BABY DEATH: నాలుగో అంతస్తు నుంచి జారి పడి చిన్నారి మృతి

author img

By

Published : Aug 20, 2021, 7:35 AM IST

child-died-after-slipping-from-the-fourth-floor-at-mancherial

ఎప్పుడూ లేనిది ఉదయాన్నే నిద్రలేచిందా చిన్నారి. అమ్మ పనులు చేసుకుంటుంటే.. నాన్న లోపలే పడుకున్నాడు. ఏం చేయాలో తెలియక ఆడుకునేందుకు బయటకొచ్చింది. ఏం జరిగిందో తెలీదుకాని కాసేపటికే ఆ పాప భవనంపైనుంచి కిందకిపడిపోయింది. అక్కడికక్కడే చనిపోయింది.

ఆ చిన్నారి వేసే బుడిబుడి అడుగులే అమ్మానాన్నలకు గుండెచప్పుళ్లు. ఆ పాపే వారికి ప్రాణం. ఉదయం నిద్ర లేచింది మొదలు రాత్రి పడుకొనేవరకు ఆ పాప చేసే సందడి అంతా ఇంతా కాదు. ఉదయం నిద్రలేవగానే ఆటల్లో మునిగిపోతుంది. గురువారమూ అంతే. ఆటాడుకుంటోందిలే అని తల్లి ఇంటి పనులు చేసుకుంటోంది. అలా అలా ఆడుతూ భవనంపై నుంచి జారిపడిందా పాప. అంతే.. ఆ తల్లిదండ్రుల గుండె బద్దలైంది. ఆసుపత్రికి తరలించేలోపే చిన్నారి ప్రాణాలు అనంతవాయువుల్లో కలిసిపోయాయి. ఈ హృదయవిదారక సంఘటన గురువారం ఉదయం 6.30 గంటలకు మంచిర్యాల జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది.

6 గుంటలకే నిద్రలేచిన పాప...

మంచిర్యాల ఏసీసీలోని ఎస్సార్‌ రెసిడెన్సీలో నాలుగో అంతస్తులో కొండబత్తుల ప్రవీణ్‌కుమార్‌-వాణి దంపతులు నివాసముంటున్నారు. వారికి రెండేళ్ల కూతురు సాన్విక. రోజూ ఉదయం 8 గంటలకు నిద్రలేచే పాప గురువారం 6 గంటలకే నిద్రలేచింది. తండ్రి నిద్రిస్తుండగా.. తల్లి ఇంటి పనుల్లో నిమగ్నమైంది. అపార్ట్‌మెంట్‌ బాల్కనీలో మొక్కలున్న ప్రాంతంలో ఆడుకుంటోంది. ఏం జరిగిందో ఏమో.. ఆ మొక్కలున్న ప్రాంతంలోని ఎలివేషన్‌ (రెయిలింగ్‌)లో ఉన్న ఖాళీ ప్రాంతం నుంచి కిందకు జారి పడింది.

రెయిలింగ్​లో చిక్కుకుని...

తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించేలోపే అసువులు బాసింది. ప్రమాదవశాత్తు రెయిలింగ్‌లో చిక్కుకొని జారి కిందపడినట్లు కుటుంబసభ్యులు, పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రమాద సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో అసలేం జరిగిందో పోలీసులు సరైన నిర్ధారణకు రావట్లేదు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్‌ఐ శ్రీనివాస్‌ తెలిపారు.

ఇదీ చూడండి: KishanReddy: తొలిరోజు విజయవంతంగా కిషన్​రెడ్డి యాత్ర.. రెంట్టిపు ఉత్సాహంతో రెండో రోజు..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.