'హర్​ ఘర్ ​మే తిరంగా'.. చేనేత కార్మికులకు వరంగా..!

author img

By

Published : Jul 31, 2022, 8:58 AM IST

Updated : Jul 31, 2022, 11:59 AM IST

Women are employed by waving flags in Sirisilla

స్వాతంత్య్ర వజ్రోత్సవాలు సిరిసిల్ల చేనేత కార్మికులకు ఉపాధి పండుగను తెచ్చిపెట్టాయి. ప్రజల్లో దేశభక్తిని మరింత పెంపొందించేందుకు.. ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేయాలన్న నిర్ణయం... నేత కార్మికుల్లో ఆనందం కలిగించింది. గతంలో బీడీలు చుట్టే కార్మికుల చేతులు.. ఇప్పుడు జాతీయ జెండాలు కుడుతున్నాయి. రోజంతా బీడీలు చుట్టినా రాని కూలీ డబ్బులు.. త్రివర్ణ పతాకం తయారీతో సంపాదిస్తున్నారు.

'హర్​ ఘర్ ​మే తిరంగా'.. చేనేత కార్మికులకు వరంగా..!

సిరిసిల్లలో ఒకప్పుడు ఎటుచూసినా మహిళలు బీడీలు చుడుతూ దర్శనమిచ్చేవారు. కానీ ప్రస్తుతం ఆ పరిస్థితి మారింది. కుట్టుమిషన్‌పై త్రివర్ణ పతాకాన్ని కుడుతూ కనిపిస్తున్నారు. పవర్‌లూమ్స్‌లోనూ ఎక్కడ చూసిన జాతీయ జెండాలే దర్శనమిస్తున్నాయి. స్వాతంత్య్ర దినోత్సవ వజ్రోత్సవాలు పురస్కరించుకొని.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 'హర్‌ ఘర్‌ మే తిరంగా' ప్రణాళిక తీసుకొచ్చాయి. దీంతో సిరిసిల్ల నేత కార్మికులకు సరికొత్త ఆర్డర్లు వచ్చిపడుతున్నాయి. ఇప్పటి వరకు బీడీలు చుట్టడం, బతుకమ్మ చీరలు, పాఠశాలల ఏకరూప వస్త్రాల ఉత్పత్తిలో ఉన్న మహిళలు.. జాతీయ పతాక తయారీలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఉత్తర్‌ప్రదేశ్‌, దిల్లీ తదితర ప్రాంతాల నుంచి జాతీయ జెండాల తయారీకి ఆర్డర్లు రావడంతో కార్మికులకు ఉపాధి పెరిగింది. నేతన్నలకు పనికొరవడుతున్న ఈ రోజుల్లో మువ్వన్నెల జెండాల తయారీతో ఎంతోమందికి పని దొరికంది.

స్వాతంత్య్ర దినోత్సవం రోజు దేశమంతటా రెపరెపలాడేందుకు వెళ్తున్న జెండాలను నేత కార్మికులు ఎంతో శ్రద్ధగా తీర్చిదిద్దుతున్నారు. హైదరాబాద్‌ నుంచి వచ్చిన వస్త్రాలను.. జెండాలుగా తయారుచేసి పొరుగు రాష్ట్రాలకు సరఫరా చేస్తున్నారు. రోజుకు 50 వేల వరకు తయారు చేసేందుకు ఒక్కో యూనిట్‌లో సుమారు 50 మంది పని చేస్తున్నారు. ఇలాంటి యూనిట్లు సిరిసిల్లలో ఐదు నుంచి ఆరు వరకు ఉన్నాయి. కరోనాతో పాటు.. పవర్‌ లూమ్స్‌పై తయారైన వస్త్రాలపై ప్రజలు ఆసక్తి చూపకపోవడంతో తమ వృత్తిని వదులుకుంటున్నామన్న కార్మికులు.. జాతీయ జెండాల తయారీతో పూర్వవైభవం వచ్చిందని హర్షం వ్యక్తం చేస్తున్నారు.

రాష్ట్ర ప్రభుత్వం సైతం జాతీయ జెండాల తయారీ పనులు అధిక శాతం సిరిసిల్ల కార్మికులకు ఇవ్వాలని ప్రకటించినా.. ఇప్పటి వరకు ఇతర రాష్ట్రాలకు చెందిన పనులు సాగుతున్నాయి. రాష్ట్రంలో కోటీ 20 లక్షల మువ్వన్నెల జెండాల తయారీకి ఆర్డర్లు సిద్ధమవుతున్నాయి.

ఇవీ చూడండి..

వారికి 20 రోజుల ముందుగానే 'జెండా' పండుగ..!

తాళికట్టు 'శ్రావణ' వేళ.. మెడలో 'కల్యాణ' మాల..!

'దుల్కర్‌ చెప్పేవన్నీ అబద్ధాలే.. ఇప్పుడూ అలానే!'

Last Updated :Jul 31, 2022, 11:59 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.