ETV Bharat / crime

పెళ్లి చేసుకుందామంటారు.. నమ్మితే ఇక అంతే!

author img

By

Published : Mar 22, 2021, 8:52 AM IST

పెళ్లి చేసుకుందామంటారు.. నమ్మితే ఇక అంతే!
పెళ్లి చేసుకుందామంటారు.. నమ్మితే ఇక అంతే!

పెళ్లి చేసుకుని ఇద్దరం ఒక్కటవుదామంటారు. అతడు ఆమెలా.. ఆమె అతడిలా.. క్షణాల్లో గొంతు మార్చేస్తారు. ఇక్కడే ఉంటారు.. ఎక్కడో విదేశాల్లో ఉన్నట్లు మాయ చేస్తారు. హమ్మయ్యా.. తోడు దొరికిందని ఆనందించేలోపు ఉన్నదంతా ఊడ్చేసి మాయమవుతారు. కొందరేమో పరువు పోతుందంటూ ఈ కి‘లేడీ’ల గురించి బయటకు చెప్పుకోలేక తమలో తామే కుమిలిపోతూ నరకం చూస్తున్నారు. మరికొందరేమో ధైర్యం చేసి పోలీసులకు ఫిర్యాదు చేస్తుండటంతో ఈ ‘హైటెక్‌’ మోసాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇలాంటి తరహా కేసుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతుండటంతో సైబరాబాద్‌, రాచకొండ సైబర్‌క్రైం పోలీసులు అప్రమత్తమై ప్రత్యేక దృష్టి సారించారు.

  • కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలో తండ్రి(58) అసిస్టెంట్‌ మేనేజర్‌.. కుమారుడు అమెరికాలోని ప్రముఖ కంపెనీలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌.. కుమారుడికి పెళ్లి చేయాలని మ్యాట్రిమోనీ వెబ్‌సైట్‌లో వివరాలు పెట్టాడు. పెళ్లి చేసుకుంటానంటూ నమ్మించి ఓ కి‘లేడీ’ రూ.1.72 లక్షలు టోపి పెట్టింది. సైబరాబాద్‌ సైబర్‌క్రైం పోలీసులకు తండ్రి ఫిర్యాదు చేశారు. ఈయనొక్కరే కాదు.. ఇలాంటి బాధితుల సంఖ్య చాలానే ఉంది.
  • నెల్లూరు జిల్లా కొవ్వూరు మండలం రంగనాయకులపేటకు చెందిన స్వాతి(30) ఎంబీఏ పూర్తి చేసింది. నగర శివారులోని ఘట్‌కేసర్‌ పోచారంలో నివాసముంటుంది. విలాసవంతమైన జీవితానికి అలవాటు పడి పెళ్లి చేసుకుంటానంటూ మోసాలకు పాల్పడుతుంది. సైబరాబాద్‌, రాచకొండ, హైదరాబాద్‌ పోలీసులు పలుమార్లు అరెస్ట్‌ చేశారు. బెయిల్‌పై విడుదలై మళ్లీ అదే దారిలో వెళ్తుంది. తాజాగా రాచకొండ పోలీసులు మరోసారి అరెస్ట్‌ చేశారు. ఆమె ఒక్కరే కాదు.. ఇలాంటి కి‘లేడీ’లు ఇంకా చాలా ముందే ఉన్నారని అప్రమత్తంగా ఉండాలంటూ పోలీసులు హెచ్చరిస్తున్నారు.

అక్కడే ఉన్నట్లు వర్చువల్‌ నంబర్‌...

గూగుల్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకున్న గుర్తు తెలియని మహిళల ఫొటోలతో మ్యాట్రిమోనీ వెబ్‌సైట్లలో నకిలీ ప్రొఫైల్స్‌ను సృష్టిస్తున్నారు. స్థానికులైతే ఇబ్బందులు ఎదురవుతాయని ఎన్‌ఆర్‌ఐలపై గురి పెడుతున్నారు. విదేశాల్లో పెద్ద ఉద్యోగం చేస్తున్నానని, పెళ్లి తర్వాత కూడా అక్కడే ఉంటానని, ఎన్‌ఆర్‌ఐలు మాత్రమే సంప్రందించాలని ప్రొఫైల్‌లో పేర్కొంటున్నారు. సెకండ్‌ లైన్‌ యాప్‌ తదితర మొబైల్‌ యాప్‌ల సాయంతో వర్చువల్‌ నంబర్‌(విదేశాల్లో ఉన్నట్లుగా ఫోన్‌ నంబర్‌)ను సృష్టిస్తున్నారు. ఆ నంబర్‌ను అన్ని మ్యాట్రీమోనీ వెబ్‌సైట్లలోనూ పోస్ట్‌ చేస్తున్నారు. బాధితులకు అనుమానం రాకుండా ఈ నంబర్‌(యాప్‌) ద్వారానే సంప్రదింపులు జరుపుతున్నారు. ఫోన్‌ నంబర్‌ అక్కడిదే కావడంతో బాధితులకు ఎలాంటి అనుమానం రావడం లేదు.

ఇక్కడి నుంచే అసలు కథ...

ఇక్కడి నుంచే అసలు కథ మొదలవుతుంది. పెళ్లి కొడుకు కుటుంబం మా అమ్మాయికి నగలు, ఇతరత్రా వస్తువులు పెట్టాలన్నది మా ఆచారం అంటూ బోల్తా కొట్టిస్తున్నారు. ఇప్పుడు భారత్‌కు రావడం కష్టమని, డబ్బులు పంపిస్తే ఆమె తనకు కావాల్సినది కొనుక్కుంటుందని నమ్మిస్తున్నారు. ఇంకొన్ని సందర్భాల్లోనేమో అమ్మాయి.. అబ్బాయికి ఫోన్‌ చేసి వీసా స్టాంపింగ్‌ కోసం భారత్‌కు వెళ్లాల్సి వచ్చిందని నమ్మిస్తున్నారు. హడావుడిలో ఏటీఎం కార్డులు మరిచిపోయానని స్నేహితురాలు/మరొకరి ఖాతాలో డబ్బులు జమ చేయాలని కోరుతున్నారు. కాబోయే కోడలే/భార్యనే కదా అంటూ ముందువెనకా ఆలోచించకుండా రూ.లక్షలు ఆన్‌లైన్‌లో బదిలీ చేస్తున్నారు. ఆ తర్వాత అటువైపు నుంచి స్పందన లేకపోవడంతో మోసపోయినట్లు తెలుసుకుని లబోదిబోమంటూ ఆశ్రయిస్తున్నారని సైబరాబాద్‌, రాచకొండ సైబర్‌క్రైమ్‌ పోలీసులు వివరిస్తున్నారు.

సాఫ్ట్‌వేర్‌ సాయంతో గొంతు మార్ఛి..

ఆయా వెబ్‌సైట్లలో పేర్కొన్న నంబర్లకు ఈ కి‘లేడీ’లు ఫోన్‌ చేస్తున్నారు. ఒకవేళ అబ్బాయి ఎత్తితేనేమో మన ఆలోచనలు కలిశాయంటూ మాట కలుపుతున్నారు. మీ తల్లిదండ్రులు ఒప్పుకొంటేనే పెళ్లి అంటూ షరతూ విధిస్తున్నారు. దీంతో అబ్బాయిలు తమ తల్లిదండ్రులతో ఫోన్‌ చేయిస్తున్నారు. ముందు కుశల ప్రశ్నలడిగి పెళ్లి వ్యవహారాలు మా పెద్దవాళ్లతో మాట్లాడమంటూ ఫోన్‌ ఇస్తున్నారు. వాయిస్‌ మాడ్యూలేషన్‌ సాఫ్ట్‌వేర్‌ సాయంతో గొంతు మార్చి మోసగత్తెలే పెళ్లి పెద్దగా (తండ్రి/తల్లి/సోదరి/సోదరుడు) సంప్రందింపులు జరుపుతున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.