ETV Bharat / crime

వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసు.. డ్రైవర్ దస్తగిరిని విచారిస్తున్న సీబీఐ

author img

By

Published : Sep 22, 2022, 5:20 PM IST

Updated : Sep 22, 2022, 5:51 PM IST

YS Vivekananda
YS Vivekananda

YS Vivekananda Reddy murder case: వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ కొనసాగుతోంది. ఇవాళ పులివెందులలో డ్రైవర్ దస్తగిరి, అతని భార్య షబానాను సీబీఐ అధికారులు ప్రశ్నిస్తున్నారు. వివేకా హత్య కేసులో ఇప్పటికే అప్రూవర్‌గా మారిన డ్రైవర్‌ దస్తగిరి... గతంలో సీబీఐ, మెజిస్ట్రేట్ ముందు కీలక సమాచారం వెల్లడించారు.

YS Vivekananda Reddy murder case: ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ కొనసాగుతోంది. సీబీఐకి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో మూడు రోజుల నుంచి విచారణ ముమ్మరం చేసింది. ఇవాళ పులివెందుల ఆర్​అండ్​బీ అతిథి గృహంలో అప్రూవర్​గా మారిన డ్రైవర్ దస్తగిరి, ఆయన భార్య షబానాను విచారణకు పిలిచారు. ఇద్దరిని కూడా ఉదయం నుంచి ప్రశ్నిస్తున్నారు.

గత ఆరు నెలల నుంచి సీబీఐ అధికారులు కడప జిల్లాలో ఎలాంటి విచారణ చేపట్టలేదు. ఈ మధ్యకాలంలో అప్రూవర్​గా ఉన్న దస్తగిరికి పులివెందుల నియోజకవర్గంలోని వైకాపా నాయకుల నుంచి తీవ్రమైన బెదిరింపులు వస్తున్న నేపథ్యంలో అతడు సీబీఐ విచారణకు హాజరు కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఎవరెవరు బెదిరించారనే దానిపై అన్ని విషయాలు సీబీఐకి వెల్లడించినట్లు తెలుస్తోంది. ప్రధానంగా తొండూరు మండలంలోని వైకాపా నాయకులు తన లక్ష్యంగా చేసుకొని బెదిరించారని దస్తగిరి సీబీఐకి చెప్పినట్లు సమాచారం.

YS VIVEKA CASE UPDATE : వైఎస్ వివేకా హత్య కేసు విచారణ ఏపీ నుంచి బదిలీ చేయాలంటూ ఆయన కుమార్తె సునీతారెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై ఈనెల 19న విచారణ జరిపిన సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి, సీబీఐకి నోటీసులు జారీ చేసింది. హత్య కేసు విచారణ ముందుకు సాగకుండా అడ్డంకులు సృష్టిస్టున్నారని.. సాక్షులను బెదిరిస్తున్నారని సునీత తరపు సీనియర్‌ న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకువచ్చారు.

విచారణలో ఎలాంటి పురోగతి లేదని, దర్యాప్తు సంస్థ అధికారులపై ప్రైవేటు ఫిర్యాదులు చేయడంతోపాటు.. క్రిమినల్‌ కేసులు పెట్టి విచారణకు ఆటంకం కల్పిస్తున్నారని వివరించారు. కావున విచారణ తెలంగాణ లేదా దిల్లీ సహా దేశంలో మరేదైనా హైకోర్టు పరిధిలో దర్యాప్తు చేపట్టేందుకు ఆదేశాలు ఇవ్వాలని సునీతారెడ్డి విజ్ఞప్తి చేశారు.

సాక్షులను బెదిరిస్తున్నట్లు ఆధారాలు లేవని శివశంకర్‌ రెడ్డి తరపు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. సుమారు 140 మంది వరకు సాక్షులు ఉన్నారని.. వారందరిని అంత దూరం ఎలా పిలుస్తారని అనగా.. ఆ విషయం ఏదో సీబీఐనే చెప్పనీయండి అని ధర్మాసనం అభిప్రాయపడింది. సునీత పిటిషన్‌లో లేవనెత్తిన అంశాలపై సమాధానం చెప్పాలని రాష్ట్ర ప్రభుత్వానికి, సీబీఐకి నోటీసులు ఇచ్చిన ధర్మాసనం.. తదుపరి విచారణ అక్టోబర్‌ 14కు వాయిదా వేసింది.

సుప్రీంకోర్టుకు శివశంకర్​రెడ్డి: వైఎస్ వివేకా హత్య కేసులో నిందితుడిగా ఉన్న దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు బెయిల్ నిరాకరించడంతో సుప్రీంలో పిటిషన్ వేశారు. సీబీఐ, వైఎస్ సునీతను ప్రతివాదులుగా చేర్చారు. శివశంకర్‌రెడ్డి తరఫున అభిషేక్ మను సింఘ్వీ వాదనలు వినిపించనున్నారు.

ఇవీ చూడండి:

Last Updated :Sep 22, 2022, 5:51 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.