ETV Bharat / crime

ఎకరం భూమితో ఘరానా మోసం.. ఫ్యామిలీ మొత్తం అరెస్ట్!

author img

By

Published : Feb 25, 2022, 11:48 AM IST

Family Arrest in Land Cheating case
ఎకరం భూమితో ఘరానా మోసం

Family Arrest in Land Cheating case : ఎకరం భూమితో ఘరానా మోసానికి తెరలేపింది ఓ మహిళ. తనకున్న భూమిని భర్త, కొడుకు పేర్లమీదకు రిజిస్ట్రేషన్ చేయించింది. అనంతరం రెండు డాక్యుమెంట్లు సృష్టించి.. వేర్వేరు వ్యక్తులకు విక్రయించి సొమ్ము చేసుకుంది. పైగా కొన్న వారిని బెదిరించడం మొదలు పెట్టింది. బాధితుల ఫిర్యాదుతో ఈ ఘరానా మోసం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

Family Arrest in Land Cheating case : ఓ మహిళ తన తండ్రి ద్వారా సంక్రమించిన ఎకరభూమి సాయంతో భూ మాయాజాలం సృష్టించింది. భర్త, కొడుకుల పేర్ల మీద కొంత భూమిని గిఫ్ట్‌డీడ్‌లుగా బదలాయించి... ఒకే భూమిని వారిద్దరితో కలిసి కొందరు వేర్వేరు వ్యక్తులకు విక్రయించి మోసానికి పాల్పడింది. బాధితుల ఫిర్యాదుతో... పోలీసులు రంగంలోకి దిగారు. దర్యాప్తు చేసిన పోలీసులకు అసలు విషయం తెలియడంతో ఆమె భర్త, కొడుకుతో పాటు ఆ మహిళను కూడా అరెస్ట్‌ చేశారు.

ఏం జరిగింది?

సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలం ఐనోల్‌ గ్రామానికి చెందిన మల్లమ్మకు సర్వేనంబర్‌ 42/2/ఉ లో తండ్రి ద్వారా సంక్రమించిన ఎకరం భూమి ఉంది. దానిలో 4,500 గజాల భూమిని 2011 సంవత్సరంలో కొడుకు సుధాకర్‌రెడ్డికి రుణం నిమిత్తం భర్త మల్లారెడ్డి పేరుమీద గిఫ్ట్‌డీడ్‌గా రిజిస్ట్రేషన్‌ చేసింది. అనంతరం శ్రీరాం ఫైనాన్స్‌ సంస్థలో రూ.25 లక్షల రుణం తీసుకుంది. అదేభూమిని మళ్లీ 2014 సంవత్సరంలో తన కొడుకు సుధాకర్‌రెడ్డి పేరుమీద 2,500 గజాలు, 2 వేల గజాలు రెండు భాగాలుగా గిఫ్ట్‌డీడ్‌ రిజిస్ట్రేషన్‌ చేయించింది.

రెండు సార్లు రిజిస్ట్రేషన్లు.. రెండు సార్లు విక్రయాలు

తల్లి తన పేరుమీద చేసిన భూమినిలో 2,500 గజాలను ఎల్‌బీనగర్‌కు చెందిన సత్యవతికి రూ.55 లక్షలకు సుధాకర్‌రెడ్డి విక్రయించాడు. మిగతా 2 వేల గజాలను 2014 సంవత్సరంలో వెంకటరమణారావు అనే వ్యక్తికి రిజిస్ట్రేషన్‌ చేయించాడు. ఇది ఇలా ఉంటే సత్యవతి తాను కొనుగోలుచేసిన భూమిని కొడుకు నవీన్‌రెడ్డి పేరుమీద మార్పిడి చేయగా అతను సంగారెడ్డికి చెందిన వెంకటరెడ్డి అనే వ్యక్తికి విక్రయించాడు. భూమిని స్వాధీనం చేసుకుందామని వెంకటరెడ్డి వస్తే సుధాకర్‌రెడ్డి తన తల్లిదండ్రులతో కలిసి బెదిరింపులకు గురిచేయడంతో బాధితుడు పటాన్‌చెరు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.

ముగ్గురూ అరెస్ట్

మళ్లీ ఇదే భూమిని తొలుత భర్త మల్లారెడ్డి పేరుమీద గిఫ్ట్‌డీడ్‌గా రిజిస్ట్రేషన్‌ చేయడంతో కూకట్‌పల్లికి చెందిన హరిప్రసాద్‌, విజయభాస్కర్‌లకు రూ.1.5 కోట్లకు ఈ ఏడాది విక్రయించాడు. అంతేకాకుండా మ్యుటేషన్‌లో మార్పురాకపోవడంతో మళ్లీ ఈ భూమిని విక్రయించేందుకు వీరు మార్కెట్‌లో పెట్టారు. ఈ భూమిని వ్యవసాయేతర భూమిగా మార్చుకునేందుకు ఫోర్జరీ సంతకంతో ఆర్డీఓకు దరఖాస్తు చేసుకున్నారు. బాధితుల ఫిర్యాదుతో సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు పోలీసులు దర్యాప్తు చేయడంతో వీరి చేసిన మోసం వెలుగులోకి వచ్చింది. దీనితో భార్య మల్లమ్మ, భర్త మల్లారెడ్డి, కొడుకు సుధాకర్‌రెడ్డిలను ఛీటింగ్‌, ఫోర్జరీ నేరాల కింద అరెస్ట్‌ చేసి జైలుకు పంపారు.

ఉప్పురెడ్డి మల్లమ్మ అనే మహిళకు ఎకరం భూమి ఉంది. ఆమెకు తండ్రిద్వారా సంక్రమించింది. ఈ భూమిని ఆమె భర్త మల్లారెడ్డి పేరుమీద గిఫ్డ్ డీడ్ గా రిజిస్ట్రేషన్ చేయించింది. తర్వాత లోన్ తీసుకుంది. 2014లో ఈ భూమిని ప్లాట్ల మాదిరిగా చూపించి... వాళ్ల కొడుకు పేరు మీద చేయించింది. రెండు డాక్యుమెంట్లు తయారు చేయించి... వేర్వేరు వ్యక్తులకు విక్రయించి డబ్బులు కాజేశారు. బాధితుల ఫిర్యాదుతో అసలు విషయం బయటకు వచ్చింది.

­-వేణుగోపాల్ రెడ్డి సీఐ పటాన్​చెరు

ఇదీ చదవండి : Teacher Harashment: అసభ్యంగా తాకుతూ.. నీలిచిత్రాలు చూపిస్తూ...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.