Drugs In Hyderabad: మత్తుమందుల అక్రమ రవాణా.. వయా హైదరాబాద్

author img

By

Published : Aug 7, 2021, 4:53 AM IST

drugs transportation
హైదరాబాద్​లో యథేచ్ఛగా మత్తుమందుల అక్రమ రవాణా ()

హైదరాబాద్​లో యథేచ్ఛగా మత్తుమందుల అక్రమ రవాణా కొనసాగుతోంది. ఏఓబీ టు మహారాష్ట్ర వయా భాగ్యనగరం మీదుగా రవాణా అవుతోంది. భారీ లాభాలు వస్తుండటంతో మాదకద్రవ్యాల ముఠాలు భారీ ఎత్తున రవాణా చేస్తూ రెచ్చిపోతున్నాయి. ఆఫ్రికా నుంచి హెరాయిన్‌ ఇబ్బడిముబ్బడిగా దిగుమతి అవుతుండగా.. గత బుధవారం కొత్తగూడెం పోలీసులు రూ. 7.30 కోట్ల విలువైన గంజాయి స్వాధీనం చేసుకోవడంతో మత్తుమందుల వ్యవహారం మరోమారు తెరపైకి వచ్చింది.

రాష్ట్రంలో మత్తుమందులు గుప్పుమంటున్నాయి. ఆఫ్రికా నుంచి హెరాయిన్‌ ఇబ్బడిముబ్బడిగా దిగుమతి అవుతుండగా ఆంధ్రప్రదేశ్‌ - ఒడిశా సరిహద్దుల్లో పండే గంజాయి హైదరాబాద్‌ మీదుగా రవాణా అవుతోంది. మరోపక్క రాజస్థాన్‌ నుంచి నల్లమందు రాక కూడా పెరిగింది. మొత్తం మీద రాష్ట్రం ముఖ్యంగా హైదరాబాద్‌ మాదకద్రవ్యాల రవాణాలో కేంద్రంగా మారుతోంది. గత బుధవారం కొత్తగూడెం పోలీసులు రూ. 7.30 కోట్ల విలువైన గంజాయి స్వాధీనం చేసుకోవడంతో మత్తుమందుల వ్యవహారం మరోమారు తెరపైకి వచ్చింది. సమాచారం దొరగ్గానే అధికారులు ఈ ముఠాలను పట్టుకుంటున్నా ఇంకా తమ కళ్లుగప్పి పెద్దమొత్తంలో మాదకద్రవ్యాలు సరఫరా అవుతున్నాయని వారు అనుమానిస్తున్నారు. అన్నింటికీ మించి గతంలో ఎన్నడూలేనంతా హెరాయిన్‌ హైదరాబాద్‌కు సరఫరా అవుతుండడం అధికారులనూ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. దీన్ని స్థానిక వినియోగం కంటే ఇతర దేశాలకు మళ్లించే ఉద్దేశంతోనే ఇక్కడకు రప్పిస్తున్నట్లు అంచనా వేస్తున్నారు.

మహారాష్ట్ర ముఠాలే ఎక్కువ

రూ.వెయ్యి పెట్టుబడి పెడితే రూ.పది వేల ఆదాయం వస్తుండటంతో రవాణా ముఠాలు ఎన్ని ఇబ్బందులు ఎదురవుతున్నా గంజాయి వ్యాపారం నిరాటంకంగా సాగిస్తున్నాయి. ముఖ్యంగా గంజాయికి ఎక్కువగా డిమాండు ఉన్న మహారాష్ట్రకు చెందిన ముఠాలు ఈ వ్యాపారంలో ఆరితేరాయి. కాలేగ్యాంగ్‌, పవార్‌ గ్యాంగ్‌లుగా పిలుచుకునే ఈ ముఠాలు ఆంధ్ర ఒడిశా సరిహద్దుల్లో (ఏఓబీ) పండే గంజాయిని పెద్దమొత్తంలో రవాణా చేస్తున్నాయి. దేశంలో ఏ మూల గంజాయి పట్టుబడినా దాని మూలాలు ఏఓబీలో బయటపడుతుండగా హైదరాబాద్‌ రవాణా కేంద్రంగా మారింది. ఏఓబీలో ఏటా సుమారు రూ. 15 వేల కోట్ల విలువైన గంజాయి సాగవుతోందని, దేశంలోని సగం రాష్ట్రాలకు ఇక్కడి నుంచే సరఫరా అవుతోందని ఎన్‌సీబీ, ఎక్సైజ్‌, పోలీస్‌ వర్గాలు భావిస్తున్నాయి. సిక్కిం, నాగాలాండ్‌ల్లో గంజాయి వినియోగం ఎక్కువగా ఉంటుంది. ఏఓబీలో దొరికే గంజాయే అక్కడకు సరఫరా అవుతుండటం గమనార్హం. దీని సాగులో ఏఓబీ, తరలింపులో హైదరాబాద్‌ కీలక ప్రాంతాలుగా మారాయి. మహారాష్ట్రలోని ముఠాలు వారసత్వంగా ఈ వ్యాపారాన్ని కొనసాగిస్తున్నాయి. సాగులోనూ పెట్టుబడులు పెడుతూ పండిన గంజాయిని అవే కొంటున్నాయి. ఏఓబీలో కిలో రూ.వెయ్యి నుంచి రూ. 1200 చొప్పున కొంటున్నాయి. దీన్ని 100 గ్రాముల పొట్లంగా మార్చి రూ.వెయ్యి చొప్పున విక్రయిస్తున్నారు. అంటే లాభం పదింతలు ఉంటుంది. ఇందులో రవాణా ఖర్చులు, ఇతరత్రా మామూళ్లు రూ. 3,000 వరకూ పోయినా ఇంకా ఆరువేలు మిగులుతాయి. ఈ లెక్కన రూ.లక్ష పెట్టుబడి పెడితే రూ.ఆరు లక్షల లాభం వస్తుంది. మహారాష్ట్ర ముఠాలు టన్నులకొద్దీ గంజాయిని తరలిస్తుంటాయి. వారి ఆదాయం రూ.కోట్లలో ఉంటుందని అంచనా. రూ.కిలో పట్టుబడితే రూ.వెయ్యి నష్టపోతారు. కిలో రవాణా చేయగలిగితే కనీసం రూ.ఆరు వేల లాభం పొందగలుగుతారు. అందుకే పట్టుబడుతున్నప్పటికీ ఈ వ్యాపారం ఆపడంలేదు, రవాణా మానుకోవడంలేదు.

నెలరోజుల్లో రూ. 121 కోట్ల హెరాయిన్‌

హెరాయిన్‌ సరఫరాకూ హైదరాబాద్‌ కీలకంగా మారింది. హైదరాబాద్‌ విమానాశ్రయంలో నెల రోజుల్లో రూ. 121 కోట్ల విలువైన హెరాయిన్‌ పట్టుబడింది. ఇది కాకుండా బెంగళూరు, చెన్నై విమానాశ్రయాల్లో గత మే నెలలో రూ. 150 కోట్ల విలువైన 25 కిలోల హెరాయిన్‌ని స్వాధీనం చేసుకున్నారు. జులై మొదటి వారంలో ముంబయి పోర్టులో రూ. 1800 కోట్ల విలువైన 300 కిలోల హెరాయిన్‌ను పట్టుకున్నారు. ఇదంతా ఒకే దగ్గర తయారైందని గుర్తించారు. అఫ్గానిస్థాన్‌ నుంచి ఓ భారీ కంటైనర్‌ ద్వారా దక్షిణాఫ్రికాకు చేర్చారని, అక్కడి నుంచి అదను చూసుకొని ఇతర దేశాలకు ఎగుమతి చేస్తున్నారని వెల్లడైంది. మన దేశంలో హెరాయిన్‌ వాడకం ఈ స్థాయిలో లేదు. ఇక్కడి నుంచి తమిళనాడు మీదుగా సముద్రమార్గంలో శ్రీలంకకు, అక్కడి నుంచి తూర్పు ఆసియా దేశాలతోపాటు ఆస్ట్రేలియాకు పంపే ఉద్దేశంతోనే అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యాపారులు ప్రధానంగా దక్షిణాది రాష్ట్రాలపై దృష్టి సారించినట్లు, దీనిలో భాగంగానే హైదరాబాద్‌కు కూడా హెరాయిన్‌ సరఫరా చేస్తున్నట్లు భావిస్తున్నారు.

ఇక్కడా కొంత వినియోగం

ఏఓబీలో పండే గంజాయి హైదరాబాద్‌ మీదుగానే మహారాష్ట్ర చేరాలి. ఆ క్రమంలోనే ఇక్కడ తరచూ పట్టుబడుతోంది. దర్యాప్తు సంస్థల కళ్లుగప్పేందుకు రకరకాల పద్ధతుల్లో రవాణా చేస్తున్నారు. ఒకప్పుడు నారాయణఖేడ్‌ ప్రాంతం గంజాయి వ్యాపారానికి ఆలవాలంగా ఉండేది. ఇప్పుడు అక్కడ సాగు నిలిచిపోయింది. అప్పట్లో అక్కడ ఈ వ్యాపారం చేసిన వారు ఇప్పుడు మహారాష్ట్ర ముఠాలతో చేతులు కలిపి హైదరాబాద్‌ మీదుగా సరఫరా మొదలుపెట్టినట్లు అనుమానిస్తున్నారు. మహారాష్ట్రకు సరఫరా అవుతున్న గంజాయిలో 30 శాతం వరకూ హైదరాబాద్‌లో దింపుతున్నట్లు తెలుస్తోంది. మిగతాది చాలావరకూ పుణె, ముంబయిలో అమ్ముతుండగా మళ్లీ అక్కడి నుంచి ఈశాన్య రాష్ట్రాలకూ ఎగుమతి చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు.

జోధ్‌పూర్‌.. జలోర్‌ నుంచి నల్లమందు..

ఖరీదైన కొకైన్‌.. బ్రౌన్‌షుగర్‌కు దీటుగా తక్కువ ధరకే మాదకద్రవ్యాలంటూ కొందరు నేరస్థులు నల్లమందు (ఓపీఎం)ను విక్రయిస్తున్నారు. చిన్నచిన్న పొట్లాలుగా హైదరాబాద్‌, శివారు ప్రాంతాల్లో గుట్టుగా అమ్మేస్తున్నారు. పార్టీలకు సరఫరా చేస్తామంటూ ఫోన్లు చేసి మరీ ఇస్తున్నారు. రాజస్థాన్‌ కేంద్రంగా నల్లమందు రవాణా అవుతోందని పోలీసులు గుర్తించారు. ఇటీవల 14.5 కిలోల సరకు స్వాధీనం చేసుకున్న పోలీసులు అక్రమార్కులపై నిఘా ఉంచగా కరోనా రెండోదశ మొదలవడంతో రవాణా ఆగిపోయినట్లు తేలింది. మళ్లీ రెండునెలల నుంచి ఓపీఎం గుట్టుగా తీసుకొచ్చి ఇక్కడ విక్రయిస్తున్నారు. కొద్దిరోజుల క్రితం శివారు ప్రాంతంలో నల్లమందును తీసుకువస్తున్న వ్యక్తి కొద్దిలో పోలీసుల నుంచి తప్పించుకున్నాడు.

రాజస్థానీలకు ప్రలోభాలు..

రాజస్థాన్‌ కేంద్రంగా నల్లమందు రాకెట్‌ నిర్వహిస్తున్న నేరస్థులు.. ఇక్కడ చిరుద్యోగాలు చేస్తున్న రాజస్థాన్‌వాసులను ప్రలోభపెడుతున్నారు. ఫలానా వ్యక్తి నల్లమందు తెస్తున్నాడు.. ఆశ్రయమివ్వు నీకు డబ్బులిస్తామంటూ చెబుతున్నారు. మార్కెట్‌ మేం చూపిస్తాం.. ఇష్టమైతే నువ్వే అమ్ముకో అంటూ ప్రలోభపెడుతున్నారు. ఆస్తకి ప్రదర్శించిన వారికి 2, 3 కిలోల నల్లమందుతో ఒక వ్యక్తిని పంపుతున్నారు. అతడు హైదరాబాద్‌కు వచ్చాక పబ్బులు, బార్లు, హోటళ్ల వద్ద యువకులు, సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లతో మాట్లాడి గుట్టుగా వారికి విక్రయిస్తున్నారు. నెలకు 4 కిలోలు విక్రయిస్తే రూ. 2 లక్షలు లాభం వస్తుందని ప్రలోభపెడుతున్నారు. లాభాలకు ప్రభావితులైన వారు రాజస్థాన్‌కు వెళ్లి సొంతంగా తెచ్చుకుంటున్నారు. దీనిని నిఘావర్గాల ద్వారా తెలుసుకున్న హైదరాబాద్‌ పోలీసులు నగరం, శివారు ప్రాంతాలపై దృష్టి కేంద్రీకరించారు. రైళ్ల రాకపోకలు, అంతరరాష్ట్ర లారీల సరకు రవాణా ఊపందుకోవడంతో నల్లమందు రాక పెరిగినట్లు తెలుస్తోంది. దీనిని అరికట్టేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయనున్నారు.

ఇదీ చూడండి:

38 చోరీలకు పాల్పడిన అంతర్రాష్ట ముఠా అరెస్ట్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.