ్రూపుల్లో కోడ్ భాషను వాడుతున్నారు. మూడో కంటికి తెలియకుండా సరుకు.. ఎవరికి ఎలా చేరవేయాలి. పోలీసులకు పట్టుబడకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..... ఆ విషయంలో సూత్రధారులు అత్యంత జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు.

డార్క్‌నెట్‌ ద్వారా కొకైన్‌... హెరాయిన్‌.. ఎల్‌ఎస్‌డీ, ఎండీఎంఏ సరుకుకు ఆర్డరివ్వగానే డబ్బు చెల్లించాలి. మత్తుపదార్థాలు విక్రయిస్తున్న సంస్థలు.. డీలర్లకు డార్క్‌నెట్‌లో రేటింగ్స్‌ ఇస్తారు. తద్వారా ఎవరి వద్ద సరుకు కొనుగోలు చేయాలనేది నిర్ణయించుకుంటారు. ఇటీవల పట్టుబడిన నరేంద్రఆర్య.. డార్క్‌నెట్‌లో... టాప్‌-10లో ఉన్నాడు. డబ్బు అందాక.. కొరియర్‌ ద్వారా ప్యాకెట్‌ను సీసీ కెమెరాలులేని చోట ఉంచి... ఆ తర్వాతా ఫొటో తీసి కొనుగోలుదారులకు వాట్సాప్‌ ద్వారా పంపిస్తారు. అక్కడ ప్యాకెట్‌ అందుకోగానే డీల్‌ ఓకే అని సంకేతం పంపుతారు. ఆ మొత్తం వ్యవహారంలో సూత్రధారులు, ఏజెంట్లు ఎవరనేది అధికశాతం కొనుగోలుదారులకు తెలియకపోవటం విశేషం. పలు మార్లు పోలీసులు నిందితులను అరెస్టు చేసినా జైలు నుంచి విడుదలైన తర్వాత... మళ్లీ అదే దందా కొనసాగిస్తున్నారని అధికారులు గుర్తించారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.