శిథిలావస్థలో ప్రభుత్వ పాఠశాల.. ఆరుబయట పాఠాలు

author img

By

Published : Jul 21, 2022, 2:16 PM IST

Metpally Government school

Metpally Government school: ఈ ప్రభుత్వ పాఠశాల ఎంతో మందిని జిల్లా కలెక్టర్లు.. తహసీల్దారులు.. ఎమ్మెల్యేలు.. ప్రజాప్రతినిధులుగా తీర్చిదిద్దింది. అంత ఉత్తమమైన ఈ పాఠశాల ప్రస్తుతం శిథిలావస్థకు చేరి ఎప్పుడు ఏం జరుగుతుందో అన్న భయం గుప్పెట్లో సర్కారు సదువులు సాగుతున్నాయి. ప్రమాదకరంలో ఉన్న ఆ భవనంలో బిక్కుబిక్కుమంటూ చదువుకుంటున్న విద్యార్థులపై ఈటీవీ భారత్​ ప్రత్యేక కథనం.

Metpally Government school: జగిత్యాల జిల్లా మెట్​పల్లిలోని కొత్త బస్టాండ్ సమీపంలో గల ప్రభుత్వ ఉన్నత పాఠశాల. 1966 లో అప్పటి ఖాదీ సమితి అధ్యక్షుడు స్వామి రామానంద తీర్థ ఈ పాఠశాలను ప్రారంభించారు. ప్రస్తుతం ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు కొనసాగుతున్న ఈ పాఠశాలలో సుమారుగా 100 మంది వరకు విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. అప్పటినుంచి ఇప్పటివరకు ఈ పాఠశాలకు ఎలాంటి మరమ్మతులు చేయకపోవడంతో పూర్తిగా పాఠశాల భవనం శిథిలావస్థకు చేరింది. దీంతో తరచూ తరగతి గదుల్లో పైకప్పు పెచ్చులు ఊడి విద్యార్థులపై పడుతున్నాయి.

చిన్నపాటి వర్షం పడితే చాలు వాన నీరంతా తరగతి గదుల్లోకి చేరి విద్యార్థుల పుస్తకాలను తడిపి వేస్తున్నాయి. పాఠశాలలో ఎటు చూసినా ఊడిన పెచ్చులతో పాటు, ఇనుప చువ్వలు బయటకు తేలిన భయంకరమైన దృశ్యాలు సర్కారు పాఠశాలలో దర్శనమిస్తున్నాయి. భవనం చుట్టూ పెద్దపెద్ద వృక్షాలు ఉండడంతో ఈదురుగాలులు వచ్చిన ప్రతీసారి ఏదో ఒక చెట్టు పాఠశాలపై పడటం.. విద్యార్థులు భయాందోళనకు గురికావడం పరిపాటిగా మారింది. గత నాలుగు రోజుల నుంచి భారీగా వర్షాలు కురవడంతో గోడలన్నీ పూర్తిగా తడిచిపోయి ప్రమాదకరంగా మారాయి.

పాఠశాలలో ఎప్పుడు ఏం జరుగుతుందో అని అటు విద్యార్థులు, ఇటు ఉపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారు. ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగకుండా ఉండేందుకు ఉపాధ్యాయులు ముందస్తు చర్యలలో భాగంగా విద్యార్థులకు చెట్ల కింద పాఠాలు బోధిస్తున్నారు. ల్యాబ్ కోసం నూతనంగా నిర్మించిన ఓ భవనంలో రెండు తరగతులను, వరండాలో ఒక తరగతి, చెట్టు కింద మరో రెండు తరగతులను నిర్వహిస్తున్నారు. ఇలా విద్యార్థులంతా ఒకే చోట ఉండి విద్యా బోధన నేర్చుకోవడంతో అర్థం కావడం లేదని కొందరు, చదువు నష్టపోతున్నామని మరికొంతమంది బాధిత విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రానున్న రోజుల్లో విద్యార్థులకు, ఉపాధ్యాయులకు ఎలాంటి ప్రమాదాలు జరగకముందే ప్రభుత్వం మేలుకొని శిథిలావస్థలో ఉన్న భవనాన్ని పూర్తిగా తొలగించి నూతన భవనాన్ని నిర్మించి ఆదుకోవాలని విద్యార్థులు, ఉపాధ్యాయులు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.