ETV Bharat / crime

Loan App case News: పీసీఎఫ్‌ఎస్‌ సంస్థ ఖాతాల్లోని రూ.131.11 కోట్ల జప్తు

author img

By

Published : Oct 1, 2021, 7:31 AM IST

Loan App case News
Loan App case News: పీసీఎఫ్‌ఎస్‌ సంస్థ ఖాతాల్లోని రూ.131.11 కోట్ల జప్తు

రుణ యాప్‌ల కేసులో ఈడీ దర్యాప్తు (enforcement directorate) ముమ్మరం చేసింది. పీసీ ఫైనాన్షియల్ సర్వీసెస్‌కు చెందిన మరో రూ.131 కోట్లను జప్తు చేసింది. క్యాష్‌బీన్ మొబైల్ యాప్ (cash been mobile app) ద్వారా రుణాలిచ్చిన పీసీఎఫ్ఎస్... చైనాకు చెందిన జో యాహుయ్ అధీనంలో పనిచేస్తోందని ఈడీ (ed) పేర్కొంది.

విదేశీ మారకద్రవ్య నిర్వహణ చట్టం (ఫెమా) నిబంధనలను ఉల్లంఘించినందుకు పీసీ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ ప్రై.లిమిటెడ్‌ (పీసీఎఫ్‌ఎస్‌) ( PC Financial Services Pvt Ltd) సంస్థకు చెందిన బ్యాంకు, వర్చువల్‌ ఖాతాల్లోని రూ.131.11 కోట్లను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ed) జప్తు చేసింది. సూక్ష్మరుణాలు ఇస్తామంటూ నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీగా స్థాపించిన ఈ సంస్థ వ్యాపార లావాదేవీల ద్వారా ఆర్జించిన సొమ్మును నిబంధనలకు విరుద్ధంగా విదేశాలకు మళ్లించినట్లు తేలడంతో ఈడీ (ed) చర్యలకు ఉపక్రమించింది. ఇదే సంస్థకు చెందిన రూ.106.93 కోట్లను ఆగస్టు 26న ఈడీ జప్తు చేసిన సంగతి తెలిసిందే. ఈ నిధుల్లో దాదాపు రూ.90 కోట్లు తమ ఖాతాలోకి వచ్చినట్లు ఈడీ వర్గాలు వెల్లడించాయి.

క్యాష్‌బీన్‌ యాప్‌ కేంద్రంగా దందా:

మొబైల్‌ అప్లికేషన్‌ ‘క్యాష్‌బీన్‌’ ద్వారా సూక్ష్మరుణాలు ఇచ్చిన పీసీఎఫ్‌ఎస్‌ సంస్థపై ఈడీ దర్యాప్తు (ed investigation) చేయగా, మెక్సికోకు చెందిన ఓప్లే డిజిటల్‌ సర్వీసెస్‌, హాంకాంగ్‌లోని టెన్‌స్పాట్‌ పెసా లిమిటెడ్‌, కేమన్‌ దీవుల్లోని ఒపేరా లిమిటెడ్‌, విజ్‌డమ్‌ కనెక్షన్‌ హోల్డింగ్‌ లాంటి సంస్థల నుంచి విదేశీ నిధులు వచ్చినట్లు వెల్లడైంది. ఈ సంస్థలన్నీ చైనా దేశస్థుడు జౌ యాహుయ్‌కి చెందినవని తేలింది. 1995లో భారతీయులే డైరెక్టర్లుగా స్థాపించిన పీసీఎఫ్‌ఎస్‌కు 2002లో ఎన్‌బీఎఫ్‌సీ లైసెన్స్‌ దక్కగా.. ఆర్‌బీఐ ధ్రువీకరణ అనంతరం 2018లో చైనా దేశస్థుల అధీనంలోకి వెళ్లినట్లు నిర్ధారణ అయింది. విదేశీ సంస్థల నుంచి పీసీఎఫ్‌ఎస్‌లోకి రూ.173 కోట్ల నిధులు వచ్చినట్లు గుర్తించారు. వాటితో సూక్ష్మ రుణ వ్యాపారం నిర్వహించి అనతికాలంలోనే పెద్దమొత్తం గడించినట్లు తేలింది.

విదేశీ కంపెనీలకు...

వాటి నుంచి రూ.429.29 కోట్లను అక్రమంగా విదేశీ కంపెనీలకు ( foreign companies) తరలించినట్లు వెల్లడైంది. మరో రూ.941 కోట్లను వ్యయంగా చూపించినట్లు తేలింది. నిధుల్ని తరలించిన విదేశీ సంస్థలన్నీ ( foreign companies) ఒపేరా గ్రూపునకు చెందిన చైనా దేశస్థులవే అని నిర్ధారణ అయింది. ఈ గోల్‌మాల్‌ చైనాలోని జౌ యాహుయ్‌ ఆదేశాల మేరకు జరిగినట్లు తేలింది. అతడి సూచనల మేరకు హాంకాంగ్‌, చైనా, తైవాన్‌, అమెరికా, సింగపూర్‌ల్లోని 13 కంపెనీలకు సొమ్ము తరలినట్లు గుర్తించారు. క్యాష్‌బీన్‌ యాప్‌నకు రూ.245 కోట్ల లైసెన్స్‌ రుసుం, రూ.110 కోట్ల సాంకేతిక రుసుం, రూ.66 కోట్ల ఆన్‌లైన్‌ మార్కెటింగ్‌, ప్రకటనల రుసుముగా చెల్లించినట్లు లెక్క చూపారు.

ఇదీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.