ETV Bharat / crime

ఎఫ్‌సీఐ తనిఖీల్లో వెలుగులోకి రూ.7.49 కోట్ల సీఎంఆర్ బియ్యం అక్రమాలు

author img

By

Published : Apr 15, 2022, 8:37 PM IST

FCI Inspections
FCI Inspections

FCI Inspections in Nizamabad: సీఎంఆర్ బియ్యం పక్కదారి పడుతోన్న విషయం ఎఫ్​సీఐ తనిఖీల్లో నిజామాబాద్ జిల్లాలో వెలుగులోకి వచ్చింది. అధికారుల ఉదాసీనత మిల్లర్లకు వరంగా మారింది. సరైన పర్యవేక్షణ లేక ఓ రైస్ మిల్లర్ రూ.7.49 కోట్ల విలువైన బియ్యాన్ని సొంతానికి అమ్ముకున్నారు. ఈ ఘటనపై బుధవారం పోలీసులు కేసు నమోదు చేశారు.

FCI Inspections in Nizamabad: నిజామాబాద్ జిల్లాలో ఎఫ్​సీఐ తనిఖీల్లో పక్కదారి పడుతోన్న సీఎంఆర్ బియ్యం అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. కొందరు బహిరంగ మార్కెట్లో విక్రయిస్తూ వ్యాపారం చేసుకుంటున్నారు. ఇలాంటి వారిని కట్టడి చేయాల్సిన అధికార యంత్రాంగం ఉదాసీనంగా వ్యవహరించటం అక్రమార్కులకు కలిసి వస్తోంది. సరైన పర్యవేక్షణ లేక బోధన్ మండలం సాలూర క్యాంపు శివశక్తి రైస్ మిల్లర్ రూ.7.49 కోట్ల విలువైన బియ్యాన్ని సొంతానికి అమ్ముకున్నారు.

వ్యాపార ఒప్పందంలో నిర్ణీత గడువులోగా బియ్యాన్ని ప్రభుత్వానికి అప్పగించాల్సి ఉండగా.. మిల్లర్లు పైరవీలతో గడువు పెంచుకుంటూ పోతున్నారు. నిజానికి మిల్లు ఆడించటంలో ఆలస్యం జరగటం లేదు. బియ్యాన్ని తమ వ్యాపార అవసరాలకు వాడుకోవటం కోసమే కొందరు ఇలా చేస్తున్నారు. వారి కుంటి సాకులను వింటూ అధికారులు గడువు పెంచుతూ పోతున్నారు. సాలూర క్యాంపులోని రైస్‌మిల్లుకు గత యాసంగి, ఖరీఫ్‌లో కలిపి 8 వేల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కేటాయించారు. యాసంగి గడువు ముగిసినా.. సదరు యజమాని కొంత బాకీ ఉన్నారు. ఖరీఫ్‌కు సంబంధించి ఇంకా సీఎంఆర్​ మొదలే పెట్టలేదు. బోధన్​లోని మిల్లర్ రూ.7.49 కోట్ల విలువైన 38,240 క్వింటాళ్ల బియ్యం అమ్ముకున్నట్లుగా అధికారులు లెక్కలు తేల్చారు.

పౌరసరఫరాల కార్పొరేషన్‌ డీటీలు.. కస్టమ్‌ మిల్లింగ్‌ ఆడిట్‌ చేస్తుండాలి. వారి విధుల్లో భాగంగా ఆయా మిల్లులకు కేటాయించిన ధాన్యం మిల్లింగ్‌ వేగంగా పూర్తయ్యేలా చూడాలి. ఆ బియ్యాన్ని ఎఫ్‌సీఐకి అప్పగించాలి. ఇలా పక్కా పర్యవేక్షణ లేకనే సాలూరలో అక్రమం జరిగినట్లు తెలుస్తోంది. బియ్యం పక్కదారి పట్టిన మిల్లు లీజులో ఉండటంతో లీజుదారు, అతడి వ్యాపార భాగస్వామిపై బుధవారం కేసు పెట్టారు. అంతా అయిపోయాక... ఇప్పుడు రికవరీ చట్టం ప్రకారం వారికి నోటీసులు జారీ చేస్తున్నట్లు చెబుతున్నారు. ఆ మిల్లు ఖరీదు తిరిగివ్వాల్సిన ధాన్యం కంటే రెండున్నర రెట్లు ఉంటుందని, సదరు వ్యక్తుల ఆస్తులను అటాచ్‌ చేసి.. చట్టప్రకారం స్వాధీనం చేసుకొనే దిశగా ప్రయత్నాలు చేస్తున్నట్లు పేర్కొంటున్నారు. అయితే న్యాయపరమైన చిక్కులు ఎదురుకానున్నందున ముందుగా మేల్కొంటే ఈ చికాకులు ఉండేవి కావనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ఇదీ చదవండి:పెళ్లిని అడ్డుకునేందుకు యత్నించిన యువతి.. జుట్టుపట్టి ఈడ్చుకెళ్లిన వరుడి బంధువులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.