ETV Bharat / crime

బంగారం దొరికిందని.. కోటిన్నర నొక్కేశారు

author img

By

Published : May 25, 2021, 3:13 PM IST

cheating, cheating in gold name
బంగారం పేరుతో మోసం, ఏపీలో బంగారం పేరుతో చీటింగ్

నమ్మిన వారినే మోసం చేయడం తేలిక అని గ్రహించిన ఆ దంపతులు.. పలువురిని మోసం చేసేందుకు సిద్ధపడ్డారు. 32 కుటుంబాల నుంచి డబ్బులు, బంగారం వసూలు చేసి.. వారికి నకిలీ బంగారం, డబ్బులు ఇచ్చి మోసం చేశారు. తాము మోసంపోయామని తెలుసుకున్న బాధితులు న్యాయం చేయాలంటూ పోలీసులను ఆశ్రయించారు. అసలు ఇంతకీ ఏం జరిగింది..?

ఏపీలోని అనంతపురం జిల్లా వజ్రకరూరు మండలం పెద్దహోతూరులో బంగారం పేరిట బురిడీ కొట్టించిన దంపతులపై వార్తలు రావటంతో.. కర్నూలు జిల్లా నుంచి బాధితులు బయటకు వస్తున్నారు. మోసపోయిన తమకు న్యాయం చేయాలని గుంతకల్లు రెండో పట్టణ పోలీస్‌స్టేషన్‌కు చేరుకుని తమ గోడు వెళ్లబోసుకున్నారు. కనిష్ఠంగా 2 లక్షల నుంచి మొదలుకుని 32 కుటుంబాల వద్ద రూ.కోటిన్నర దాకా వసూలు చేసినట్టు పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్టు సీఐ గోవింద్ తెలిపారు.

దొరికిన బంగారాన్ని.. మామూలు బంగారంగా మార్చాలంటూ కట్టుకథ..

గుంతకల్లు నియోజకవర్గంలోని వజ్రకరూరు మండలం గడేహోతూరు గ్రామ సర్పంచ్ సురేంద్ర, అతని భార్య పార్వతి తమకు రెండు పెద్ద పాత్రల్లో బంగారం దొరికిందని.. తన కుమారుడి పేరుపై 11 కేజీల బంగారాన్ని దానం చేయాలంటూ ఓ కట్టుకథ అల్లారు. ఈ దొరికిన బంగారాన్ని మామూలు బంగారంగా మార్చేందుకు డబ్బు ఖర్చవుతుందని కుటుంబ సభ్యులకు, తెలిసిన వ్యక్తులతో నమ్మబలికారు. ఇలా దాదాపు 32 కుటుంబాల నుంచి కోట్లు రూపాయలు వసూలు చేశారు.

ప్రసాదంలో మత్తు మందు కలిపి..

ఒక రోజు కర్నూలు నుంచి బంగారం, డబ్బులు తీసుకువస్తున్నామని.. 15 మందిని ఒక ఇంట్లో సమావేశపరిచి మత్తు మందు కలిపిన ప్రసాదాన్ని ఇచ్చారు. వారు నిద్రలోకి జారుకోగానే నకిలీ బంగారం, దొంగ నోట్ల కట్టలను అక్కడ ఉంచి ఉడాయించారు. మెలకువ వచ్చి నకిలీ బంగారం, డబ్బును గమనించిన బాధితులు నివ్వెరపోయారు. దీనిపై దంపతులను ప్రశ్నించగా.. తాము అంతా సక్రమంగానే ఇచ్చామని, తమదేమీ తప్పులేదని తప్పించుకునే ప్రయత్నం చేశారు. పైగా బాధితులను బెదిరించటంతో.. వారు పోలీసులను ఆశ్రయించారు.

ఎస్పీను కలిసిన బాధితులు..

పోలీసులు సరిగా స్పందించకపోవడంతో జిల్లా ఎస్పీ సత్యయేసుబాబును కలిశారు. తమ ఆస్తులు తాకట్టుపెట్టి డబ్బు ఇచ్చామని.. తమకు న్యాయం చేయాలని కోరారు. ఈ కేసులో మెుత్తం నలుగురు వ్యక్తులు ఉన్నట్లు తెలిపిన బాధితులు.. వారిని అరెస్ట్​ చేసి డబ్బు తిరిగి ఇప్పించాలని విజ్ఞప్తి చేశారు. స్పందించిన జిల్లా ఎస్పీ సత్య ఏసుబాబు గుంతకల్లులోని రెండో పట్టణ పోలీసులకు కేసును అప్పగించారు.

32 కుటుంబాల వద్ద కోటిన్నర రూపాయలు మాయం
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.