ETV Bharat / crime

Cyber Crime: రూ.500లకే కంచిపట్టు చీర.. అయితే జాగ్రత్త పడాల్సిందే..?

author img

By

Published : Feb 14, 2023, 11:44 AM IST

Cyber Crime
Cyber Crime

Cyber Crime in hyderabad: సైబర్‌ మాయగాళ్లు రెచ్చిపోతున్నారు. సామాజిక మాధ్యమాలు, నకిలీ వెబ్‌సైట్లు, కాల్‌సెంటర్లు, క్యూఆర్‌కోడ్స్‌.. అన్ని మార్గాల్లో మోసాలకు తెగబడుతున్నారు. ఇప్పుడు తాజాగా తక్కువ ధరకే వస్తువులంటూ ఆశ చూపించి వాటిని ఆర్డర్​ చేశాక పాడైన వస్తువులు పంపి డబ్బు ఇచ్చేస్తామని వివరాల సేకరించి, బ్యాంకు ఖాతాల్లో చొరబడి సొమ్ము దోపిడీ చేస్తున్నారు.

Cyber Crime in hyderabad: ఎల్బీ నగర్‌ ప్రాంతానికి చెందిన ఓ యువతిని సామాజిక మాధ్యమాల్లో వచ్చిన ప్రకటన ఆకర్షించింది. ప్రముఖ సంస్థకు చెందిన చీర రూ.వెయ్యికే అందిస్తున్నామన్నది దాని సారాంశం. వస్తువు అందాకే డబ్బు చెల్లించే (సీవోడీ) వెసులుబాటు ఉండడంతో ఆమె చీర కొనుగోలుకు ఆర్డర్‌ ఇచ్చింది. మూడు రోజుల తర్వాత పార్సిల్‌లో చీర వచ్చింది. డబ్బు చెల్లించి పార్సిల్‌ తెరిచి చూస్తే చీర అక్కడక్కడా చిరిగిపోయి ఉంది.

ఏదైనా సమస్య ఉంటే ఫలానా కాల్‌సెంటర్‌కు ఫోన్‌ చేయమని బిల్లులో ఉంది. చీర బాగోలేదని చెప్పేందుకు విద్యార్థిని ఆ నంబరుకు ఫోన్‌ చేసింది. లైన్లోకి వచ్చిన కాల్‌సెంటర్‌ ఉద్యోగులు ఓ లింకు పంపారు. దాన్ని తెరిచి, బ్యాంకు ఖాతా వివరాలు నమోదు చేస్తే వెంటనే డబ్బు జమ చేస్తామన్నారు. ఆమె వాళ్లు చెప్పినట్లే చేసేసరికి ఓ పాస్‌వర్డ్‌ వచ్చింది. దాన్ని కూడా నింపింది. కొద్దిసేపటి తర్వాత డబ్బు పడిందో, లేదో తెలుసుకునేందుకు ఆన్‌లైన్‌ బ్యాంకింగ్‌ ద్వారా పరిశీలించి విస్తుపోయింది. ఖాతాలో ఉన్న సొమ్మంతా పోవడంతో ఆమె పోలీస్‌స్టేషన్‌కు పరుగులు పెట్టింది.

లింకు నొక్కితే అంతే..

తక్కువ ధరలకే వస్తువులిస్తామని సామాజిక మాధ్యమాల్లో వచ్చే ప్రకటనలకు ఇలాగే చాలామంది బోల్తా పడి ఆర్డర్‌ ఇస్తున్నారు. సైబర్‌ దొంగలు ఉద్దేశపూర్వకంగానే పాడైన వస్తువులను పంపుతున్నారు. వాటి కోసం ఫోన్‌ చేస్తే.. లింకులు పంపి బాధితుల ఫోన్లను తమ అధీనంలోకి తీసుకుంటున్నారు. తర్వాత వారి బ్యాంకు ఖాతాల్లోకి చొరబడి, ఫోన్‌ నంబర్లను మార్చేసి తమ ఫోన్‌ నంబర్లు పెట్టుకుంటున్నారు.

ఖాతాల్లోని డబ్బంతా కొల్లగొడుతున్నారు. నంబరు మారిపోతుంది కనుక.. వినియోగదారు ఫోన్‌కు బ్యాంకు నుంచి ఓటీపీ కానీ, డబ్బు తీసినట్లు మెసేజ్‌ కానీ రావు. పైగా ఫోన్లో ఉన్న సమస్త సమాచారం సైబర్‌ దొంగలకు చేరిపోతుంది. ముఖ్యంగా వ్యక్తిగత ఫొటోలు, వీడియోల వంటి వాటితో వారు భవిష్యత్తులో బెదిరించే అవకాశం ఉంది.

చిన్న పొరపాటు.. పెద్ద నష్టం

సామాజిక మాధ్యమాల్లో బోగస్‌ సంస్థల ప్రకటనలు చూసి ఆశపడితే భారీగా నష్టపోవాల్సి వస్తుంది. ఫోన్‌ నంబరుతో లింక్‌ అయి ఉన్న అన్ని బ్యాంకు ఖాతాల వివరాలూ నేరగాళ్లకు తెలిసిపోయే ప్రమాదం ఉంది. ప్రముఖ ఈ-కామర్స్‌ సైట్ల ద్వారానే కొనుగోళ్లు జరపాలి. డబ్బు తిరిగి చెల్లించాలంటే ప్రముఖ సైట్లు ఏవీ లింకులు పంపవు.

అలా ఎవరైనా లింకు పంపి తెరవాలని చెప్పినా, ఓటీపీ నంబరు చెప్పాలన్నా అనుమానించాల్సిందే. పొరపాటున లింకు తెరిచినా, ఓటీపీ చెప్పినా ఫోన్‌లో సమాచారం అంతా చౌర్యం అయినట్లే. అలాంటి పరిస్థితి ఎదురైతే వెంటనే ఫోన్‌ను ఫార్మాట్‌ చేయాలి. బ్యాంకులకు వెళ్లి లావాదేవీలు ఆపించాలి. నెట్‌/మొబైల్‌ బ్యాంకింగ్‌ వంటి వాటికి అంతకుముందు పెట్టుకున్న పాస్‌వర్డ్‌లు మార్చుకోవాలి.

- ప్రసాద్‌ పాటిబండ్ల, డైరెక్టర్‌ సెంటర్‌ ఫర్‌ రీసెర్చ్‌ ఆన్‌ సైబర్‌ ఇంటెలిజెన్స్‌ అండ్‌ డిజిటల్‌ ఫోరెన్సిక్‌

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.