KTR: అక్టోబరులో తెరాస ప్లీనరీ.. అదే నెలలో పార్టీ రాష్ట్ర కార్యవర్గం

author img

By

Published : Sep 14, 2021, 7:49 AM IST

TRS PLENARY MEETING IN OCTOBER

తెరాస ప్లీనరీ, పార్టీ ద్విదశాబ్ధి బహిరంగ సభను అక్టోబరులో నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ వెల్లడించారు. అదే నెలలో పార్టీ రాష్ట్ర కార్యవర్గం నిర్వహించనున్నట్లు తెలిపారు.

తెలంగాణ రాష్ట్ర సమితి ప్లీనరీ, పార్టీ ద్విదశాబ్ది బహిరంగ సభను అక్టోబరులో నిర్వహిస్తామని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్‌ తెలిపారు. అదే నెలలో రాష్ట్ర కార్యవర్గం ఏర్పాటై సంస్థాగత ఎన్నికల ప్రక్రియ పూర్తవుతుందన్నారు. పార్టీ మండల కమిటీలను 20వ తేదీ నాటికి పూర్తి చేసి, ఆ తర్వాత జిల్లా కమిటీలపై దృష్టి సారిస్తామన్నారు. జిల్లా కమిటీలో ఒక ఉపాధ్యక్ష, మరో కార్యనిర్వాహక కార్యదర్శి పదవి మహిళలకు కేటాయిస్తామని, ఇందుకోసం పార్టీ నియమావళిలో మార్పులు చేస్తామన్నారు.

హైదరాబాద్‌ నగరంలో పార్టీ ఎన్నికలపై రెండు రోజుల్లో నిర్ణయం తీసుకుంటామన్నారు. సోమవారం తెలంగాణ భవన్‌లో పార్టీ ప్రధాన కార్యదర్శులతో ఆయన సమావేశమయ్యారు. పార్టీ సెక్రెటరీ జనరల్‌ కేశవరావు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సంస్థాగత ఎన్నికలపై చర్చించారు. నియోజకవర్గాల వారీగా పరిస్థితిని సమీక్షించారు.

అనంతరం కేటీఆర్‌ మాట్లాడుతూ.. ‘‘తెరాస గ్రామ, వార్డు కమిటీల ఎన్నికల ప్రక్రియ ఈ నెల 15తో ముగుస్తుంది. ఆ వెంటనే మండల కమిటీల ఎన్నికలుంటాయి. 20-30 తేదీ మధ్య జిల్లా కమిటీల ఏర్పాటు జరుగుతుంది. ఆ తర్వాత పార్టీ రాష్ట్ర కార్యవర్గం ఎంపికవుతుంది. అనంతరం పార్టీ ప్లీనరీ నిర్వహిస్తాం. దీనికి 13వేల మంది క్రియాశీలక సభ్యులను ఆహ్వానిస్తాం. ఆ తర్వాత భారీఎత్తున ద్విదశాబ్ది సభ నిర్వహిస్తాం. పార్టీ మండల, జిల్లా కమిటీలను స్థానిక మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర నేతలు సమన్వయం చేసుకుంటూ పనిచేయాలి. మండల కమిటీలో 22, జిల్లా కమిటీలో 24 మంది ఉండాలి. జిల్లా అధ్యక్ష పదవుల కోసం సామాజిక సమీకరణలు, ఉద్యమనేపథ్యం, అంకితభావం తదితర అంశాలను పరిగణనలోనికి తీసుకొని నలుగురేసి అభ్యర్థుల పేర్లను ప్రతిపాదించాలి. అందులో అర్హులైన వారిని సీఎం కేసీఆర్‌ ప్రకటిస్తారు’’ అని కేటీఆర్‌ తెలిపారు.

పార్టీ సంస్థాగత ఎన్నికల కమిటీల్లో 51 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, మహిళలకు అవకాశమివ్వాలని అధిష్ఠానం సూచించినా... అంతకంటే అధికంగా 75 శాతం వరకు ఇవ్వాల్సి వస్తోందని పార్టీ ప్రధాన కార్యదర్శులు కేటీఆర్‌కు వెల్లడించగా ఆయన స్వాగతించారు. దానిని ప్రోత్సహించాలన్నారు.

హైదరాబాద్‌కు జిల్లా కమిటీయే

హైదరాబాద్‌లో ఎన్నికలకు సంబంధించి కేటీఆర్‌ స్పష్టత ఇచ్చినట్లు తెలిసింది. రాష్ట్రంలో 33 జిల్లాలకు కమిటీల ఏర్పాటు చేయాలనేది సీఎం, పార్టీ అధ్యక్షుడు కేసీఆర్‌ నిర్ణయమని కేటీఆర్‌ వెల్లడించినట్లు సమాచారం. దీంతో జీహెచ్‌ఎంసీ పరిధిలో గాకుండా హైదరాబాద్‌ జిల్లాకే ప్రత్యేక కమిటీ ఏర్పాటవుతుందని పేర్కొన్నట్లు తెలిసింది. మరో రెండు రోజుల్లో జీహెచ్‌ఎంసీ పరిధిలోని మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రధాన కార్యదర్శులతో సమావేశమై ఈ నిర్ణయాన్ని అధికారికంగా వెల్లడించే వీలుంది.

ఇదీ చూడండి: GOVT HOSPITALS: పల్లెకో ఆసుపత్రి.. వైద్యసేవల విస్తరణకు ప్రభుత్వ నిర్ణయం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.