ETV Bharat / city

సాగుకు సై: తొలకరి పలకరించింది... ఎత్తిపోతలు సిద్ధమంటోంది!

author img

By

Published : Jun 16, 2020, 1:48 PM IST

Lift Irrigation works completing in khammam and bhadradri kothagudem
వానాకాలం పంట కోసం సిద్ధమవుతున్న ఎత్తిపోతలు...

రాష్ట్ర ప్రభుత్వం సాగునీటి రంగానికి అధిక ప్రాధాన్యం ఇస్తోంది. రైతులకు ఉచితంగా వ్యవసాయానికి పగలు నిరంతరాయంగా విద్యుత్తు సరఫరా చేస్తోంది. చెరువులు, కాలువలు, బోర్లు, బావులు, విద్యుత్తు మోటార్లతోపాటు ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో రాష్ట్ర నీటిపారుదల అభివృద్ధి సంస్థ (టీఎస్‌ ఐడీసీ) ఆధ్వర్యంలో ఎత్తిపోతల పథకాల కింద పంటల సాగుకు ఉచితంగా సాగునీరు అందిస్తున్నారు. ఇప్పటికే నిర్మించిన ఎత్తిపోతలను ఆధునీకరించటమే కాకుండా... పలు కొత్త పథకాల నిర్మాణాలు సైతం చేపట్టారు.

ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో 248 ఎత్తిపోతల పథకాల కింద 75,700 ఎకరాల ఆయకట్టు ఉంది. ఈ ఆయకట్టు కింద రైతులు పలు రకాల పంటలు సాగు చేస్తున్నారు. పూర్వ ఖమ్మం జిల్లాల్లో సుమారు 40 ఏళ్లుగా ఎత్తిపోతల పథకాల కింద పంటలు సాగవుతున్నాయి. కొన్నేళ్ల క్రితం నిర్మించిన చిన్న తరహా ఎత్తిపోతల పథకాల నిర్వహణ సక్రమంగా లేనందున అవి మొరాయిస్తున్నాయి. ఎత్తిపోతల పథకాలను ఐడీసీ అధికారులు నిర్మించి ఆయకట్టు రైతులకు అప్పగిస్తారు. వాటిని ఆయకట్టు రైతులు కమిటీగా ఏర్పడి నిర్వహించుకోవాలి. చిన్నపాటి మరమ్మతులు రైతు కమిటీలే చేయించుకోవాలి. ఐటీసీ ఇంజినీరింగ్‌ అధికారులు పర్యవేక్షిస్తుంటారు.

పెద్ద తరహా ఎత్తిపోతల పథకాలు మరమ్మతులకు గురైతే ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపుతారు. నిధులు మంజూరు అయిన తర్వాత పనులు చేపట్టి వాటిని వినియోగంలోకి తీసుకొస్తారు. దీంతోపాటు నీటి వనరులు, ఆయా ప్రాంతాల రైతుల అవసరాల మేరకు కొత్తగా ఎత్తిపోతల పథకాలను ప్రభుత్వం మంజూరు చేస్తోంది. ఇందులో భాగంగా రెండు జిల్లాల్లో ఎత్తిపోతల నిర్మాణ పనులు చేపట్టారు. ఇక మరమ్మతులకు గురైన పాత వాటిని ఆధునికీకరణకు మంజూరైన నిధులతో 3 ఎత్తిపోతల పథకాల పనులు చేపట్టారు.

ఎత్తిపోతల పథకాలకు ప్రభుత్వం ఉచితంగా విద్యుత్తు సరఫరా చేస్తోంది. 70 హెచ్‌పీ (అశ్వ శక్తి) మించిన విద్యుత్తు వినియోగించే మోటార్లు బిగించిన పథకాలకు హెచ్‌టీ విద్యుత్తు లైన్లు ద్వారా కరెంటు సరఫరా చేస్తున్నారు. మిగతా వాటికి ఎల్టీ లైన్లు ద్వారా సరఫరా చేస్తున్నారు. హెచ్‌టీ లైన్లు ద్వారా సరఫరా అయ్యే విద్యుత్తుకు బిల్లులు చెల్లించాల్సి ఉంటుంది. ఉభయ జిల్లాల్లో 46 ఎత్తిపోతల పథకాలకు హెచ్‌టీ లైన్లు ద్వారా విద్యుత్తు సరఫరా అవుతున్నందున గత ఆర్థిక సంవత్సరంలో రూ.5.38 కోట్ల విద్యుత్తు బిల్లు ఐడీసీ అధికారులు విద్యుత్తు శాఖకు చెల్లించింది. ప్రభుత్వం రైతులపై భారం పడకుండా విద్యుత్తు బిల్లు చెల్లించింది.

కల్లూరు మండలం కొర్లగూడెంలో వాగుపై ఎత్తిపోతల పథకం నిర్మాణ పనులు

నిర్మాణంలో ఉన్న ఎత్తిపోతల పథకాలు

* కల్లూరు మండలం కొర్లగూడెం-2 ఎత్తిపోతల పథకం కం చెక్‌డ్యాం నిర్మాణ పనులు చురుగ్గా సాగుతున్నాయి. ఈ పథకం నిర్మాణానికి ప్రభుత్వం రూ.4.41 కోట్లు మంజూరు చేసింది. ఈ పథకం పూర్తయితే 810 ఎకరాలకు సాగు నీరు అందుతుంది.

* మధిర మండలం మహదేవపురంలో ఎత్తిపోతల పథకం నిర్మాణానికి రూ.12.14 కోట్లు మంజూరు చేయగా నిర్మాణ పనులు చేపట్టారు. ఈ పథకం కింద 952 ఎకరాలు సాగులోకి రానుంది.

* బోనకల్లు మండలం రాపల్లె ఎత్తిపోతల పథకం నిర్మాణానికి రూ.12.87 కోట్లు మంజూరు చేశారు. నిర్మాణ పనులు సాగుతున్నాయి. ఈ పథకం కింద 1296 ఎకరాలు సాగులోకి రానుంది.

* చర్ల మండలంలో పెద్దమిడిసిలేరు ఎత్తిపోతల పథకం నిర్మాణానికి రూ.14.23 కోట్లు మంజూరు చేశారు. ఈ పథకం కింద 1153 ఎకరాలు సాగులోకి రానుంది.

ఆధునీకరణ పనులు...

* పాల్వంచ మండలం సూరారంలో ఎత్తిపోతల పథకం ఆధునికీకరణ పనులకు రూ.6.33 కోట్లు మంజూరవగా పనులు చేపట్టారు. ఈ పథకం కింద 975 ఎకరాల ఆయకట్టుంది.

* పాల్వంచ మండలం నాగారంలో ఎత్తిపోతల పథకం ఆధునికీకరణ పనులకు రూ.14.32 కోట్లు మంజూరు అవగా పనులు చేపట్టారు. ఈ పథకం కింద 1800 ఎకరాల ఆయకట్టుంది.

* ఖమ్మం గ్రామీణ మండలంలో దారేడు ఎత్తిపోతల పథకం ఆధునికీకరణ పనులకు రూ.1.54 కోట్లు మంజూరవగా ఇటీవలే టెండర్లు ఖరారయ్యాయి. పనులు ప్రారంభించాల్సి ఉంది. ఈ పథకం కింద 400 ఎకరాల ఆయకట్టుంది.

ఇదీ చదవండి: కరోనా టెస్టులు, చికిత్సల ధరలను ప్రకటించిన ప్రభుత్వం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.