జీహెచ్​ఎంసీలో కాంట్రాక్టుల పేరుతో గాలం.. జేసీబీ, ట్రాక్టర్ల ఓనర్లే బాధితులు

author img

By

Published : Nov 21, 2021, 12:44 PM IST

Updated : Nov 21, 2021, 5:08 PM IST

cheating by ghmc contracts

12:41 November 21

జేసీబీ, ట్రాక్టర్ల యజమానుల నుంచి డబ్బు వసూలు

బాధితుల ఆవేదన

మోసపోయేవాడుంటే మోసం చేసే వాళ్లు గల్లీకి ఒకరు పుడుతూనే ఉంటారు. ఉపాధి లేని వాళ్ల ఆర్థిక పరిస్థితిని ఆసరాగా తీసుకుని.. డబ్బు ఆశ చూపి ఘరానా మోసాలకు పాల్పడుతున్నారు. మొదట కొందరికి ఆదాయం చూపించి.. దానిని ఉదాహరణగా చూపిస్తూ వందలాది మందిని బుట్టలో వేసుకుంటున్నారు. మహబూబాబాద్​ జిల్లాలో కాంట్రాక్టుల పేరుతో సుమారు 100 మంది నుంచి భారీ ఎత్తున డబ్బు వసూలు చేశాడు ఓ ఘరానా మోసగాడు. ఏపీలోని అనంతపురం జిల్లాకు చెందిన నాగేంద్ర.. మహబూబాబాద్​ మండలంలోని పలు గ్రామాల్లో పలువురిని కాంట్రాక్టులు (cheating in mahabubababad) ఇప్పిస్తానని నమ్మించాడు. 

నెలకు రూ. లక్షలు వస్తాయని చెప్పి

జీహెచ్ఎంసీ కాంట్రాక్టులు ఇప్పిస్తానని అతను.. జేసీబీ, ట్రాక్టర్​ యజమానుల(cheating in the name of contracts) నుంచి భారీగా డబ్బులు వసూలు చేసి పరారైన ఈ సంఘటన ఆలస్యంగా బయటపడింది. నాగేంద్ర.. మహబూబూబాద్ జిల్లా కేంద్రం, చుట్టుపక్కల గ్రామాల్లో  జేసీబీ, ట్రాక్టర్ల ఓనర్లకు 3 సంవత్సరాల పాటు హైదరాబాద్​లోని జీహెచ్ఎం​సీ పరిధిలో కాంట్రాక్టులు ఇప్పిస్తానని నమ్మబలికాడు. జేసీబీకి నెలకు రూ. 2 లక్షల 20 వేలు, ట్రాక్టర్లకు రూ. 90 వేలు వస్తాయని చెప్పాడు. అలా నమ్మించి మొదట ముగ్గురు వ్యక్తుల వాహనాలకు ఒక నెల డబ్బులు ఇప్పించాడు. 

అక్కడికి వెళ్లాక

వారి వద్ద నమ్మకం సంపాదించుకున్న నాగేంద్ర అనంతరం మరో ప్లాన్​ వేశాడు. వాహనాలకు కాంట్రాక్టు ఇప్పించాలంటే జేసీబీకి రూ. లక్ష, ట్రాక్టర్​కు రూ. 60 వేలు ఇస్తే కాంట్రాక్టు ఇప్పిస్తానని నమ్మించాడు. స్థానిక యువకులను ఏజెంట్లుగా పెట్టుకొని వందలాది మంది వద్ద సుమారు రూ. కోటి 80 లక్షలు వసూలు చేశాడు. తర్వాత డబ్బులిచ్చిన వారందరినీ హైదరాబాద్‌కు రమ్మనటంతో వారంతా జీహెచ్​ఎంసీ కార్యాలయం వద్దకు వాహనాలతో చేరుకున్నారు. తీరా కార్యాలయం వద్దకు వెళ్లిన వాహనాల యజమానులను అక్కడి సిబ్బంది బయటికి పంపేయటంతో మోసపోయినట్లు అర్థం చేసుకున్నారు. 

బాధితులంతా నాగేంద్రను నిలదీయగా... కొందరికి చెక్కులిచ్చి వారి నుంచి తప్పించుకున్నాడు. ఇచ్చిన చెక్కులు బౌన్స్ అయ్యాయి. ఆ వెంటనే అతనికి బాధితులు ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ చేసుకున్నాడు. దీంతో మోసపోయామని గ్రహించిన బాధితులంతా మహబూబూబాద్ పట్టణ పోలీస్​స్టేషన్​లో ఫిర్యాదు చేశారు.

జీహెచ్​ఎంసీ కాంట్రాక్టులు ఇప్పిస్తామని చెప్పి నాగేంద్ర అనే వ్యక్తి మాకు చెప్పాడు. నిజమేనని నమ్మి ఒక్కొక్కరం రూ. 60 వేల  పైనే కట్టాం. అలా కడితేనే కాంట్రాక్టులు ఇప్పిస్తామన్నారు. డబ్బులు కట్టాక హైదరాబాద్​కు రమ్మన్నారు. ఇక్కడికి వచ్చాక జీహెచ్​ఎంసీ అధికారులు మమ్మల్ని లోపలికి రానివ్వలేదు. ఏంటా అని అతనికి ఫోన్​ చేస్తే బౌన్స్​ అయ్యే చెక్కులిచ్చాడు. ఫోన్​ చేస్తే స్విచాఫ్​ వస్తుంది. నెల రోజులుగా మమ్మల్ని ముప్పుతిప్పలు పెడుతున్నారు. పోలీసులే మాకు న్యాయం చేయాలి. -బాధితుడు, మహబూబాబాద్​

ఉద్యోగాల పేరుతో..

గత నెలలో మంచిర్యాల జిల్లాలో ఉద్యోగాల పేరుతో మోసం చేసిన ముఠాను (Job cheating in Mancherial)పోలీసులు అరెస్టు చేశారు. సింగరేణి, సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాల పేరుతో ముఠా సభ్యులు శ్రీనివాస్‌గౌడ్, జ్ఞానసాగర్, రవికాంత్‌శర్మ మోసానికి పాల్పడ్డారు. నిరుద్యోగులైన 29 మంది నుంచి రూ.కోటి 61 లక్షల 20 వేల వరకూ నిందితులు వసూలు చేశారు. ఇలా మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాల్లో నిరుద్యోగులను ఉద్యోగాల పేరిట మోసం చేసి... అమాయకుల నుంచి రూ.లక్షల్లో కాజేసినట్లు పోలీసులు గుర్తించారు. 

కోర్టులో ఉద్యోగాలని చెప్పి

మూడు నెలల క్రితం ఇదే తరహాలో మోసానికి పాల్పడ్డారు ఓ జంట.  పాల్వంచ వికలాంగుల కాలనీకి చెందిన మేఘన సరస్వతి తన భర్త రాంబాబుతో కలిసి 2019లో కోర్టుల్లో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి ఒక్కొక్కరి దగ్గర నుంచి మూడు నుంచి నాలుగు లక్షల రూపాయలు వసూలుచేసింది. ఇలా సుమారు 91 మంది నుంచి.. కోటి 90 లక్షలు వసూలుచేసినట్లు బాధితులు తెలిపారు. తీరా మెరిట్​ జాబితాలో పేరులేకపోవడం వల్ల మోసపోయామని గ్రహించిన బాధితులు.. గత నెల 26న పాల్వంచ పోలీస్​స్టేషన్​లో ఫిర్యాదుచేశారు.

ఇదీ చదవండి: pahadishareef murder case 2021 : వదినపై కోపంతో ఆమె నాలుగేళ్ల కుమారుడిని చంపేశాడు!

Last Updated :Nov 21, 2021, 5:08 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.