మునుగోడు సీటుపై 'గులాబీ' కన్ను.. 'ఒక్క ఛాన్స్​' కోసం ఆశావహుల పోటాపోటీ!

author img

By

Published : Jul 31, 2022, 8:49 AM IST

Updated : Jul 31, 2022, 12:01 PM IST

మునుగోడు సీటుపై 'గులాబీ' కన్ను.. బరిలో నిలిచేందుకు నేతల పోటాపోటీ!

trs focus on munugodu: మునుగోడు సీటుపై గులాబీ నేతల్లో ఆశలు మొదలయ్యాయి. ఉప ఎన్నిక వస్తే పోటీకి దిగాలని పలువురు ఉవ్విళ్లూరుతున్నారు. కేసీఆర్​, కేటీఆర్​ను ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అటు నియోజకవర్గంలో.. ఇటు మీడియాలో ప్రచారం కోసం ఎత్తుగడలు వేస్తున్నారు. మునుగోడుపై ప్రత్యేక దృష్టి పెట్టిన తెరాస.. పలు అంశాలపై సర్వేలపై సర్వేలు చేస్తోంది. శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, సీనియర్ నేతలు కర్నె ప్రభాకర్, కర్నాటి విద్యాసాగర్, కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి పేర్లు పార్టీ శ్రేణుల్లో ప్రచారం జరుగుతోంది.

మునుగోడు సీటుపై 'గులాబీ' కన్ను.. 'ఒక్క ఛాన్స్​' కోసం ఆశావహుల పోటాపోటీ!

trs focus on munugodu: మునుగోడు రాజకీయ పరిణామాలపై తెరాస ప్రత్యేక దృష్టి పెట్టింది. ఉప ఎన్నిక వస్తే గులాబీ జెండా ఎగుర వేసే దిశగా కసరత్తు ముమ్మరం చేసింది. ఇప్పటికే వివిధ కోణాల్లో సర్వేలు చేయగా.. మరికొన్ని జరుగుతున్నాయి. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేస్తే.. నియోజకవర్గంలో రాజకీయ పరిస్థితులను తమకు అనుకూలంగా మలుచుకునేందుకు ఎత్తులు, పైఎత్తులు మొదలుపెట్టింది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి భాజపా ముఖ్య నేతలతో సంప్రదింపులు జరపగానే తెరాస అప్రమత్తమైంది. నల్గొండ జిల్లా ముఖ్యనేతలతో ఇటీవల సీఎం కేసీఆర్​ సమావేశమై నియోజకవర్గంలో రాజకీయాలపై చర్చించారు. గట్టుప్పల్​ను మండలం చేస్తూ ప్రభుత్వ పరంగా ఉత్తర్వులు జారీ అయ్యాయి. మునుగోడుకు నిధులు, అభివృద్ధి పనులు, ప్రాజెక్టుల వరాలు ప్రకటించేందుకు సిద్ధం చేసి పెట్టుకుంటున్నట్లు తెలుస్తోంది.

నియోజవకవర్గంలో ప్రజల ప్రధాన ఆకాంక్షలేమిటి? ముఖ్యమైన సమస్యలేమిటనే అంశాలపై వివిధ వర్గాల ద్వారా నివేదికలు తెప్పించుకుంటున్నారు. నియోజకవర్గంలో తెరాస బలాబలాలు, పార్టీ నేతలపై అభిప్రాయం, ఇతర పార్టీల పరిస్థితి, కేసీఆర్ పాలన, అభివృద్ధి, ప్రజా సమస్యలు, సంక్షేమ పథకాలు ఇలా వివిధ కోణాల్లో ప్రశాంత్ కిషోర్ బృందాలతో పాటు పార్టీ, ఇతర ఏజెన్సీల ద్వారా సర్వేలు చేయిస్తున్నారు. ఇప్పటికే కొన్ని సర్వేల నివేదికలు అందడంతో వాటిని విశ్లేషిస్తున్నారు. ఉప ఎన్నిక వస్తే గెలిచే పరిస్థితి ఉందని తెరాస బలంగా నమ్ముతోంది.

ప్రసన్నం చేసుకునేందుకు పోటీ..: ఇదిలా ఉండగా.. మునుగోడుకు ఉప ఎన్నిక వస్తుందనే ప్రచారం ఊపందుకోగానే.. తెరాస నేతల్లో ఆశలు పెరిగాయి. మునుగోడులో పోటీ చేసేందుకు పలువురు నేతలు ఉవ్విళ్లూరుతున్నారు. ఉప ఎన్నిక వస్తే కచ్చితంగా తెరాస గెలుస్తుందన్న ధీమాతో ఉన్న నేతలు.. ఆ అవకాశాన్ని చేజిక్కించుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్, తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్​ను ప్రసన్నం చేసుకునేందుకు పోటీ పడుతున్నారు. నియోజవకవర్గంలో, మీడియాలో చురుగ్గా కనిపిస్తూ అటు అధిష్టానం.. ఇటు ప్రజల దృష్టిలో పడేందుకు కష్టపడుతున్నారు.

ఆశావహులు ఎక్కువే.. మునుగోడులో 2014లో తెరాస తరఫున కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి పోటీ చేసి విజయం సాధించారు. ప్రభాకర్ రెడ్డి 2018లో మళ్లీ పోటీ చేసినప్పటికీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేతిలో ఓడిపోయారు. ఉపఎన్నిక వస్తే మళ్లీ బరిలోకి దిగేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. మంత్రి జగదీశ్‌రెడ్డితో కలిసి వివిధ కార్యక్రమాల్లో చురుగ్గా వ్యవహరిస్తున్నారు. శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి లేదా ఆయన కుమారుడు కూడా ఆశిస్తున్నట్లు పార్టీలో ప్రచారం జరుగుతోంది. మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, తెరాస సీనియర్ నేతలు కర్నాటి ప్రభాకర్, కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి పేర్లు కూడా అధిష్ఠానం దృష్టిలో ఉన్నాయని పార్టీలో ప్రచారం జరుగుతోంది.

ఇవీ చూడండి..

'రాజగోపాల్​రెడ్డి విషయంలో ప్లాన్​-ఏ ఫెయిలైతే.. ప్లాన్​-బీ అమలుచేస్తాం..'

షోరూం టాయిలెట్​లో దాక్కొని.. గర్ల్​ఫ్రెండ్ కోసం సెల్​ఫోన్ చోరీ

Last Updated :Jul 31, 2022, 12:01 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.