ETV Bharat / city

కేంద్రంపై తెరాస వడ్ల వార్.. దిల్లీ వేదికగా కేసీఆర్ సమరశంఖం

author img

By

Published : Apr 11, 2022, 11:54 AM IST

TRS Protest in Delhi : కేంద్ర సర్కార్‌పై తెరాస వడ్ల పోరు షురూ అయింది. దేశ రాజధాని వేదికగా మోదీ ప్రభుత్వంపై ముఖ్యమంత్రి కేసీఆర్ యుద్ధం ప్రకటించారు. గులాబీ సేనలతో హస్తిన గడ్డపై పోరాట బావుటా ఎగురవేశారు. తెలంగాణ భవన్‌ వద్ద అంబేడ్కర్ విగ్రహానికి నివాళులర్పించి దీక్షా ప్రాంగణానికి చేరుకున్నారు. రైతుల పక్షాన ప్రజాప్రతినిధుల నిరసన దీక్ష పేరుతో కేంద్రంపై గులాబీ బాస్ సమరశంఖం పూరించారు.

TRS Protest in Delhi
TRS Protest in Delhi

TRS Protest in Delhi : ధాన్యం సేకరణ దేశవ్యాప్తంగా ఒకే విధానంలో ఉండాలనే ప్రధాన డిమాండ్‌తో తెరాస కేంద్ర సర్కార్‌పై సమరశంఖం పూరించింది. దేశ రాజధాని వేదికగా.. గులాబీ శ్రేణులు ధర్నాకు దిగాయి. తెరాస అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో యాసంగి ధాన్యం కొనాలనే డిమాండ్‌తో మోదీ సర్కార్‌పై వడ్ల దంగల్‌ షురూ అయింది.

TRS Protest in Delhi
కేంద్రంపై తెరాస వడ్ల వార్

గులాబీ నినాదాలు : దిల్లీలోని తెలంగాణ భవన్ ప్రాంగణం వద్ద అంతకుముందు కేసీఆర్‌.. తెలంగాణ అమరవీరుల స్థూపం, అంబేడ్కర్‌, మహాత్మ జ్యోతిబాపూలే విగ్రహాలకు నివాళులు అర్పించారు. తెలంగాణ తల్లికి పుష్పాలు సమర్పించారు. వేదికపై కేసీఆర్‌, టికాయత్‌లతో పాటు పార్లమెంటరీ పార్టీ నేత కె.కేశవరావు, లోక్‌సభాపక్ష నేత నామా, రైతుబంధు సమితి ఛైర్మన్‌ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, మంత్రి నిరంజన్‌రెడ్డి తదితరులు కూర్చున్నారు. ఈ దీక్షకు రాష్ట్రం నుంచి తెరాస ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. 'రైతుల పక్షాన ప్రజాప్రతినిధుల నిరసన దీక్ష' పేరుతో హస్తినలో తెరాస దీక్ష చేపడుతోంది.

కేంద్రానికి అల్టిమేటం : ఇప్పటికే కేంద్రం యాసంగి ధాన్యం కొనాలనే డిమాండ్‌తో దీక్ష చేపడుతున్న తెరాస.. మోదీ సర్కార్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తోంది. గులాబీ శ్రేణుల నినాదాలతో.. తెలంగాణ భవన్ ప్రాంగణం మార్మోగింది. వరి ధాన్యం కొనుగోళ్లపై తెరాస కేంద్రానికి అల్టిమేటం ఇవ్వనున్నట్లు సమాచారం. దీక్ష వేదికపై నుంచి కేసీఆర్‌.. తెరాస తదుపరి కార్యాచరణ ప్రకటించే అవకాశం ఉంది.

అంత మాటన్నారు : రైతులకు నూకలు అలవాటు చేయాలని కేంద్రమంత్రి అన్నారని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి గుర్తుచేశారు. తెలంగాణ రైతులను అవమానించిన కేంద్రానికి తగిన గుణపాఠం చెప్పి తీరతామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం అనేది వ్యాపార సంస్థ కాదన్న మంత్రి.. ప్రజల మనసెరిగి పాలిస్తేనే ఏ పార్టీకైనా మనుగడ ఉంటుందని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని, ప్రజలను కేంద్రం దిల్లీకి రప్పించిందన్న నిరంజన్ రెడ్డి.. దిల్లీలో రైతులు 13 నెలలు ఉద్యమం చేస్తే కేంద్రం దిగి వచ్చిందని పేర్కొన్నారు. కేంద్రం ప్రజలను ఎంత కాలం మోసం చేయగలుగుతుందని ప్రశ్నించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.