ETV Bharat / city

గర్భసంచులు కోసేస్తున్నారు.. తెలుగు రాష్ట్రాల్లోనే ఎక్కువ..!

author img

By

Published : May 7, 2022, 7:10 AM IST

గర్భసంచుల తొలగింపులో తెలుగు రాష్ట్రాలు దేశంలోనే అగ్రస్థానంలో నిలిచాయి. కేంద్ర ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే-5 (2019-21) చివరి రౌండ్‌ వివరాల ప్రకారం 15-49 ఏళ్ల వయసు మహిళల్లో ఆంధ్రప్రదేశ్‌లో 8.7%, తెలంగాణలో 8.2% మందికి గర్భసంచులు తొలగించారు. టీనేజ్‌ తల్లుల్లో ఆంధ్రప్రదేశ్‌ మూడోస్థానంలో నిలిచింది.

Uterus removing surgeries highly performing in the Telugu states only
Uterus removing surgeries highly performing in the Telugu states only

జాతీయ స్థాయిలో సగటున 3.3% మంది మహిళలకు గర్భసంచులు తొలగించగా తెలుగు రాష్ట్రాల్లో అంతకు రెండున్నర రెట్ల సంఖ్యలో ఈ శస్త్రచికిత్సలు జరిగాయి. వీటి విషయంలో తెలుగు రాష్ట్రాల దరిదాపుల్లో బిహార్‌ (6%) తప్ప మరే రాష్ట్రం లేదు. జాతీయస్థాయిలో 40-49 ఏళ్ల మధ్య వయసు మహిళల్లో (9.7%) ఎక్కువగా తొలగించారు. గ్రామీణ ప్రాంతాల్లో సగటున 34 ఏళ్లు, పట్టణ ప్రాంతాల్లో 36.5 ఏళ్లలో మహిళలకు గర్భసంచులు తొలగించేస్తున్నారు. ఇందులో 30% ఆపరేషన్లు ప్రభుత్వరంగ ఆసుపత్రుల్లో జరుగుతుంటే, 70% ప్రైవేటు ఆసుపత్రుల్లో సాగుతున్నాయి. సామాజికవర్గాలవారీగా చూస్తే ఓబీసీ మహిళల్లో (3.6) అత్యధికంగా గర్భసంచులను తొలగించారు. ఆ తర్వాతి స్థానంలో జనరల్‌ (3.2%), ఎస్సీ (3.1%), ఎస్టీ (2.2) మహిళలున్నారు. ఏ సామాజికవర్గమో తెలియని వారు 3.7% మంది కనిపించారు. ఆదాయపరంగా చూస్తే మధ్యతరగతి మహిళలు (3.7%) ఈ కోతలకు ఎక్కువ లోనయ్యారు. అత్యధిక ఆదాయ వర్గాల్లో (2.8%) కోతల సమస్య తక్కువగానే ఉంది.

మేనరిక వివాహాలు దక్షిణాదిలో అధికం.. : మేనరిక వివాహాలు దక్షిణాదిలో అధికంగా ఉన్నట్లు ఈ సర్వేలో వెల్లడైంది. ఇందులో తమిళనాడు, కర్ణాటకలు తొలి రెండు స్థానాలను ఆక్రమిస్తే ఆంధ్రప్రదేశ్‌ 3, తెలంగాణ 5వ స్థానంలో నిలిచాయి.

టీనేజ్‌ తల్లుల్లో తెలంగాణకు పదమూడో స్థానం..: 15-19 ఏళ్ల వయసులోపే అత్యధిక మంది తల్లులు అవుతున్న రాష్ట్రాల జాబితాలో ఆంధ్రప్రదేశ్‌ మూడోస్థానంలో నిలిచింది. ఈ జాబితాలో త్రిపుర (22%), పశ్చిమబెంగాల్‌ (16%) తర్వాతి స్థానాన్ని ఆంధ్రప్రదేశ్‌ (13%) ఆక్రమించింది. ఇది జాతీయ సగటు 6.8%కంటే దాదాపు రెట్టింపు. ఈ విషయంలో తెలంగాణ (5.8%) 13వ స్థానంలో నిలిచింది.

వార్తాపత్రికలు చదవడం తెలంగాణలోనే ఎక్కువ..: తెలుగురాష్ట్రాల్లో వారంలో కనీసం ఒక్కసారైనా వార్తాపత్రికలు, మేగజీన్లు చదివే అలవాటు తెలంగాణ పురుషుల్లో 41.6% మందికి ఉంది. ఇది ఏపీలో 35.1%కే పరిమితమైంది. ఇంటర్‌నెట్‌ వినియోగంలో తెలంగాణ (50%), ఆంధ్రప్రదేశ్‌ (41.9%) లు దక్షిణాదిలో చివరిస్థానంలో ఉన్నాయి.

శానిటరీ న్యాప్‌కిన్ల వినియోగంలో ఏపీ వెనుకబాటు..: శానిటరీ న్యాప్‌కిన్ల వినియోగం తెలంగాణ (81.2%)లో కంటే ఆంధ్రప్రదేశ్‌ (69.2%)లో తక్కువగా ఉంది. ప్రస్తుతం అత్యాధునికంగా అందుబాటులోకి వచ్చిన మెన్‌స్ట్రువల్‌ కప్‌ల వినియోగం తెలంగాణ (1.1%)లో అధికంగా ఉంది.

వైద్య బీమాలో ఏపీది రెండోస్థానం..: వైద్య బీమా అందించడంలో ఏపీ దేశంలో రెండోస్థానంలో ఉంది. 80% కుటుంబాల్లో ఒక్కరికైనా ఈ సదుపాయం ఉంది. 88% కవరేజీతో రాజస్థాన్‌ తొలిస్థానంలో నిలిచింది. దేశవ్యాప్తంగా సగటున 41% మందికి ఆరోగ్యబీమా అందుబాటులో ఉంది. ఈ విషయంలో తెలంగాణ (69%) 5వ స్థానంలో నిలిచింది.

...
...


ఇవీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.