ETV Bharat / crime

నెత్తురోడిన ఓఆర్​ఆర్​... కొత్త ఏడాదిలోనైనా ప్రమాదాలు తగ్గేనా..?

author img

By

Published : Dec 31, 2021, 6:18 PM IST

Accidents on Hyderabad ORR: భాగ్యనగరానికి మణిహారంగా ఉన్న బాహ్యవలయ రహదారి ప్రతి ఏటా వందల సంఖ్యలో ప్రాణాలు బలిగొంటోంది. గత ఐదేళ్లలో ఏటా ఈ సంఖ్య భారీగా పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఔటర్‌ రింగ్‌రోడ్‌పై ప్రమాదాలకు కారణాలు తెలిసినా వాటిని అరికట్టడంలో అధికార యంత్రాంగం చర్యలు సత్ఫలితాలు ఇవ్వటం లేదు. కొత్త ఏడాది ఓఆర్‌ఆర్‌పై రోడ్డు ప్రమాదాల నివారణను ఓ టాస్క్‌గా పరిగణించాలని పోలీసులు, ఆర్టీఏ, హెచ్‌ఎండీఏ, వైద్య విభాగం తలపెట్టాయి. ఓఆర్‌ఆర్‌పై అతివేగం, మద్యం సేవించి వాహనాలు నడపడటం, రోడ్డుపై అడ్డంగా వాహనాలు నిలిపివేయటం వంటి విషయాల్లో కఠినంగా వ్యవహరించటంతో పాటు ప్రమాదాలు జరిగినప్పుడు బాధితులను వీలైనంత త్వరగా ఆస్పత్రికి తరలించి వారికి ట్రామా కేర్ సెంటర్లలో చికిత్స అందించటం ద్వారా ప్రాణాలు కొంతవరకైనా కాపాడాలని భావిస్తున్నారు.

Accidents on ORR
ఓఆర్​ఆర్​పై ప్రమాదాలు

Accidents on Hyderabad ORR: హైదరాబాద్‌ బాహ్య వలయ రహదారిపై రోడ్డు ప్రమాదాల నివారణపై సర్కారు ప్రత్యేక దృష్టి సారించింది. కొవిడ్ నేపథ్యంలో వాహనాల సంఖ్య దాదాపు రెట్టింపైనప్పటికీ... రోడ్డు ప్రమాదాలు, మరణాలు పెరగకుండా వ్యూహాత్మకంగా హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ - హెచ్‌ఎండీఏ చర్యలు తీసుకుంటోంది. పెరుగుతున్న జనాభా నేపథ్యంలో అదే సమయంలో వాహనాల సంఖ్య పెరుగుతున్న దృష్ట్యా ఓఆర్‌ఆర్‌పై ప్రమాదాల నివారణకు హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్​- హెచ్‌జీసీఎల్ పక్కా ప్రణాళిక రూపొందించి అమలు చేస్తోంది.

లాక్​డౌన్​ ఎత్తేశాక పెరిగిన ప్రమాదాలు

2016లో ఓఆర్‌ఆర్‌పై 150 దాకా రోడ్డు ప్రమాదాలు సంభవించాయి. ఆ సమయంలో 60 వేల వాహనాలు తిరిగేవి. 47 నుంచి 50 మరణాలు నమోదయ్యాయి. ఆ తర్వాత కొవిడ్ నేపథ్యంలో లాక్‌డౌన్ సమయంలో వాహనాలు తక్కువగా రాకపోకలు సాగించాయి. లాక్‌డౌన్ ఆంక్షలు ఎత్తేసిన తరువాత.. క్రమంగా వ్యక్తిగత వాహనాల సంఖ్య పెరగడంతో ప్రస్తుతం ఆ సంఖ్య 1 లక్షా 30 వేలకు పెరిగాయి. వాహనాల సంఖ్య పెరిగినా... ఈ మూడేళ్ల కాలంలో ప్రమాదాలు, మరణాలు స్థిరంగా ఉన్నాయి. భారీ ప్రమాదాలు తగ్గినట్లు... చిన్న ప్రమాదాలు పెరిగాయని హెచ్‌జీసీఎల్ ప్రకటించింది. బాహ్య వలయ రహదారిపై ప్రమాదం జరిగితే టోల్‌ఫ్రీ నంబరు- 1066కు ఫోన్‌ చేస్తే 8 నిమిషాల వ్యవధిలో అత్యాధునిక అంబులెన్స్‌లు ఘటనా స్థలానికి చేరుకుని బాధితుల్ని ట్రామా కేర్ సెంటర్లకు తరలిస్తున్నాయి. ఉచిత వైద్య సేవలు అందించే ఈ కేంద్రాలు గతంలో 10 ఉండగా... నవంబరు నుంచి మరో 6 సెంటర్లు అందుబాటులోకి వచ్చాయి. ఈ మొత్తం 16 కేంద్రాలు 24X7 అద్భుతమైన సేవలందిస్తున్నాయి. ఓఆర్ఆర్‌పై 2020 నవంబరు నుంచి 2021 డిసెంబరు వరకు 1,084 మంది ప్రాణాలు కాపాడినట్లు హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ సంతోష్ వెల్లడించారు.

Accidents on ORR
ఓఆర్​ఆర్​పై ప్రమాదాలు

ఆ అధికారం లేక

Accidents on ORR: 158 కిలోమీటర్ల బాహ్య వలయ రహదారిపై 19 టోల్ గేట్లు ఉండగా... అతి వేగం నియంత్రించేందుకు 10 చోట్ల స్పీడ్ గన్లు ఏర్పాటు చేయడంతో అవి వేగం గుర్తించి ఆ వివరాలు రోడ్డు నిర్వహిస్తున్న వారికి వెళుతున్నాయి. ఈ వాహనదాదారులకు చలాన్లు వేసే అధికారం హెచ్‌జీసీఎల్‌కు లేకపోవడం వల్ల అక్కడితోనే అగిపోతున్నారు. వీటితో పాటు ఇప్పడు ప్రతి టోల్‌గేట్‌లో తప్పనిసరిగా మారిన ఫాస్టాగ్ ద్వారా వాహనదారు వేగం గుర్తించేందుకు కసరత్తు చేస్తోంది. ఓ టోల్‌గేట్‌లో ఫాస్టాగ్ చేసి బయలుదేరిన సమయం... మరో టోల్‌గేట్‌కు ప్రవేశించిన సమయం ద్వారా ఆ వాహనం వేగాన్ని నిర్ధరించనుంది. రహదారిపై స్పీడ్ నియమ నిబంధనలు అతిక్రమించిన వాహన యజమానులపై జరిమానాలు విధించేందుకు సన్నద్ధమవుతోంది.

నిర్లక్ష్య డ్రైవింగ్​

సాధారణంగా హైదరాబాద్ ఓఆర్‌ఆర్‌పై పగటి పూట ప్రమాదాలు 60 శాతం, రాత్రి వేళల్లో 32 నుంచి 40 శాతం నమోదవుతున్నాయి. గతంలో 120 కిలోమీటర్ల వేగం నిబంధన ఉండేది. ప్రమాదాల తీవ్రత తగ్గించేందుకు వాహనాల వేగం 100 కిలోమీటర్లకు పరిమితం చేసింది హెచ్‌జీసీఎల్‌, పోలీసు శాఖ. అయినా అతి వేగం, మద్యం సేవించి వాహనాలు నడపడం, నిర్లక్ష్యం, రాత్రి వేళల్లో నడుపుతూ నిద్రలోకి జారుకోవడం రోడ్డు ప్రమాదాలకు కారణమవుతున్నాయి. ప్రమాదాల బారినపడిన క్షత్రగాత్రులను మెరుపు వేగంతో తీసుకొచ్చి ఉచితంగా ట్రామా కేర్ సెంటర్లలో ప్రాథమిక చికిత్స అందించి ప్రాణాలు కాపాడుతున్నారు. ఒకవేళ ఆరోగ్యం విషమిస్తే అత్యవసర వైద్య సేవల కోసం బాధితుల ఇష్టప్రకారం సమీప ఆస్పత్రులకు పంపించి ప్రమాద తీవ్రత తగ్గిస్తున్నామని ట్రామా కేర్ సెంటర్ల వైద్య నిపుణులు తెలిపారు.

Accidents on ORR
క్షతగాత్రులను కాపాడుతున్న ట్రామా కేర్​ సెంటర్లు

ఆపదలో ట్రామా సెంటర్ల వైద్యం

ప్రభుత్వం ఆదేశాల మేరకు మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవతో ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో ఈ అత్యాధునిక వైద్య సేవలు అందిస్తున్నారు. మొత్తం 16 ట్రామా కేర్ సెంటర్లలో... 8 అపోలో ఆస్పత్రులు, మరో 8 యశోద ఆస్పత్రుల యాజయాన్యం భాగస్వామ్యంతో ద్విగ్విజయంగా నడుస్తున్నాయి. ఓఆర్‌ఆర్‌పై రోడ్డు ప్రమాదాల్లో గాయపడ్డ క్షతగాత్రులే కాకుండా సమీప గ్రామాల వాసులు కూడా గుండెపోటు వంటి అత్యవసర పరిస్థితుల్లో ఈ ట్రామా కేర్ సెంటర్లకు వచ్చినా ప్రాథమిక చికిత్స అందించి మెరుగైన వైద్య సేవల కోసం ప్రభుత్వ, ప్రైవేటు, కార్పొరేట్ ఆస్పత్రులకు తరలిస్తుండటంతో వైద్యులు తమ వంతు సాయడపతున్నారు. ఓఆర్‌ఆర్‌పై ప్రమాదాలు తగ్గించడంతో పాటు క్షతగాత్రుల ప్రాణాలు కాపాడేందుకు ఏర్పాటు చేసిన మౌలిక సదుపాయాలతో కూడిన ఈ ట్రామా కేర్ సెంటర్లలో ఒక్కో చోట రెండు బెడ్లు, అత్యాధునిక పరికరాలు, వైద్య సేవలు, సాంకేతిక పరిజ్ఞానం, శిక్షణ పొందిన వైద్య నిపుణులు, సిబ్బంది అందుబాటులో ఉండటం ఓ ప్రత్యేకత. ట్రామా కేర్ సెంటర్లలో క్షతగాత్రుల ఆరోగ్య పరిస్థితులను బట్టి సూచనలు, సలహాల కోసం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా టెలీ మెడిసిన్ సదుపాయం సైతం అందుబాటులో ఉందని అపోలో యాజమాన్యం పేర్కొంది.

బాహ్య వలయ రహదారిపై ఇప్పటికే 120 కిలోమీటర్లు ఉన్న వేగ పరిమితిని తాజాగా 100 కిలోమీటర్లకు కుదించిన నేపథ్యంలో "ఫాస్టాగ్" ద్వారా మరింత కట్టుదిట్టం చేసేందుకు రంగం సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగా పోలీసుశాఖతో చర్చలు జరిపి త్వరలో అమల్లోకి తెచ్చేందుకు హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ సన్నాహాలు చేస్తుండటం విశేషం.

ఇదీ చదవండి: దేశంలో 'ఒమిక్రాన్' విజృంభణ.. డెల్టాను మించి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.