ETV Bharat / city

20 ఏళ్ల తర్వాత బిడ్డల చెంతకు తల్లి... వారధిగా నిలిచిన ఈటీవీ భారత్​

author img

By

Published : Apr 23, 2021, 7:45 PM IST

రాష్ట్రం కాని రాష్ట్రం... భాష కాని భాష... కనీసం తనపేరేంటి.. తన వాళ్లెవరో కూడా చెప్పలేదు.. మతిస్తిమితం కోల్పోయి అయినవాళ్లకు దూరమైంది. నడిరోడ్డుపైనే చీర గుడిసెలో నివాసం. బిక్షాటనే జీవనాధారం.. ఇలా ఒకటా రెండా 20ఏళ్లు గడిపింది... ఈటీవీ భారత్​లో ప్రచురితమైన కథనం చూసిన ఓ స్వచ్ఛంద సంస్థ దయతో రెండేళ్లుగా ఆశ్రయం పొందింది. అనారోగ్యం నుంచి కోలుకుని తన వారి వివరాలు చెప్పింది. ఎట్టకేలకు 20 ఏళ్ల తర్వాత తన వాళ్లను కలుసుకుంది. కన్నపేగుకు దూరమైన బిడ్డలను.. ఇంటికి దూరమైన ఇల్లాలిని చెంతకు చేర్చిన ఈటీవీ భారత్​కు ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పింది ఆ కుటుంబం.

Telangana news
women Telangana news

రాదు.. లేదు అనుకున్నారు. తెలిసిన వాళ్లను అడిగారు.. కనిపించిన చోటల్లా వెతికారు.. ఒటకి రెండు కాదు... సుమారు 20 ఏళ్ల క్రితం దూరమైన తల్లి కోసం అన్ని ప్రయత్నాలు చేసిన కుటుంబ సభ్యులు చివరికి ఆమె మరణించి ఉంటుందనుకుని ఖర్మకాండలు నిర్వహించారు. కానీ అనుకోని విధంగా 20 ఏళ్ల తర్వాత తమ తల్లి జాడ తెలిస్తే ఆ కుటుంబం సంతోషంలో మునిగిపోయింది. పదేళ్ల ప్రాయంలో దూరమైన అమ్మను.. 30 ఏళ్ల వయస్సులో పిల్లల తండ్రి అయిన కొడుకు తడినయనాలతో తల్లికి స్వాగతం పలికాడు. తన తల్లిని చెంతకు చేర్చడంలో వారధిగా నిలిచిన ఈటీవీ భారత్​కు ప్రత్యేక ధన్యవాదాలు చెప్పుకున్నాడు. ఈ సన్నివేశం చూస్తున్నవారి హృదయాలు బరువెక్కాయి.

ఆ తల్లి… బిడ్డల చెంతకు ఎలా చేరిందంటే..

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో 20 ఏళ్లుగా ఓ మహిళ నడిరోడ్డుపైనే చీరలతో గుడిసె వేసుకుని జీవించేది. మతిస్తిమితిం లేని ఆమె భిక్షాటన చేసుకుని బతికేది. ఆమె దీనస్థితిపై 2018లో ఈనాడులో ప్రచురితమైన కథనం చూసి స్పందించిన అప్పటి తహసీల్దారు ఆమెను భద్రాచలంలోని సరోజిని వృద్ధాశ్రమంలో చేర్పించారు. అయితే అక్కడ నుంచి వచ్చేసిన ఆమె భద్రాచలంలోని బ్రిడ్జి సెంటర్లో మళ్లీ చీరలతో పాక వేసుకొని ఉండేది. ఆమె పరిస్థితిని గురించి "నడిరోడ్డే ఆవాసం... చీరగుడిసె నివాశం" శీర్షికతో ఈటీవీ భారత్​లో ప్రచురితమైన కథనం చూసిన ఖమ్మం లోని అన్నం సేవా ఫౌండేషన్​ వ్యవస్థాపకులు అన్నం శ్రీనివాసరావు ఆమెను చేరదీసి.. వసతి, వైద్యం చేయించారు. రెండేళ్ల తర్వాత కోలుకున్న ఆమె తన కుటుంబ సభ్యుల వివరాలు చెప్పింది. వాటిని సరిపోల్చుకున్న తర్వాత ఉత్తర్​ప్రదేశ్​లోని బాందా జిల్లాలో ఉన్న వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందించగా.. ఆమె కుమారుడు వచ్చి తల్లిని గుర్తుపట్టాడు.

ఎక్కడ బతికిందో.. అక్కడే..

20 ఏళ్లుగా ఆమె గడిపిన ప్రదేశంలోనే అందరి సమక్షంలో తల్లిని బిడ్డకు అప్పగించారు. చనిపోయిందనుకున్న తల్లిని తమ చెంతకు చేర్చినందుకు అన్నం సేవా ఫౌండేషన్​కు వారధిగా నిలిచిన ఈటీవీ భారత్​కు తల్లీ బిడ్డలు కృతజ్ఞతలు తెలిపారు.

ఇదీ చూడండి: నడిరోడ్డే ఆవాసం... చీర గుడిసే నివాసం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.