ETV Bharat / city

'ఆపరేషన్ ఆకర్ష్' ప్రారంభించిన భాజపా.. అసంతృప్త నేతలపై కన్ను..

author img

By

Published : Jul 31, 2022, 10:22 AM IST

Updated : Jul 31, 2022, 11:39 AM IST

BJP Operation Akarsh
BJP Operation Akarsh

BJP Operation Akarsh: ఇందూరులో భాజపా 'ఆపరేషన్ ఆకర్ష్' ప్రారంభించింది. తెదేపా, తెరాస అసంతృప్తి నేతలపై కన్నేసింది. ఇప్పటికే జిల్లాలో పట్టు బిగిస్తోన్న కమలదళం.. బలహీనంగా ఉన్న నియోజకవర్గాల్లో పుంజుకునేందుకు చూస్తోంది. ప్రతి నియోజకవర్గంలో గెలుపు గుర్రాలను పార్టీలోకి తీసుకురావాలని ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది.

'ఆపరేషన్ ఆకర్ష్' ప్రారంభించిన భాజపా.. అసంతృప్త నేతలపై కన్ను..

BJP Operation Akarsh: నిజామాబాద్‌లో పట్టు సాధించేందుకు... భాజపా ప్రయత్నాలు ముమ్మరం చేసింది. జిల్లాలో పాగా వేసేందుకు వ్యూహాలు రచిస్తోంది. ఇందుకోసం ఆపరేషన్ ఆకర్ష్‌కు తెరతీస్తోంది. కీలక నాయకులను పార్టీలో చేర్చుకునేందుకు ప్రయత్నిస్తోంది. తెరాసలో అసంతృప్తి నేతలు, పదవులు ఆశించి భంగపడిన నాయకులపై కన్నేసింది. తెలుగుదేశం పార్టీలో కీలక పదవులు నిర్వర్తించి క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉన్న నేతలపైనా దృష్టిసారించింది. గెలుపు గుర్రాలుగా భావిస్తున్న వారిని ఎలాగైనా పార్టీలో చేర్చుకోవాలని భాజపా మంతనాలు సాగిస్తోంది.

ఉమ్మడి జిల్లాలో బలహీనంగా ఉన్న నియోజకవర్గాల్లో పుంజుకునేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది. ఇందులో భాగంగానే ఆయా నియోజకవర్గాలపై భాజపా నేతలు దృష్టిసారించారు. బోధన్ నియోజకవర్గానికి చెందిన తెరాస నాయకుడు, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ జాతీయ నేత మోహన్ రెడ్డి ఇప్పటికే పార్టీలో చేరనున్నట్టు ప్రకటించారు. బోధన్‌లో మంచి పట్టున్న నాయకుడ్ని పార్టీలోకి తీసుకురావటంలో విజయం సాధించింది. ఇదే కోవలో మరికొందరు నాయకులనూ పార్టీలో చేర్చుకోవాలని చూస్తోంది.

నిజామాబాద్ గ్రామీణం నుంచి ప్రాతినిధ్యం వహించిన మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావుపైనా భాజపా దృష్టి పెట్టింది. ఇటీవల రాజ్యసభ ఆశించిన మండవకు పదవి దక్కకపోవడంతో ఎలాగైనా పార్టీలోకి రప్పించాలని ఎంపీ అర్వింద్ భావిస్తున్నారు. అర్వింద్‌తో... మండవ భేటీ అయినట్టు తెలుస్తోంది. ఇప్పటికే బాల్కొండ మాజీ ఎమ్మెల్యే అన్నపూర్ణమ్మ భాజపాలో చేరారు. ఆర్మూర్‌లోనూ కొత్త అభ్యర్థికోసం అన్వేషిస్తున్నారు. అంకాపూర్‌కు చెందిన ఓ వ్యాపారిని సంప్రదిస్తున్నారు. నిజామాబాద్‌ అర్బన్‌ నియోజకవర్గంలో ముగ్గురు అభ్యర్థులు ఉన్నా వారి బలం సరిపోదని ఎంపీ భావిస్తున్నారు. బలమైన అభ్యర్థిని రంగంలోకి దించేందుకు అన్వేషిస్తున్నారు. అర్బన్ తెరాస నేతలపైనా దృష్టి సారించారు.

నియోజకవర్గాల పునర్విభజన లేదని కేంద్రప్రభుత్వం స్పష్టం చేయడంతో... తెరాసకు చెందిన నేతలు అసంతృప్తితో ఉన్నారు. నామినేటెడ్ పదవులు ఆశించి భంగ పడ్డ నాయకులు, అసంతృప్తితో ఉన్న వారిలో కీలక నేతలను పార్టీలో చేర్చుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. జిల్లాలోని అన్ని స్థానాల్లోనూ గెలుపే లక్ష్యంగా కమలం నేతలు పనిచేస్తున్నారు.

ఇవీ చదవండి:

Last Updated :Jul 31, 2022, 11:39 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.