Fingerprint Surgery Case: 'కొత్త గుర్తింపుతో మళ్లీ కువైట్‌కు.. త్వరలో భారత్‌కు రప్పిస్తాం'

author img

By

Published : Sep 21, 2022, 10:04 PM IST

Rachakonda CP

Fingerprint Surgery gand arrest: విదేశాలకు వెళ్లేందుకు వీలుగా వేలిముద్రల్ని మార్చేస్తున్న ముఠాను రాచకొండ పోలీసులు అరెస్ట్‌ చేశారు. గతంలో నలుగురు నిందితుల్ని అరెస్టు చేయగా.. ఇప్పటివరకు 8 మందిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. కువైట్‌కు వెళ్లిన వారిని భారత్‌కు రప్పిస్తామని వెల్లడించారు.

'కొత్త గుర్తింపుతో మళ్లీ కువైట్‌కు.. త్వరలో భారత్‌కు రప్పిస్తాం'

Fingerprint Surgery gand arrest: చేతిపై వేలిముద్రలు మార్చి.. విదేశాల్లో ఉద్యోగాలకు పంపేందుకు ప్రయత్నిస్తున్న గ్యాంగ్​ను రాచకొండ పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. అయితే తాగా ఈ కేసులో ఇప్పటివరకు 8 మందిని అరెస్టు చేసినట్లు సీపీ మహేశ్ భగవత్ తెలిపారు. శస్త్రచికిత్స చేసిన ఫింగర్‌ ప్రింట్‌ ఏడాది పాటు ఉంటుందని... ఆసమయంలోనే గుర్తింపు మార్చి విదేశాలకు వెళ్లేందుకు కుట్ర పన్నారని మహేశ్‌ భగవత్‌ వివరించారు. రాజస్థాన్‌, కేరళ వెళ్లిన పోలీసు బృందాలు కేసులో పురోగతి సాధించాయి. రాజస్థాన్‌లో కమలేష్, విశాల్, కేరళ నుంచి బషీర్ అబ్దుల్, మహమ్మద్ రఫీలను అరెస్ట్ చేశామని తెలిపారు.

శస్త్రచికిత్స చేసిన ఫింగర్‌ ప్రింట్‌ ఏడాది పాటు ఉంటుంది. నకిలీ ఫింగర్‌ ప్రింట్‌ ద్వారా విదేశాలకు వెళ్లేందుకు ఇలా కుట్ర పన్నారు. ఇప్పటివరకు 8మందిని అరెస్టు చేశాం. కువైట్‌లోని భారత ఎంబసీకి సమాచారమిస్తాం. మరికొంత మందిని అరెస్ట్ చేస్తాం. వేళ్లకు సర్జరీ చేసి కొత్త గుర్తింపుతో మళ్లీ కువైట్‌కు వెళ్లారు. అలా వెళ్లిన వారిని స్వదేశానికి రప్పిస్తాం. - మహేశ్ భగవత్, రాచకొండ సీపీ

అసలు ఏంటీ కథ: ఆంధ్రప్రదేశ్‌లోని వైఎస్‌ఆర్‌ కడప జిల్లా సిద్ధవటం మండలం, జ్యోతి గ్రామానికి చెందిన గజ్జలకొండుగారి నాగమునీశ్వర్‌రెడ్డి(36) తిరుపతిలోని కృష్ణా డయాగ్నస్టిక్స్‌లో రేడియోగ్రాఫర్‌గా పనిచేస్తున్నాడు. ఇతని స్నేహితుడు బాలాజీ తిరుపతి జిల్లా తానపల్లి గ్రామానికి చెందిన సాగబాల వెంకటరమణ(39) అనస్తీషియా టెక్నీషియన్‌గా పనిచేస్తున్నాడు. నాగమునీశ్వర్‌రెడ్డి ఒకసారి కడపకు వెళ్లినప్పుడు కువైట్‌కు వర్క్‌ పర్మిట్‌ మీద వెళ్లి కొన్ని రోజుల క్రితం తిరిగొచ్చిన వ్యక్తిని కలిశాడు. మళ్లీ కువైట్‌ వెళ్లేందుకు యత్నించగా అక్కడి ఇమిగ్రేషన్‌ అధికారులు చేతి వేలిముద్రల ఆధారంగా వివరాలు తెలుసుకుని గతంలో అక్రమంగా ఉన్నట్లు గుర్తించి వెనక్కి పంపినట్లు వివరించాడు. ఈ నేపథ్యంలో శ్రీలంకకు వెళ్లి శస్త్రచికిత్స ద్వారా వేలిముద్రల్ని మార్చుకున్నట్లు చెప్పాడు. దీని గురించి వివరంగా తెలుసుకున్న నాగమునీశ్వర్‌రెడ్డి అక్రమంగా డబ్బు సంపాదించేందుకు వేలిముద్రలు మార్చే శస్త్రచికిత్సలు చేపట్టాలని వ్యూహం పన్నాడు. ఇందుకు అతని స్నేహితుడు వెంకటరమణ అంగీకరించాడు.

ఆపరేషన్‌ రాజస్థాన్‌, కేరళ... కువైట్‌లో ఉండే తన మిత్రుడి ద్వారా రాజస్థాన్‌లో ఉండే ఓ వ్యక్తి వివరాలు సేకరించిన నాగమునీశ్వర్‌రెడ్డి, వెంకటరమణ రాజస్థాన్‌ వెళ్లారు. అక్కడ ఇద్దరికి వేలిముద్రలు మార్చే ఆపరేషన్‌ చేసి.. ఒక్కొక్కరి నుంచి రూ.25 వేలు వసూలు చేశారు. కొంతకాలం తర్వాత రాజస్థాన్‌ వ్యక్తి ద్వారా 2022 మేలో కేరళ వెళ్లి అక్కడ ఆరుగురికి ఆపరేషన్‌ చేశారు. ఇందుకు రూ.1.50 లక్షలు తీసుకున్నారు. అనంతరం రూ.25 వేల చొప్పున తీసుకుని ముగ్గురికి తన సొంత గ్రామంలోనే శస్త్రచికిత్స చేశారు. ఈ వ్యవహారంపై రాచకొండ పోలీసులకు కువైట్‌ నుంచి సమాచారం అందింది. దీని ఆధారంగా మల్కాజిగిరి ఎస్‌వోటీ పోలీసులు కూపీ లాగారు. నాగమునీశ్వర్‌రెడ్డి, వెంకటరమణ.. ఆగస్టు 29న ఘట్‌కేసర్‌ ఠాణా అన్నోజీగూడలోని ఓ హోటల్‌లో ఇద్దరికి ఆపరేషన్‌ చేస్తున్నట్లు సమాచారం అందింది. ఆకస్మికంగా దాడి చేసి ఇద్దరు నిందితులతో పాటు హోటల్లో చికిత్స చేయించుకున్న వైఎస్‌ఆర్‌ కడపజిల్లా అట్లూరు మండలం పాతఅట్లూరు గ్రామానికి చెందిన రెండ్ల రామకృష్ణరెడ్డి(35), సిద్ధవటం మండలం జ్యోతి గ్రామానికి చెందిన బోవిల్ల శివకుమార్‌రెడ్డి(25)లను అరెస్టు చేశారు. ఆపరేషన్‌ చేయించుకున్న వారిలో ముగ్గురు కువైట్‌ వెళ్లినట్లు తెలిసింది.

శస్త్రచికిత్సతో ఏమార్చి వేలిముద్రలు ఉండే భాగంలో నిందితులు శస్త్రచికిత్స చేస్తారు. ఇవి అచ్చం గాయాల్లా కనిపిస్తాయి. వేలి ముద్రలు తొలగిపోయి కొత్తవి రావడానికి ఏడాది పడుతుంది. ఈ వ్యవధిలోనే కువైట్‌ వెళ్తారు. కొత్త ఆధార్‌ నంబరు సంపాదించి.. మరో చిరునామాతో మళ్లీ వీసా తీసుకొని డబ్బు సంపాదించేందుకు కువైట్‌ వెళ్తారు.

ఇవీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.