ETV Bharat / city

KTR on MLC Results: ఆ విషయం మరోసారి రుజువైంది : కేటీఆర్​

author img

By

Published : Dec 14, 2021, 3:49 PM IST

minister ktr
minister ktr

KTR on MLC Results: స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల్లో తెరాస విజయంపై ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్​ హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనకు ప్రజలు ప్రతి ఎన్నికలోనూ పట్టం కడుతున్నారని అన్నారు. విజయం సాధించిన అభ్యర్థులకు శుభాకాంక్షలు తెలిపారు.

KTR on MLC Results : తెరాస తిరుగులేని రాజకీయ శక్తి అని.. స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఘన విజయంతో మరోసారి రుజువైందని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్​ పేర్కొన్నారు. రాష్ట్రావిర్భావం తర్వాత ఏ ఎన్నిక జరిగినా... తెరాస ఘన విజయం సాధిస్తోందన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించిన తెరాస అభ్యర్థులకు శుభాకాంక్షలు తెలిపిన కేటీఆర్... ఓటేసిన స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులకు ధన్యవాదాలు తెలిపారు.

ఆ కార్యక్రమాల ఫలితంగానే

TRS Wins MLC Election 2021: ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనకు ప్రజలు ప్రతి ఎన్నికలోనూ పట్టం కడుతున్నారని కేటీఆర్ అన్నారు. తెరాస హయాంలో స్థానిక సంస్థలు బలపడ్డాయని తెలిపారు. ముఖ్యంగా పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి ద్వారా నిధులను అందించడంతో స్థానిక సంస్థలను ఆర్థికంగా బలోపేతం చేశామని వివరించారు. ప్రభుత్వ కార్యక్రమాల ఫలితంగానే స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు తెరాస అభ్యర్థులకు ఘన విజయం అందించారన్నారు.

మంత్రి ఎర్రబెల్లికి ఫోన్

స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఘన విజయం సాధించడం పట్ల ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇంఛార్జీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావును మంత్రి కేటీఆర్ అభినందించారు. పాలకుర్తి నియోజకవర్గ పర్యటనలో ఉన్న ఎర్రబెల్లికి ఫోన్ చేశారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారీ మెజారిటీ రావడం పట్ల అభినందించారు. అందరినీ సమన్వయం చేయడంలో మంత్రి ఎర్రబెల్లి కృషి చేశారని కొనియాడారు. ఇదే స్ఫూర్తిని కొనసాగించాలని అన్నారు.

పలువురు నేతలు శుభాకాంక్షలు

స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీకి ఎన్నికైన తెరాస అభ్యర్థులకు పలువురు నేతలు శుభాకాంక్షలు తెలిపారు. ప్రతిపక్షాల కుట్రలను స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు తిప్పి కొట్టారని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. రాష్ట్రంలో తెరాసకు తిరుగులేని ఆదరణ ఉందని మరోసారి రుజువైందంటూ ట్వీట్ చేశారు. తెరాస ప్రభుత్వ హయాంలో గతంలో ఎన్నడూ లేనంతగా స్థానిక సంస్థలు బలోపేతమయ్యాయని అన్నారు. మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, ఇంద్రకరణ్ రెడ్డి, తదితరులు హర్షం వ్యక్తం చేశారు. కేసీఆర్ ప్రభుత్వ విజయంగా అభివర్ణించారు.

తెరాస విజయఢంకా

స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల్లో తెరాస విజయఢంకా మోగించింది. ఐదు ఉమ్మడి జిల్లాల్లో ఆరు స్థానాలకు జరిగిన ఎన్నికల్లో అన్నిస్థానాల్లోనూ తెరాస గెలుపొందింది. ఖమ్మం, నల్గొండ, మెదక్, ఆదిలాబాద్​, కరీంనగర్​లోని రెండు స్థానాలు గులాబీ వశమయ్యాయి. రంగారెడ్డి, మహబూబ్‌నగర్ ఉమ్మడి జిల్లాలకు చెందిన రెండు చొప్పున స్థానాలు, వరంగల్, నిజామాబాద్ జిల్లాలకు చెందిన ఒకటి చొప్పున స్థానాలకు ఇప్పటికే ఏకగ్రీవమయ్యాయి.

సంబంధిత కథనం : స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెరాస ఘనవిజయం

తెలంగాణ భవన్​లో సంబురాలు

స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో 12కు 12 స్థానాలు గెలుపొందడంతో.... తెరాస శ్రేణుల సంబరాలు అంబరాన్నంటాయి. తెలంగాణ భవన్‌లో డప్పుచప్పుళ్లు, డీజే మోతలతో గులాబీ శ్రేణులు ఆడిపాడుతున్నారు. పార్టీ శ్రేణులు పటాకులు పేలుస్తూ ఉత్సాహంగా గంతులేశారు.

సంబంధిత కథనం : తెలంగాణ భవన్‌లో అంబరాన్నంటిన సంబరాలు...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.