ETV Bharat / city

యునెస్కో గుర్తింపునకు అడుగు దూరంలో రామప్ప ఆలయం..

author img

By

Published : Jan 6, 2021, 4:42 AM IST

Updated : Jan 6, 2021, 6:40 AM IST

రామప్ప ఆలయం. కాకతీయుల కళా నైపుణ్యానికి తార్కాణం . సుమారు 800 ఏళ్లు దాటినా ఆ పురాతన కట్టడం చెక్కు చెదరలేదు. ఇంతటి ప్రాముఖ్యత కలిగిన దేవాలయం నిర్లక్ష్యానికి గురవుతోంది. ఆలయ అభివృద్ధికి నిధులు మంజూరైనా.... పనులు సజావుగా సాగటం లేదు. కనీసం సరైన రహదారులు లేక సందర్శకులు ఇబ్బంది పడుతున్నారు.

అసంపూర్తిగా పునర్నిర్మాణ పనులు
అసంపూర్తిగా పునర్నిర్మాణ పనులు

యునెస్కో గుర్తింపునకు అడుగు దూరంలో రామప్ప ఆలయం..

ప్రపంచ వారసత్వ కట్టడంగా యునెస్కొ గుర్తింపునకు అడుగు దూరంలో ఉన్న రామప్ప క్షేత్రం అధికారుల నిర్లక్ష్యానికి గురవుతోంది. ఆలయ అభివృద్ధికి నిధులు మంజూరైనా పనులు సజావుగా సాగడం లేదు. కనీసం సరైన రహదారి లేక సందర్శకులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆలయ విశిష్టతను ప్రపంచం గుర్తించినా యంత్రాంగం నిర్లక్ష్యంతో దాని ఖ్యాతి నీరుగారిపోయేలా ఉంది. 2017 ఆగస్టు 19న ఆలయం తూర్పువైపున ఉన్న ప్రహరీ వర్షాలకు కుంగిపోయి 40 మీటర్ల వరకు కుప్పకూలింది. ఎలాంటి పునరుద్ధరణ చర్యలు చేపట్టకపోవడంపై అదే ఏడాది సెప్టెంబరులో ‘ఈనాడు’లో కథనం ప్రచురితమైనది. హైకోర్టు ఈ కథనాన్ని సుమోటోగా తీసుకుని విచారణ చేపట్టింది. మరోసారి ఇలాంటి చర్యలు పునరావృతం కావద్దని పురావస్తు శాఖ అధికారులను హెచ్చరించి ప్రహరీ పునరుద్ధరణ చర్యలు చేపట్టాలని సూచించింది. ఈ క్రమంలో పనులను 2018 జనవరిలో రూ.1.15 కోట్లతో ప్రారంభించారు. ఆరు నెలల్లో పూర్తి చేస్తామన్న అధికారులు మూడేళ్లు కావస్తున్నా పూర్తి చేయలేకపోయారు. యునెస్కో బృందం పర్యటించే ముందు నిర్మాణ పనులు మొదలుపెట్టి సగం పూర్తిచేశారు.


వర్షాలకు దారులు ధ్వంసం..


గత ఆగస్టు నెలలో కురిసిన వర్షాలకు రామప్ప చెరువు పొంగి పొర్లింది. దాంతో ఆలయ ప్రధాన రహదారులు పూర్తిగా తెగిపోయాయి. రూ.82 లక్షలతో సెంట్రల్‌ లైటింగ్‌తో ఏర్పాటు చేసిన తూర్పు రోడ్డు మార్గం రెండు చోట్ల దెబ్బతిన్నది. ఈ రోడ్డును తాత్కాలికంగా మట్టి పోసి చదును చేశారు. పశ్చిమ వైపున్న ప్రధాన రోడ్డును అలాగే వదిలేయడంతో ప్రమాదాలకు నిలయంగా మారింది. పురావస్తు శాఖ ఆధీనంలో ఉన్న రామప్ప గార్డెన్‌లో 2019లో అంతర్గత రోడ్ల నిర్మాణానికి రూ.35 లక్షలు మంజూరు చేశారు. పనులు మొదలుపెట్టినా కరోనా ప్రభావంతో అవీ అసంపూర్తిగానే మిగిలిపోయాయి. రామప్ప ఆలయం నుంచి చెరువుకట్ట వరకు రూ.1.20 కోట్లతో చేపట్టిన రహదారి పనులు సైతం పూర్తికాలేదు. అండర్‌ గ్రౌండ్‌ ద్వారా విద్యుత్తు సరఫరా కోసం పురావస్తుశాఖ విద్యుత్తుశాఖకు రూ.18 లక్షలను కేటాయించింది. కానీ ఇప్పటి వరకు విద్యుత్తు శాఖకు పని స్థలాలను చూపించలేదు. 2011లో కామేశ్వర ఆలయం పునర్నిర్మాణం కోసం ఆలయాన్ని విప్పారు. ఆ తర్వాత నిర్మాణానికి నోచుకోలేదు. దీనికి సంబంధించిన శిలలు ఆలయ ఆవరణలో ఎక్కడికక్కడే పడేశారు.

వెంటనే పనులు పూర్తి చేయిస్తాం

రామప్పలో అసంపూర్తిగా ఉన్న పనులపై ఆయా శాఖల అధికారులతో మాట్లాడి వెంటనే పనులు పూర్తిచేయిస్తాం. పశ్చిమవైపు రహదారి టెండర్ల ప్రక్రియ కొనసాగుతోంది. చెరువు కట్టకు వెళ్లే రహదారి నిర్మాణాన్ని అటవీ శాఖ అనుమతులు రాగానే ప్రారంభిస్తాం. - కృష్ణ ఆదిత్య, ములుగు జిల్లా కలెక్టర్‌

త్వరలోనే నిర్ణయం..

ప్రపంచ వారసత్వ కట్టడంగా యునెస్కో గుర్తింపు కోసం కేంద్ర, రాష్ట్ర పురావస్తు శాఖ, కాకతీయ హెరిటేజ్‌ ట్రస్టు నిర్విరామంగా కృషి చేస్తూనే ఉన్నాయి. చాలా దశలను దాటుతూ చివరిదశకు చేరుకొంది. 2020 జూన్‌, జులైలలో చైనా వేదికగా జరగాల్సిన ఓటింగ్‌ సమావేశాన్ని కరోనా నేపథ్యంలో వాయిదా వేశారు. 21 దేశాల ప్రతినిధుల సభ్యులతో కూడిన కమిటీ ఓటింగ్‌లో మెజారిటీ సాధించిన వాటికి యునెస్కో గుర్తింపు హోదాను ప్రకటిస్తారు. ఆన్‌లైన్‌లో ఓటింగ్‌పై యునెస్కో త్వరలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.


ఇవీ చూడండి: టెక్నాలజీ గవర్నెన్స్ సదస్సులో పాల్గొనేందుకు కేటీఆర్​కు పిలుపు

Last Updated : Jan 6, 2021, 6:40 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.