ETV Bharat / city

ఆలేరు రైల్వే అండర్​బ్రిడ్జి ఎందుకు అలంకారప్రాయమైంది? రోడ్డు విస్తరణకు ఆటంకాలేంటి?

author img

By

Published : Aug 26, 2021, 11:04 PM IST

UNDER BRIDGE
UNDER BRIDGE

ఆలేరు.. చారిత్రక సంపదకు పుట్టినిల్లు. జానపదానికి మెట్టినిల్లు. అక్కడి అభివృద్ధి అమోఘం! అక్కడ సంక్షేమం అజరామరం! ఇదంతా నేతల మాటలకే పరిమితమేమో అనిపిస్తోంది. రైల్వే అండర్​బ్రిడ్జి పూర్తయినా... అలంకారప్రాయంగానే మిగులుతోంది. రోడ్డు విస్తరణ "మూడు అడుగులు ముందుకు - ఆరు అడుగులు వెనక్కి" అన్న చందంగా సాగుతోంది. తప్పవరిదైనా.. బాధ్యులెవరైనా... అక్కడి ప్రజల అవస్థలు అనిర్వచనీయం! ఆలేరు జనం వ్యథలపై 'ఈటీవీ భారత్' ప్రత్యేక కథనం...

ఆలేరు రైల్వే అండర్​బ్రిడ్జి ఎందుకు అలంకారప్రాయమైంది? రోడ్డు విస్తరణకు ఆటంకాలేంటి?

'తెలంగాణ అభివృద్ధిలో దూసుకెళుతోంది. భారతావనికే ఆదర్శంగా నిలుస్తోంది. మన పథకాలు పక్క రాష్ట్రాలకే ఆదర్శం'.. ఇవీ పొద్దున లేస్తే మన నేతలు వల్లెవేసే మాటలు. కానీ క్షేత్రస్థాయిలో మాత్రం దీనికి విరుద్ధంగా కనిపిస్తోందనే విమర్శ వినిపిస్తోంది. సర్కారు నిధులిచ్చినా సద్వినియోగం చేసుకోవడంలో యంత్రాంగం విఫలమవుతుందేమో అనిపిస్తోంది. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులోని రైల్వేగేట్ అండర్​పాస్ బ్రిడ్జి పూర్తయింది. కానీ అక్కడి ప్రజలకు మాత్రం మనశ్శాంతి లేదు. ఎంతోకాలం నాటి కల నెరవేరినప్పటికీ.. ఆలేరు మోములో చిరునవ్వు కనిపించడం లేదు. అధికారుల చిత్తశుద్ధికి ఆలేరులో దుస్థితి నిదర్శనంగా నిలుస్తోంది.

రైల్వేగేటును మూసేశారు.. మళ్లీ...

ఆలేరులో రైల్వేలైన్​కు ఇరువైపులా పట్టణం విస్తరించి ఉంది. రైళ్ల రాకపోకలతో మధ్య గేటును తరచూ మూసివేస్తూ ఉండేవారు. ట్రాఫిక్ భారీగా స్తంభించేది. ప్రయాణికులు తీవ్ర ఇక్కట్లు పడేవారు. ప్రజల అవస్థలను దృష్టిలో పెట్టుకుని ఫ్లైఓవర్ నిర్మించారు. మధ్యగేటును పూర్తిగా మూసేశారు. కానీ అది దూరం కావడంతో ప్రజలు దానివైపు వెళ్లలేదు. దానివల్ల పెద్దగా ఉపయోగం లేకుండా పోయింది. రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు తలెత్తాయి. అఖిలపక్షం ఆందోళనకు దిగింది. ఎట్టకేలకు పాలకపక్షం, అధికార యంత్రాంగం స్పందించింది. 2019 అక్టోబర్ నుంచి రైల్వే మధ్యగేటు మళ్లీ తెరుచుకుంది.

ఆ బ్రిడ్జి అలంకారప్రాయమే...

ఆలేరులో అండర్​పాస్ బ్రిడ్జి అనేది అక్కడి ప్రజల చిరకాల కల. ఎట్టకేలకు 2019లో దీనికి బీజం పడింది. రూ.5.25 కోట్ల అంచనా వ్యయంతో పని ప్రారంభమైంది. అంతా అనుకున్నట్టుగానే జరిగిపోయింది. సకాలంలోనే బ్రిడ్జి నిర్మాణం పూర్తయింది. ఇక సమస్య పూర్తిగా తొలగిపోయినట్టేనని అందరూ భావించారు. కానీ.. అది నెరవేరడానికి రోజులు కాదు.. నెలలు కాదు.. ఏకంగా సంవత్సరాలే పడుతుందని గ్రహించలేకపోయారు. ప్రస్తుతం.. ఆ బ్రిడ్జి అంకారప్రాయంగానే మిగిలిపోయింది.

ఆ జాప్యమే కారణమా?

రైల్వేగేట్ అండర్ పాస్ బ్రిడ్జి నిర్మాణం పూర్తయింది. రోడ్ల విస్తరణ కూడా పూర్తయితే... ఇక సమస్య తీరినట్టే! కానీ.. అసలు చిక్కు ఇక్కడే వచ్చి పడింది. ఆ రోడ్ల విస్తరణే ముందుకు సాగడం లేదు. ఇళ్లు, దుకాణాల తొలగింపు ప్రక్రియ ఏడాది క్రితమే ప్రారంభమైంది. బాధితులకు నష్టపరిహారం విషయంలో జాప్యం జరగడంతో విస్తరణ ముందుకు సాగడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. పరిహారం చెల్లిస్తేనే పనులు ముందుకు సాగుతాయని బాధితులు చెబుతున్నారు.

ఉద్యమానికి సిద్ధం..

ఆలేరులో అండర్​పాస్ బ్రిడ్జి పూర్తయినా నిరుపయోగంగానే ఉంటోంది. రోడ్డు విస్తరణ ముందుకు సాగడం లేదు. ఆర్​అండ్​బీ అధికారుల నిర్లక్ష్యం అడుగడుగునా కనిపిస్తోంది. ఏడాదిన్నరగా ఎన్నో పోరాటాలు చేశాం. నిరాహార దీక్ష చేపట్టాం. ఇకనైనా అధికారులు స్పందించాలి. పాలకుల్లో చలనం రావాలి. లేకుంటే పెద్దఎత్తున ఉద్యమం చేపడతాం.

- బందెల సుభాశ్, భాజపా పట్టణ ప్రధాన కార్యదర్శి.

ప్రమాదమని తెలిసినా...

రైల్వేగేట్ వద్ద పాదచారులు ఇష్టానుసారంగా వెళుతున్నారు. గేట్ వేసుందా? తీసుందా?.. అనే దానితో సంబంధం లేకుండా అటూ ఇటూ నడిచేస్తున్నారు. ఎప్పుడు ఏ ట్రైన్ వస్తుందో.. ఎప్పుడు ఎలాంటి ప్రమాదం... జరుగుతుందోనని కొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అది ప్రమాదమని తెలిసినా తప్పడం లేదని మరికొందరు చెబుతున్నారు. తప్పెవరిదైనా.. కారణమేదైనా.. ఇది ముమ్మాటికీ ప్రమాదమే!

జర.. మా గోడునూ ఆలకించండి...

ఆలేరు రైల్వేగేట్ వద్ద 35 ఏళ్లుగా వ్యాపారాలు చేసుకుంటూ కుటుంబాలను పోషిస్తున్నామని బాధితులు చెబుతున్నారు. బ్రిడ్జి నిర్మాణం కోసం జరిపిన తవ్వకాలతో మా దుకాణాల ముందుభాగం కూలిపోయిందని, షాపులు నడపలేని దుస్థితి నెలకొందని కన్నీటి పర్యంతం అవుతున్నారు. మరోచోటకు షాపులు మార్చినప్పటికీ.. అక్కడ సరైన గిరాకీ లేదని వాపోతున్నారు. త్వరగా రోడ్డు విస్తరణ పూర్తిచేసి.. తమ సొంత దుకాణాల్లోనే మళ్లీ షాపులు నిర్వహించుకునేలా అవకాశం కల్పించాలని వేడుకుంటున్నారు.

రైల్వే అండర్​బ్రిడ్జి వర్షపు నీటితో మునిగిపోతోంది. ఆలేరు ప్రజల వ్యథలు తీరుస్తుందని ఆశించిన ఆ బ్రిడ్జి.. ప్రస్తుతం దోమలకు ఆవాసంగా మారింది. రోడ్డు విస్తరణ పనులు యుద్ధప్రాతిపదిన చేపట్టాలని ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్​రెడ్డి అధికారులను ఆదేశించారు. 55 మంది బాధితులు ఉన్నారని, వారందరికీ పరిహారం ఇస్తే ఆటంకం లేదని యంత్రాంగం ఎమ్మెల్యేకు వివరించింది. ఇకనైనా... రోడ్డు విస్తరణకు మోక్షం కలగాలని... ఆలేరు ప్రజల అవస్థలు తీరాలని ఆశిద్దాం.

ఇవీ చూడండి: RS PRAVEEN KUMAR: 'తెలంగాణ అసెంబ్లీని రేపే రద్దు చేసినా ఆశ్చర్యం లేదు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.