ETV Bharat / city

తలకు హెల్మెట్ ధరించరు.. ఒంటికి సీట్ బెల్ట్ బిగించరు

author img

By

Published : Oct 30, 2020, 9:58 AM IST

శిరస్త్రాణం, సీటు బెల్ట్‌ వంటి స్వీయ జాగ్రత్తలు పాటించటంలో నిర్లక్ష్యం, భద్రతా నిబంధనల పట్టనితనం ఫలితంగా నిత్యం పదుల మంది రహదారి ప్రమాదాల్లో బలైపోతున్నారు. బైకులు, కార్లలో ప్రయాణించే సమయంలో ప్రమాదానికి గురైనప్పుడు శిరస్త్రాణం, సీటుబెల్ట్‌ ధరించి ఉండకపోవటం వల్ల గత నాలుగేళ్లలో ఆంధ్రప్రదేశ్​ వ్యాప్తంగా 9,485 మంది ప్రాణాలు కోల్పోయారు. చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే ప్రమాదానికి గురైనా ప్రాణాలతో బయటపడే వీలుంటుంది. అలా చేయకపోవటం వల్ల రోడ్డు ప్రమాదాల్లో తలకు, ఛాతికి బలమైన గాయాలై ప్రాణనష్టం జరుగుతోంది. గతేడాది దేశంలో జరిగిన రోడ్డు ప్రమాదాలకు సంబంధించి కేంద్ర ఉపరితల రవాణా మంత్రిత్వ శాఖ తాజాగా విడుదల చేసిన నివేదిక ఈ విషయాల్ని స్పష్టం చేస్తోంది.

తలకు హెల్మెట్ ధరించరు.. ఒంటికి సీట్ బెల్ట్ బిగించరు
తలకు హెల్మెట్ ధరించరు.. ఒంటికి సీట్ బెల్ట్ బిగించరు

ఏపీలో గత నాలుగు సంవత్సరాల్లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఏటా సగటున 8,035 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రమాద సమయంలో శిరస్త్రాణం, సీటుబెల్ట్‌ ధరించి ఉండకపోవటం వల్ల ఏటా సగటున 2,371 మంది మరణించారు.

అలా చేస్తే ఏటా 40 శాతం తగ్గుదల..

2016లో సంభవించిన మొత్తం ప్రమాద మరణాల్లో 8.35 శాతం మరణాలకు సీటుబెల్ట్‌, శిరస్త్రాణం ధరించకపోవటం కూడా కారణంగానే నిలుస్తోంది. 2019 నాటికి ఇది 41.92 శాతానికి చేరటం తీవ్రతకు అద్దం పడుతోంది. శిరస్త్రాణం ధరించినా, సీటుబెల్ట్‌ పెట్టుకున్నా ఏటా ప్రమాద మరణాల సంఖ్యను కనీసం 40 శాతం తగ్గించేందుకు అవకాశం ఉంటుంది.

చోదకులే కాదు... ప్రయాణికులు కూడా..

ద్విచక్రవాహనాలపై వెళ్లేవారిలో వాహనం నడిపే వ్యక్తి శిరస్త్రాణం పెట్టుకుంటే సరిపోతుంది కదా అనే భావనతో చాలా మంది ఉంటున్నారు. ఇది ఏ మాత్రమూ సరికాదని పోలీసులు చెబుతున్నారు. వాహన చోదకుడితో పాటు వెనుక కూర్చొనే వ్యక్తులు కూడా శిరస్త్రాణం పెట్టుకోవటమే సురక్షితమని సూచిస్తున్నారు.

హెల్మెట్ ధరించకపోవడం వల్లే..

ప్రమాద సమయంలో శిరస్త్రాణం ధరించకపోవటం వల్ల గతేడాది 2,636 మంది ప్రాణాలు కోల్పోగా.. వారిలో 775 మంది (29.40 శాతం) ద్విచక్రవాహనంపై వెనుక కూర్చొని ఉన్నవారే కావటం గమనార్హం.

సీటు బెల్ట్ పెట్టుకోకపోవడం వల్లే..

కార్లలో ప్రయాణించేవారు ప్రమాద సమయంలో సీటుబెల్ట్‌ పెట్టుకోకపోవటం వల్ల గతేడాది 711 మంది మరణించారు. వీరిలో 335 మంది (47.11 శాతం) వాహన చోదకులు కాగా.. 376 మంది (52..88 శాతం) మంది ప్రయాణికులే.

ఇదీ చూడండి: ధరణి పోర్టల్​లో రిజిస్ట్రేషన్​ ఇలా చేసుకోండి...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.