ETV Bharat / city

కొండముచ్చు దాడి.. కార్మికుడికి తీవ్ర గాయాలు

author img

By

Published : Apr 19, 2020, 3:26 PM IST

సూర్యాపేట జిల్లా కేంద్రంలో విధులు నిర్వర్తిస్తున్న ఓ పారిశుద్ధ్య కార్మికుడిపై కొండెంగ దాడి చేసింది. ఈ దాడిలో కార్మికుడికి తీవ్ర గాయాలయ్యాయి.

Kondamuchu Attack On Municipal Staff  In Surya pet
కొండముచ్చు దాడి.. కార్మికుడికి తీవ్ర గాయాలు

సూర్యాపేట జిల్లా కేంద్రంలో కోతులను తరమడానికి పురపాలక సిబ్బంది తీసుకొచ్చిన కొండెంగ పట్టణ కేంద్రంలో విధులు నిర్వర్తిస్తున్న భిక్షం అనే పారిశుద్ధ్య కార్మికుడి మీద దాడి చేసింది. ఈ ఘటనలో కార్మికుడికి తీవ్ర గాయాలై రక్త స్రావమైంది. బాధితుడిని సూర్యాపేట జిల్లా ఆసుపత్రికి తరలించారు.

సూర్యాపేట జిల్లా కేంద్రంలో కోతులను తరమటానికి పురపాలక సంఘం కొండెంగలను తీసుకువచ్చారు. వీటి వల్ల కోతుల నుంచి కొంతమేరకు ఉపశమనం పొందినప్పటికీ.. ఇవే కొండెంగలు మనుషులపై దాడి చేస్తూ భయాందోళనలకు గురిచేస్తున్నాయి. అధికారులు మొదట రెండు కొండెంగలను తీసుకురాగా.. క్రమంగా వాటి సంతానం పెరిగింది. వాటిలో ఓ కొండెంగ వింతగా ప్రవర్తిస్తూ.. బాటసారులు, పండ్లు, కూరగాయల వ్యాపారుల మీద దాడికి దిగుతున్నది. గతంలో ఓ మద్యం దుకాణంలోకి వెళ్లిన కొండెంగకి ఓ తాగుబోతు గ్లాసులో మద్యం పోసి ఇచ్చాడు. మనిషిలాగే తాగిన కొండెంగ.. ఆ తర్వాత కొద్దిరోజుల నుంచి మనుషులపై దాడి చేస్తుందని స్థానికులు చెపుతున్నారు.

ఈ మధ్యకాలంలో రోడ్డుపై వెళ్లే వాహనదారులు మీద కూడా కొండెంగ దాడికి దిగుతున్నది. గతంలో సూర్యాపేట కొత్త బస్టాండ్ సమీపంలో ఓ యువకుడి గొంతుపై దాడి చేయగా.. తీవ్రగాయల పాలైన ఆ యువకుడు ప్రాణాలతో బయటపడ్డాడు. ఎనిమిది నెలల కిందట సీతారాంపురం వీధిలో కనిపించిన ప్రతివ్యక్తిపై దాడిచేసింది. గంట వ్యవధిలోనే మొత్తం 23 మందిపై దాడి చేసింది. పదునైన పళ్ళు, పెద్ద పెద్ద గోళ్లు ఉండడం వల్ల దాన్ని పట్టుకోవడానికి కూడా జంకుతున్నారు. పురపాలక సంఘం అధికారులు నిపుణులను రప్పించి బోనులు ఏర్పాటు చేసినా.. ఫలితం దక్కలేదు. ఎలాగైనా కొండెంగను బంధించి దాని బారి నుంచి కాపాడాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.

ఇదీ చూడండి:- గృహ హింసకు పాల్పడితే క్వారంటైన్​కే!

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.