ETV Bharat / city

యాదాద్రిలో నాలుగో రోజూ భక్తుల రద్దీ.. విష్ణు పుష్కరిణికి మోక్షమెప్పుడో..!

author img

By

Published : Oct 9, 2022, 12:49 PM IST

Devotees Rush at Yadadri Temple: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదాద్రిలో గత నాలుగు రోజులుగా భక్తుల రద్దీ కొనసాగుతోంది. వరుస సెలవులు కావడంతో వివిధ ప్రాంతాల నుంచి మొక్కులు తీర్చుకోవడానికి అధిక సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. పెరిగిన రద్దీతో స్వామివారి ధర్మ దర్శనానికి రెండున్నర గంటల సమయం పడుతోంది. ఆలయ ప్రాంగణంలో మాత్రం అందుకు తగినట్లుగా మౌలిక వసతులు కొరవడటంతో భక్తులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు పంచనారసింహుల ఆలయ ఉద్ఘాటన జరిగి ఆర్నెళ్లు దాటినా.. విష్ణు పుష్కరిణి వినియోగానికి నోచుకోవటం లేదు.

Yadadri
Yadadri

Devotees Rush at Yadadri Temple: తెలంగాణ ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదాద్రికి గత నాలుగు రోజులుగా భక్తుల తాకిడి పెరిగింది. వరుస సెలవులు రావడంతో వివిధ ప్రాంతాల నుంచి భక్తుల రాకతో యాదగిరీశుని సన్నిధి భక్తులతో రద్దీగా మారింది. క్యూలైన్లు, ప్రసాదాల కౌంటర్లు, కల్యాణకట్ట, లక్ష్మీ పుష్కరిణి.. కిటకిటలాడుతున్నాయి. స్వామివారి ధర్మదర్శనానికి రెండున్నర గంటల సమయం, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి గంటన్నర సమయం పడుతోంది. రద్దీ దృష్ట్యా భక్తులకు లఘు దర్శన సౌకర్యం ఏర్పాటు చేశారు.

ప్రధానాలయంలో ఉదయం నుంచి ఆరాధనలు, స్వామివారి నిత్యకైంకర్యాలను అర్చకులు శాస్త్రోక్తంగా చేపట్టారు. భక్తులు స్వామి వారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు. అదే విధంగా పెరుగుతున్న రద్దీని దృష్టిలో ఉంచుకొని ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. పునర్నిర్మాణం తర్వాత స్వయంభువులను దర్శించుకుని.. ఆలయ శోభను కనులారా ఆస్వాదించేందుకు భక్తులు వస్తున్నా.. ఆలయ ప్రాంగణంలో మాత్రం అందుకు తగినట్లుగా మౌలిక వసతులు కొరవడటంతో భక్తులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

విష్ణుపుష్కరిణికి మోక్షమెప్పుడో.. మరోవైపు యాదాద్రి క్షేత్రంలో రోజురోజుకి భక్తుల రద్దీ పెరుగుతున్న దైవకార్యక్రమాలకు నిర్మితమైన విష్ణుపుష్కరిణి ప్రారంభానికి నోచుకోవటం లేదు. భక్తులకు, భగవంతుడికి వేర్వేరుగా పుష్కరిణీలు రెండు చోట్ల ఏర్పాటయ్యాయి. భక్తుల పుణ్య స్నానాల కోసం కొండ కింద లక్ష్మీదేవి పేరిట పుష్కరిణి వినియోగానికి వీలు కల్పించారు. కొండపైన గల విష్ణు పుష్కరిణిని సుమారు రూ.3 కోట్ల వ్యయంతో పునరుద్ధరణ చేపట్టి సదరు పనులు కొనసాగిస్తున్నారు. దీంతో ఆ పుష్కరిణి వినియోగం ఆటకెక్కింది. దైవ కార్యాలకే విష్ణు పుష్కరిణి వినియోగిస్తామని ఆలయ అధికారులు చెబుతున్నారు. పంచనారసింహుల ఆలయ ఉద్ఘాటన జరిగి ఆర్నెళ్లు దాటినా ఆ పుష్కరిణి వినియోగానికి నోచుకోలేదు. బిందెతీర్థం, నిజాభిషేకం వంటి నిత్య కైంకర్యాల నిర్వహణకు మోక్షమెప్పుడో అని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ప్రధానాలయంలో ఏర్పాటు చేసిన బంగారు బావిలోంచి తెచ్చే నీటితో బిందెతీర్ధం, నిజాబిషేకం నిర్వహిస్తున్నారు.

విద్యుద్దీపాల హంగులు.. యాదాద్రి క్షేత్రాభివృద్ధిలో భాగంగా కొండపైన విష్ణు పుష్కరిణికి నలువైపులా విద్యుద్దీపాల ఏర్పాట్లు చేశారు. పునరుద్ధరిస్తున్న పుష్కరిణిని శోభాయమానంగా తీర్చిదిద్దే పనుల్లో భాగంగా.. ఇత్తడి వొంకులతో వైష్ణవతత్వం ప్రస్ఫుటించేలా విద్యుద్దీపాల బిగింపు పర్వం పూర్తయింది. ఫిల్డరింగ్ చేసే ప్రక్రియ కోసం కేబుల్ పనులు జరగాల్సి ఉందని దేవస్థాన అధికారులు తెలిపారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.