ETV Bharat / crime

గుట్టురట్టు: పైకి రేకుల షెడ్డు.. తయారయ్యేది మత్తుమందులు..

author img

By

Published : Dec 27, 2022, 6:57 AM IST

మత్తు దందాపై పోలీసులు ఎన్ని ఆంక్షలు పెట్టినా.. ప్రభుత్వాలు ఆంక్షలు కఠినతరం చేసినా కట్టడి మాత్రం జరగడం లేదు. నిత్యం ఏదో ఒక చోట ఇలాంటి ఘటనలు పునరావృతమవుతూనే ఉన్నాయి. తాజాగా హైదరాబాద్‌ డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ అధికారులు హైదరాబాద్‌లో సుమారు రూ.50 కోట్ల విలువైన మెఫిడ్రిన్‌తో పాటు వీటిని తయారు చేస్తున్న రెండు ప్రయోగశాలలను స్వాధీనం చేసుకున్నారు.

DRI Huge Quantity Drugs Seized
DRI Huge Quantity Drugs Seized

హైదరాబాద్‌ డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ అధికారులు హైదరాబాద్‌లో మరోమారు మత్తుమందుల గుట్టురట్టు చేశారు. సుమారుగా రూ.50 కోట్ల విలువైన మెఫిడ్రిన్‌తో పాటు వీటిని తయారు చేస్తున్న రెండు ప్రయోగశాలలను స్వాధీనం చేసుకున్నారు. ఈ వ్యవహారం వెనకున్న సూత్రధారుడిని ఉత్తర్‌ప్రదేశ్‌లోని గోరఖ్‌పుర్‌లో అరెస్టు చేశారు. నిందితుడు రూ.60 లక్షల నగదుతో, ఖరీదైన కారులో నేపాల్‌ పారిపోతుండగా అదుపులోకి తీసుకున్నామని డీఆర్ఐ అధికారులు వెల్లడించారు.

ఈ నెల 21న బోడుప్పల్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధి చెంగిచెర్లలోని ఓ కర్మాగారంలో ఆకస్మికంగా సోదాలు జరిపిన అధికారులు.. రేకుల షెడ్డులో నిర్మించిన రెండు ప్రయోగశాలల్లో మత్తుమందు తయారు చేస్తున్నట్లు గుర్తించారు. అత్యాధునిక పద్ధతిలో అప్పటికప్పుడు అమర్చుకోగలిగే పరికరాలను దిగుమతి చేసుకుని, వాటన్నింటినీ అమర్చి కేవలం రెండు రోజుల వ్యవధిలోనే ప్రయోగశాలలను సిద్ధం చేసినట్టు తెలుసుకున్నారు.

అవసరమైన ముడి పదార్థాలను ఇతర ప్రాంతాల నుంచి తీసుకొచ్చి మెఫిడ్రిన్‌ తయారు చేయడంతో పాటు, దాన్ని ఇతర రాష్ట్రాలు, దేశాలకు ఎగుమతి చేస్తున్నట్టు నిర్ధారణకు వచ్చారు. ఎగుమతికి సిద్ధంగా ఉన్న 24 కిలోలకు పైగా మెఫిడ్రిన్‌ను, రూ.18 లక్షల లావాదేవీలకు సంబంధించిన పత్రాలను స్వాధీనపరుచుకున్నారు. సదరు ఆధారాల ప్రకారం ఉత్తర్‌ప్రదేశ్‌లోని డీఆర్‌ఐ అధికారులను అప్రమత్తం చేసి, కీలక నిందితుడిని అరెస్టు చేశారు.

మత్తుమందుల తయారీకి అతనే ఆర్థిక సాయం చేస్తున్నట్లు దర్యాప్తులో తేల్చారు. నిందితులను అరెస్టు చేశామని వారిలో కొందరికి 2016 ఇందౌర్‌లోని 236 కిలోల ఎఫిడ్రిన్‌ పట్టుబడ్డ కేసుతో, హరియాణాలో దొరికిన 667 కిలోల మెఫిడ్రిన్‌ కేసులతో సంబంధం ఉందని దర్యాప్తులో తేలింది. మరో వ్యక్తికి హత్య కేసుతో సంబంధం ఉందని వెల్లడైంది. అరెస్టు చేసిన ఏడుగురిని చర్లపల్లి జైలుకు తరలించారు.

ఈ ఏడాదిలో ఇప్పటి వరకూ దేశవ్యాప్తంగా 990 కిలోల హెరాయిన్, 88 కిలోల కొకైన్, 10 వేల కిలోల మెథాంఫిటమిన్‌ మాత్రలు, 2,400 లీటర్ల పెన్సిడిల్‌ వంటి దగ్గు మందుతో పాటు ఇంకా పెద్దమొత్తంలో హానికరమైన మత్తుమందులు స్వాధీనం చేసుకున్నట్లు డీఆర్ఐ అధికారులు వెల్లడించారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.