CHEATING: పెళ్లికొడుకు నచ్చలేదని... నగలు, నగదుతో ఉడాయించేసింది!

author img

By

Published : Sep 19, 2021, 8:06 AM IST

CHEATING

ఎవరినైనా ప్రేమిస్తే కొందరు ఇంట్లో వాళ్లను ఒప్పిస్తారు. వాళ్లు ఒప్పుకోకుంటే అప్పుడే ప్రేమించినవాళ్లతో వెళ్లిపోతారు. లేకుంటే తల్లిదండ్రులను బాధపెట్టడం ఇష్టం లేక వాళ్లు చూసిన వారినే పెళ్లి చేసుకుంటారు. ఓ అమ్మాయి కూడా పేరెంట్స్​ చూసిన సంబంధాన్నే చేసుకుంది. కానీ... పెళ్లి జరిగి గంట కూడ కాకుండానే ప్రియుడితో వెళ్లిపోయింది.

వివాహమై గంట కూడా గడవలేదు.. అంతలోనే వరుడు నచ్చలేదని తన ప్రియుడితో వెళ్లిపోతున్నానని నవవధువు అందరికీ షాక్‌ ఇచ్చింది. మగ పెళ్లివారు ఇచ్చిన రూ.50వేల నగదు, రూ.1.80 లక్షల విలువైన బంగారు ఆభరణాలతో ఉడాయించింది. బాలాపూర్‌ ఠాణా పరిధిలో జరిగిన ఈ ఉదంతం శనివారం వెలుగు చూసింది.

బెంగళూరుకు చెందిన ఓ వ్యాపారి (30)కి ఫలక్‌నుమా ప్రాంతంలో ఉండే యువతి(20)కి ఈనెల 16న పెళ్లి జరగాల్సి ఉంది. పెళ్లికుమారుడి కుటుంబం అదేరోజు రావడంతో శుభకార్యం మర్నాటికి వాయిదా వేశారు. 17వ తేదీ సాయంత్రం బాలాపూర్‌ పరిధిలో పెళ్లికూతురి బంధువుల నివాసంలో వివాహం జరిపారు. వివాహానంతరం బెంగళూరు బయలుదేరేందుకు సిద్ధమైన పెళ్లికుమారుడితో నవ వధువుకు మొహర్‌ రూ.50 వేలు ఇక్కడే ఇప్పించాలని, ఆమెకు ఇవ్వాల్సిన నగలన్నీ ఇక్కడే ధరింపచేయాలని మౌల్వీ పట్టుబట్టాడు. ఈ క్రమంలో వరుడు నగదును వధువుకు అందించగా, వరుడి తల్లి నగలన్నీ ఆమెకు అలంకరించింది.

అబ్బాయి నచ్చలేదు..

అనంతరం తాను బ్యూటీపార్లర్‌కు వెళ్లాల్సి ఉందని వధువు పట్టుబట్టింది. అత్త, భర్త అందుకు అభ్యంతరం వ్యక్తం చేయగా తన అన్నలు, వదినలతో కలిసి బ్యూటీపార్లర్‌కు వెళ్లింది. అక్కడికెళ్లగానే ఆమె అదృశ్యమైందని తోడుగా వెళ్లినవారు వరుడికి ఫోన్‌ చేసి తెలిపారు. గంట సమయం గడిచిన తర్వాత వధువు తన అమ్మమ్మకు ఫోన్‌ చేసి తనకు భర్త నచ్చలేదని.. ప్రియుడితో వెళ్లిపోతున్నానని చెప్పి స్విచ్‌ ఆఫ్‌ చేసింది. దీంతో ఇరువర్గాల మధ్య వివాదం ముదరడంతో విషయం పోలీసుల వరకు చేరింది. తాము ఫిర్యాదు చేయదలచుకోలేదని, తమ నగలు, డబ్బు తిరిగి ఇస్తే వెళ్లిపోతామని వరుడు చెప్పారు. పథకం ప్రకారమే పెళ్లి చేసి.. వధువును ప్రియుడితో పంపేశారని వరుడు ఆరోపించారు. శుక్రవారం రాత్రినుంచి వాట్సప్‌ గ్రూపుల్లో ఈ అంశం హల్‌చల్‌ చేసింది. ఈ అంశంపై తమకు ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు.

ఇదీ చూడండి: Tollywood Drugs case: పూరి, తరుణ్​లు​ మాదకద్రవ్యాలు తీసుకోలేదని ఫోరెన్సిక్ నివేదికలో వెల్లడి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.